తమిళనాడు సహకరిస్తే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ | Hydro power project in Tamil Nadu section | Sakshi
Sakshi News home page

తమిళనాడు సహకరిస్తే హైడ్రో పవర్ ప్రాజెక్ట్

Published Mon, Apr 21 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

Hydro power project in Tamil Nadu section

సిప్‌కాట్, న్యూస్‌లైన్ : తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే హొగేనకల్ వద్ద హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కర్ణాటక సిద్ధంగా ఉందని కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి డి.కే.శివకుమార్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన హొసూరులో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏళ్ల తరబడి నానుతున్న రాజకీయ కారణాల వల్ల తెరమరుగైన  హొగేనకల్ సమీపంలో కావేరి నదిపై ఏర్పాటు చేయాల్సి ఉన్న హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు వల్ల కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు విద్యుత్ కొరత ఉండదని అన్నారు.

బెంగళూరుకు అతిచేరువలో ఉన్న హొసూరు పట్టణం ఎంతో అభివద్ధి చెందిందని ఆయన అన్నారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో కర్ణాటక ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయడం వ ల్ల కృష్ణగిరి జిల్లా ప్రజలకు ఉపాధి పెరిగిందని ఆయన అన్నారు.   కృష్ణగిరి జిల్లా ప్రజలు విద్య, వైద్యం తదితర వాటికి సమీపంలోని బెంగళూరు వస్తున్నారని, కర్ణాటకతో కృష్ణగిరి జిల్లా ప్రజలకు సంబంధాలున్నాయని ఆయన అన్నారు.

దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లుగా పేదల అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 20 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు పాలిస్తున్నప్పటికీ హొసూరు ప్రాంత ప్రజలు ఈ రెండు పార్టీలను కాదని ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు.

దేశంలో సుపరిపాలన అందించేకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెల్లకుమార్‌ను గెలిపించాలని ఆయన కోరారు. బెంగళూరు నుంచి హొసూరు గ్రామీణ ప్రాంతాలకు అదనంగా బస్సులు ఏర్పాటుకు సంబంధించి శివకుమార్ మాట్లాడుతూ రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి చొరవతో బెంగళూరు, హొసూరుకు ఇప్పటికే 60 బస్సులు అదనంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement