సాక్షి, జగిత్యాల: ‘నా స్వస్థలం వరంగల్ జిల్లా కేంద్రం. నన్ను సినీ ఇండస్ట్రీయే ఎంతో గొప్పవాన్ని చేసింది. సినీరంగంలో దాదాపు 45 సినిమాల్లో అగ్రనాయకులతో నటించా. నన్ను ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రజలు లేకుంటే నేను లేను. మున్సిపల్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం వచ్చినా నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి వెళ్లా. ఇంట్లో డాక్టర్ కావాలని తల్లిదండ్రులకు కోరిక ఉన్నా యాక్టర్‌నయ్యాను. డాక్టర్లనే నవ్వించడంతో ఇంట్లో వారు కూడా నన్ను అభినందిస్తున్నార’ని జబర్దస్త్ ఫేం రచ్చరవి తెలిపారు.
శుక్రవారం జగిత్యాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్నప్పటి నుంచి చెట్లు అంటే ఎంతో ఇష్టమని.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాలలో డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి మొక్కలను నాటే కార్యక్రమంలో భాగంగా జగిత్యాలకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు ఆదరించడం ఆనందంగా ఉందని.. ముఖ్య లక్ష్యం మన ఊరులో మన జమ్మిచెట్టుతో దసరా జరుపుకోవడమేనని వివరించారు.
కొన్ని గ్రామాల్లో తుమ్మచెట్టుతో జమ్మి జరుపుకునే దుర్గతి వచ్చిందని.. రానున్న కాలంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా విజృంభించడంతో చెట్లే లేకుండా పోయే పరిస్థితి నెలకొందన్నారు. మనం ఎంత సంపాధించామన్నది ముఖ్యం కాదని.. ఎలా బతికామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీలో అనేక చోట్ల దయగల పెట్టెలను ఏర్పాటు చేశానని.. ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. నా మొదటి సినిమా వెయ్యి అబద్దాలు మంచి గుర్తింపు తెచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment