
28న ఐసెట్ నోటిఫికేషన్
♦ షెడ్యూల్ ఖరారు చేసిన ఉన్నత విద్యా మండలి
♦ మార్చి 1 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
♦ మే 19న ఐసెట్, అదే నెల 31న ఫలితాలు
♦ అభ్యర్థులకు ఓఎంఆర్ జవాబుపత్రం కాపీలు
♦ వచ్చే నెల 2న లాసెట్, 3న ఎడ్‌సెట్ షెడ్యూల్ ప్రకటన
♦ అన్ని పోటీ పరీక్షల ఫీజు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్-2016 నోటిఫికేషన్ ఈనెల 28న జారీకానుంది. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ మేరకు ఐసెట్ షెడ్యూల్‌ను గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఖరారు చేసింది. ఐసెట్ పరీక్ష ఫీజు గతంలో అన్ని వర్గాలకు రూ. 250 ఉండగా... ఈసారి బీసీ, ఇతర విద్యార్థులకు రూ. 350కి పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం పాత ఫీజే వర్తిస్తుంది. ఇక ఈసారి ఐసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు తొలిసారిగా ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీలను అందజేయనున్నారు. బయోమెట్రిక్ విధానం అమలుపై త్వరలోనే తుది నిర్ణయం ప్రకటించనున్నారు. గత ఏడాది ఐసెట్ రాసేందుకు 70,449 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... 68 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి కూడా 70 వేల మంది పరీక్షకు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. సిలబస్, పేపరు విధానం పాతదే ఉండనుంది. వివిధ జిల్లాల్లో 15 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు ఉండగా... వాటితోపాటు ఈసారి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోనూ ప్రాంతీయ సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఐసెట్ కమిటీ భేటీలో ఐసెట్ చైర్మన్, కాకతీయ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ టి.చిరంజీవులు, మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటాచలం, ఐసెట్ కన్వీనర్ ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వచ్చే నెల 2న లాసెట్, 3న ఎడ్‌సెట్ కమిటీలు సమావేశమై దరఖాస్తులు, పరీక్షలు, ఫలితాలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూళ్లను జారీ చేయనున్నాయి.
అన్ని ‘సెట్’లకూ ఫీజు పెంపు!
ఇప్పటికే ఎంసెట్, ఈసెట్ ఫీజులను పెంచిన నేపథ్యంలో... ఐసెట్ సహా మిగతా అన్ని సెట్‌ల దరఖాస్తు ఫీజులను పెంచాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఐసెట్ ఫీజును పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం గతంలో ఉన్న ఫీజులను కొనసాగించనున్నారు. దీంతో అభ్యర్థులకు ఫీజుల భారం తప్పదు. పరీక్షల్లో సంస్కరణల అమలు, పరీక్ష విధులకు హాజరయ్యే వారి రెమ్యూనరేషన్ పెంపు, నూతన విధానాల అమలు తదితర కారణాలతో ఫీజుల పెంపు తప్పడం లేదని అధికారులు వెల్లడించారు.