'టీ సర్కార్ 5.6 టీఎంసీల నీటిని వాడుకుంది'
కర్నూలు : శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉదయం అధికారికంగా నిలిపివేసింది. కృష్ణా బోర్డు ఆదేశాలను పాటిస్తూ మూడు టీఎంసీలు వాడుకుని విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినా అది కూడా వివాదంగా మారింది. ఈరోజు ఉదయం వరకూ మూడు టీఎంసీల వాడకం పూర్తవుతుందని పేర్కొంటూ ఆ తర్వాతే ఉత్పత్తిని ప్రభుత్వం నిలిపివేసింది.
అయితే కృష్ణా బోర్డు మూడు టీఎంసీల నీటిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని సూచించినా .... తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5.6 టీఎంసీల నీటిని ఉపయోగించుకుందని ఏపీ ఇరిగేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు.దీనిపై కృష్ణా బోర్డు బోర్డుకు ఫిర్యాదు చేయనున్నారు.
కాగా మరోవైపు ఆదివారం సాయంత్రానికే మూడు టీఎంసీల కోటాను తెలంగాణ వాడుకుందని, అయినా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించటాన్ని ఏపీ సర్కార్ తప్పుబడుతోంది. ఆదివారం వరకూ ఉత్పత్తి చేయాలన్న బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని. దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తోంది.
కాగా కృష్ణా బోర్డు ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయని తప్పుబట్టిన తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుత నీటిమట్టం 857.50 అడుగులు ఉండగా, ఇన్ఫ్లో 8,800 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2050 క్యూసెక్కులుగా ఉంది.