power generation at Srisailam
-
జల విద్యుదుత్పత్తి ఈ ఏడాదీ 100 శాతం
సాక్షి, హైదరాబాద్: జల విద్యుదుత్పత్తి విషయంలో తగ్గేదే లేదన్న ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జలాశయాల్లో నిల్వలు, సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా గతేడాది తరహాలో ఈ ఏడాది కూడా 100 శాతం సామర్థ్యంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నట్టు తెలంగాణ జెన్కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు వెల్లడించాయి. రానున్న వర్షా కాలంలో ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభమైన వెంటనే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభిస్తామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ అలా.. రాష్ట్రం ఇలా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా శ్రీశైలంలో తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరుపుతోందని ఏపీ ఆరోపిస్తుండగా..విద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మాణం జరిగిందంటూ రాష్ట్రం వాదిస్తోంది. రాష్ట్ర అవసరాల మేరకు జలవిద్యుదుత్పత్తి కొనసాగిస్తామని, జల విద్యుత్ కేంద్రాలపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పెత్తనాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెబుతోంది. దుర్వినియోగం కాదు.. 2500 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన తెలంగాణలోని జలవిద్యుత్ కేంద్రాల్లో 100 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాలని జెన్కోను ఆదేశిస్తూ గతేడాది జూన్ 28న తెలంగాణ ఇంధన శాఖ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేయడంతో నీళ్లు వృథాగా సముద్రం పాలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీశైలం జలాశయం వేసవికి ముందే ఖాళీ అయింది. కృష్ణా నదికి గతేడాది 1,100 టీఎంసీలు రాగా, ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 5 టీఎంసీలకు మించి నిల్వలు లేవు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరిపి శ్రీశైలం జలాశయాన్ని దుర్వినియోగం (మిస్ మ్యానేజ్మెంట్) చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే రాష్ట్ర విద్యుత్ అవసరాలు భారీగా పెరిగిపోయాయని, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు జల విద్యుదుత్పత్తి తప్ప మరో మార్గం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది దుర్వినియోగం కాదని, సంక్షోభ నివారణ కోసం జల విద్యుదుత్పత్తి చేస్తున్నామని పేర్కొంటోంది. -
కేంద్రమంత్రి ఉమాభారతితో హరీష్ రావు భేటీ
న్యూఢిల్లీ : శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి వివాదం హస్తినకు చేరింది. కృష్ణా బోర్డు తీర్పుపై మండిపడుతున్న తెలంగాణ సర్కారు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం కేంద్రమంత్రి ఉమా భారతితో భేటీ అయ్యారు. కృష్ణా బోర్డు తీర్పును రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ మేరకు ఉమాభారతికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఓ వినతిపత్రం సమర్పించారు. కాగా ఇందుకు సంబంధించి మధ్యాహ్నం రెండున్నర గంటలకు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారు. దాంతో ఈ వివాదంపై మధ్యాహ్నం తర్వాత ఓ స్పష్టత రానుంది. -
'టీ సర్కార్ 5.6 టీఎంసీల నీటిని వాడుకుంది'
కర్నూలు : శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉదయం అధికారికంగా నిలిపివేసింది. కృష్ణా బోర్డు ఆదేశాలను పాటిస్తూ మూడు టీఎంసీలు వాడుకుని విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినా అది కూడా వివాదంగా మారింది. ఈరోజు ఉదయం వరకూ మూడు టీఎంసీల వాడకం పూర్తవుతుందని పేర్కొంటూ ఆ తర్వాతే ఉత్పత్తిని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే కృష్ణా బోర్డు మూడు టీఎంసీల నీటిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని సూచించినా .... తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5.6 టీఎంసీల నీటిని ఉపయోగించుకుందని ఏపీ ఇరిగేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు.దీనిపై కృష్ణా బోర్డు బోర్డుకు ఫిర్యాదు చేయనున్నారు. కాగా మరోవైపు ఆదివారం సాయంత్రానికే మూడు టీఎంసీల కోటాను తెలంగాణ వాడుకుందని, అయినా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించటాన్ని ఏపీ సర్కార్ తప్పుబడుతోంది. ఆదివారం వరకూ ఉత్పత్తి చేయాలన్న బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని. దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తోంది. కాగా కృష్ణా బోర్డు ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయని తప్పుబట్టిన తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక శ్రీశైలం రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటిమట్టం 857.50 అడుగులు ఉండగా, ఇన్‌ఫ్లో 8,800 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2050 క్యూసెక్కులుగా ఉంది.