
సాక్షి, ఢిల్లీ : రాష్ట్రమంతా సిద్ధిపేట మోడల్ అమలు చేస్తానంటున్న సీఎం కేసీఆర్ దుబ్బాకలో యూరియా కోసం రైతు చనిపోయిన ఘటన చూసి సిగ్గుపడాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు పెట్టి కొందామన్నా యూరియా దొరకడం లేదని వాపోయారు. రైతు బంధు, రుణమాఫీ పథకాలను అమలుచేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఎన్నికల వేళ హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు. రైతులకు ఇవ్వాల్సిన 20 వేల కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి వంటి అంశాలపై పార్టీ అధ్వర్యంలో పోరాడుతూ.. కేంద్ర హోంమంత్రిని కలిసి లోతైన దర్యాప్తు చేయాలని కోరతామని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు, మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపామని తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment