jagitail
-
విషాదం: అనారోగ్యంతో తండ్రి.. కరోనాతో తల్లి మృతి.. పాపం చిన్నారులు..
సాక్షి, మల్యాల(జగిత్యాల): వేలు పట్టుకొని నడిపించిన నాన్న లేడు.. ఆకలి వేస్తే తినిపించే అమ్మ లేదు.. ఉండడానికి ఇల్లు లేదు.. చదువుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు.. అమ్మానాన్న వైద్యం కోసం చేసిన అప్పులు మిగిలాయి.. అనారోగ్యంతో తండ్రి, కరోనాతో తల్లి మృతిచెందగా ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. భవిష్యత్ అంధకారమైంది. ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామానికి చెందిన గాదె శ్యాంసుందర్ తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి భార్య లావణ్య ఒకవైపు బీడీలు చేస్తూ, మరోవైపు బీడీల కంపెనీ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఆమెను ఇటీవల కరోనా బలి తీసుకుంది. దీంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. అప్పులే మిగిలాయి.. శ్యాంసుందర్ బీడీ కంపెనీ నడుపుతూ పచ్చకామెర్ల బారినపడ్డాడు. చికిత్స కోసం తమకున్న రెండు గుంటల భూమిని అమ్మినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబ భారం లావణ్యపై పడింది. ఇద్దరు పిల్ల లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, భర్త వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు రాత్రివేళల్లో బీడీలు చేస్తూ, పొగాకు ప్రభావంతో ఛాతి సంబంధిత వ్యాధి బారిన పడింది. ఆక్సిజన్ థెరపీ అవసరం కావడంతో నెల రోజులు ఆస్పత్రిలో వైద్యం పొందింది. రూ.3లక్షలు అప్పు చేసి, చికిత్స తీసుకుంటున్న క్రమంలో కరోనా బారిన పడి ఈ నెల 2న చనిపోయింది. కూతురు హారిక గర్రెపల్లి గురుకుల పాఠశాలలో ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. కుమారుడు రామకృష్ణ మల్యాల మండలం నూకపల్లి మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఉండడానికి ఇల్లు లేదు. గుంట భూమి లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. బంధువుల ఇళ్లలోనే అద్దెకుంటున్నారు. పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తల్లిదండ్రుల మృతితో హారిక, రామకృష్ణ దిక్కులేని పక్షులయ్యారు. ఒకవైపు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన బాధ, మరోవైపు అప్పులు తీర్చే దారి కానరావడం లేదు. దాతలు దారిచూపాలని, బతుకు బాట సాగేందుకు ఆర్థిక చేయూత కోసం చిన్నారులు ఎదురుచూస్తున్నారు. ఎంతోమంది నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపుతూ, మేమున్నామంటూ భరోసానిస్తున్న మంత్రి కేటీఆర్, ఈ చిన్నారులను సైతం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
Telangana: రద్దీ ఎప్పటిలాగే..
సాక్షి, జగిత్యాల: లాక్డౌన్ సడలింపులతో జిల్లాలో జనజీవనం సాధారణమైంది. ఉదయం నుంచే రోడ్లు జనసమర్థంగా మారాయి. బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ సడలింపులతో వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి. కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్లు రద్దీగా కనిపించాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, వాణిజ్య దుకాణాలు సాయంత్రం వరకు నడిచాయి. జిల్లాలో కరోనా ప్రభావం, కేసులు పూర్తిగా తగ్గనప్పటికీ ఎక్కడ చూసినా జనం రద్దీగా కనిపించారు. మంగళవారం వరకు ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకే జన సంచారం కన్పించగా సడలింపుల నేపథ్యంలో బుధవారం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లావ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. వ్యాపారులకు ఊరట లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వ్యాపారులకు ఊరట లభించినట్లయ్యింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు, లాక్‌డౌన్‌తో వ్యాపారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. మొదట ఉదయం 10 గంటల వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారుల నిర్వహణ సాధ్యం కాలేదు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లతోపాటు వాణిజ్య దుకాణదారులు తమ వ్యాపారాలు నడుపుకోలేక, షాపుల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తర్వాత ప్రభుత్వం ఒంటి గంట వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోయారు. బుధవారం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెసులుబాటు కల్పించడంతో వ్యాపారులకు ఊరట లభించింది. భౌతికదూరం మరిచారు ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ కరోనా నిబంధనలను మాత్రం పాటించాల్సిందే. అయితే జిల్లాలో ఎక్కడ కనీసం భౌతికదూరాన్ని పాటించడం లేదు. ఎక్కడ చూసినా జనం గుంపులుగా కనిపించారు. బ్యాంకుల ఎదుట బారులు తీరి ఉన్నారు. దుకాణాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కరోనా నిబంధనలు పాటించడం లేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా నిబంధనలను అమలు చేయాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం -
జగిత్యాల: తల్వార్‌తో బర్త్‌డే వేడుకలు
జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలను తల్వార్‌తో జరుపుకున్న మైనర్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హన్మాన్వాడకు చెందిన 17 ఏళ్ల మైనర్ తన పుట్టిన రోజు వేడుకలను శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత స్నేహితుల మధ్య రోడ్డుపైన జరుపుకున్నాడు. తల్వార్‌తో కేక్ కట్ చేయడంతోపాటు నృత్యాలు చేశారు. ఆ దృశ్యాలు పోలీసుల వరకు వెళ్లడంతో సదరు మైనర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జయేశ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారు చేసే పనులపై ఓ కన్నేసి ఉంచాలని, సంఘ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడితే తల్లిదండ్రులపై సైతం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చదవండి: అయ్యో కొడుకా: తండ్రి ట్రాక్టర్ కింద పడి.. -
'చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ఎందుకు పెట్టలేదు'
సాక్షి, జగిత్యాల : ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందించకపోవడం చాలా బాధకరమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చెస్ట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ఎందుకు పెట్టలేదనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా ఆరోగ్యశాఖ మంత్రి సెల్ఫీ వీడియోను తప్పుపడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి కనీస నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఇంతవరకు స్పందన లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. బలవన్మరణానికి పాల్పడిన వారికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ సుమోటోగా పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. (మళ్లీ లాక్డౌన్.. సిద్ధంగా ఉన్నారా?) తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జీవించే హక్కు కోల్పోతున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ పొందటానికి ప్రతి పౌరుడికి హక్కుందని, ఆయుస్మాన్ భారత్‌ను తక్షణమే రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సేవల కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ధరలు అమలు కావడం లేదని విమర్శించారు. అన్నింటికీ ఒకే వైద్యం క్వారంటైన్ అనే స్థాయికి ప్రభుత్వం దిగజారిందన్నారు. (తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా) ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అత్యవసర సేవలు మినహా కఠిన లాక్డౌన్ అమలు చేయాలని జీవన్ రెడ్డి తెలిపారు. వ్యాపార సంస్థలను, వైన్ షాప్, బెల్ట్‌షాప్‌లను 4 గంటల వరకు బంద్ చేయాంచాలన్నారు. గత వారం రోజులు రాష్ట్రంలో కరోనా పరీక్షలే నిర్వహించలేదని, ఇప్పుడు మొదలు పెట్టారన్నారు. కరోనా ఆరంభంలో కేంద్రప్రభుత్వం అమెరికా ట్రంప్ పర్యటనలో భాగంగా ఒక నెల జాప్యం చేసిందని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి నిరుపేద కుటుంబంపై భారం పడుతుందని, ఇది కేంద్ర ప్రభుత్వ ఆనాలోచిత విధానానికి నిదర్శనమని జీవన్‌రెడ్డి అన్నారు. (కరోనా: పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతి) -
సెల్ఫీ మోజు; గల్లంతైన ఇద్దరు యువకులు
సాక్షి, జగిత్యాల : పండగ వేళ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మెట్పల్లిలో సెల్ఫీ దిగడానికి కాలువలోకి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా అనుపాలెంకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు రాంబాబు(20), రాజేష్(18) ఫోటో దిగడానికి కాకతీయ కెనాల్లోకి దిగారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అనంతరం పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఏసీబీకి చిక్కిన అటవీశాఖ అధికారులు
సాక్షి, జగిత్యాల : పాత ఇంటి కర్రకు అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు మంగళవారం నగదు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. అటవీశాఖ సెక్షన్ అధికారి, బీట్ అధికారుల లంచావతారం ఎట్టకేలకు బట్టబయలైంది. వివరాలు ఇలా..సారంగాపూర్ మండలం మ్యాడారంతండా గ్రామానికి చెందిన భూక్య గంగాధర్ నాయక్ (52 ) గిరిజనుడు ఒంటిరిగా నివాసం ఉంటున్నాడు. 30 రోజుల ప్రణాళికలో కూలిపోయే దశలోని ఇంటిని తొలగించాలని అధికారులు ఆదేశించారు. గంగాధర్ తన తాత సుమారు 70 ఏళ్లక్రితం నిర్మించిన రెండు ఇళ్లను తొలగించడానికి నిర్ణయించుకున్నాడు. అందులోని విలువైన టేకు కలప భద్రపరుచుకున్నాడు. ఈ కలపతో కొత్తగా ఇళ్లు నిర్మాణం చేసుకోవడానికి వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 20 రోజులక్రితం అటవీశాఖ సెక్షన్ అధికారి పవనసుతరాజు, గ్రామ బీట్ అధికారి ఎండి. వసీంను కలిసి కొత్త ఇంటికి కలప వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరాడు. ప్రతీ ఇంటికి రూ.10 వేల చొప్పున రూ.20 వేలు ఇస్తేనే అనుమతిస్తామని తెగేసి చెప్పారు. రోజులతరబడి తిరిగినా కాళ్లు కూడా పట్టుకున్నా కనికరించలేదు. డీఎఫ్‌వోను కలిసి పరిస్థితిని మొరపెట్టుకున్నాడు. ఆయన ఆదేశించినా సెక్షన్ అధికారి, బీట్ అధికారులు పట్టించుకోకపోగా లంచంకోసం వేధించారు. దీంతో విసిగిపోయిన గంగాధర్ ఈనెల11న ఏసీబీ అధికారులను కలిశాడు. పక్కా ప్లాన్‌తో మంగళవారం గ్రామానికి చేరుకున్న ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, ఇన్స్పెక్టర్లు వేణుగోపాల్, సంజీవ్‌కుమార్, రాముతోపాటు మరో 10 మంది సిబ్బంది మ్యాడరంతండా పరిధిలోని రేచపల్లి గ్రామంలోని అటవీశాఖ బీట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే బాధితుడు గంగాధర్‌కు రూ.6 వేలు ఇచ్చి, అటవీశాఖ సెక్షన్ అధికారి పవనసుతరాజు, బీట్ అధికారి ఎండి.వసీమోద్దీన్ దగ్గరికి పంపించారు. బీట్అధికారి డబ్బు తీసుకోగా, సెక్షన్ అధికారి, బీట్ అధికారి ఇద్దరు కలిసి గంగాధర్‌తో మాట్లాడుతుండగా దాడి చేసి ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వేధిస్తే 1064 నంబర్‌కు ఫోన్ చేయండి ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా ప్రజలు ఏసీబీ 1064 నంబర్‌కు ఫోన్ చేయాలని డీఎస్పీ కోరారు. కాగా ఇద్దరు అధికారులు పట్టుబడడంతో రేచపల్లి గ్రామస్తులు పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేయడం విశేషం. -
‘కుట్రపూరితంగానే అలా చెబుతున్నారు’
సాక్షి, జగిత్యాల: కుట్ర పూరితంగానే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెబుతున్నారని సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా శనివారం తన ఇంటి నుంచి ఆర్టీసీ డిపో వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. .రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసిన సీఎం కేసీఆర్ అసలు రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తున్నారా అని ప్రశ్నించారు. సకల జనుల సమ్మెతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాజ్యం.. హింసాత్మకంగా మారుతుందన్నారు. ఆర్టీసీ ఆస్తులను 50 వేల కోట్లు తక్కువ చూపిస్తున్నారని.. ప్రైవేటు పెట్టుబడిదారులతో కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కొత్త హైర్ బస్సులను కొనుగోలు చేయడానికి 90 శాతం అప్పులు ఇవ్వడానికి ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆర్టీసీలో పదవి విరమణతో ఏర్పడిన ఖాళీ పోస్టులే ఆరువేల వరకూ ఉన్నాయని.. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి 2లక్షల 50 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు తొలగిపోవాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ఏకైక మార్గం అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. -
మరో సారి హైకోర్టును ఆశ్రయించిన ఫర్నీక తండ్రి
సాక్షి, హైదరాబాద్: గౌచర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఫర్నీకకి వైద్యం అందించడంలో నిలోఫర్ వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని పాప తండ్రి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడంలేదని వాపోయారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఫర్నీక వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని, మెరుగైన చికిత్స అందించాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా కోర్టు ఆదేశాలను వైద్యులు పట్టించుకోవడం లేదని, తమ కూతురుకి చిక్సిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఫర్నీక తండ్రి మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. ఆస్పత్రిలో సరైన వసతులు లేవని, ఒక్కో బెడ్ మీద నలుగురు పిల్లలు ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో పాపను ఎలా ఉంచాలని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు పాటించి ఫర్నీకకు మెరిగైన చికిత్స అందించాలని కిరణ్ డిమాండ్ చేశారు. (చదవండి : చిన్నారి చికిత్సకు హైకోర్టు కీలక ఆదేశాలు) అరుదైన వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాపకు ప్రత్యేక బెడ్, వార్డు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని తండ్రి కిరణ్ కోరారు. చికిత్స కోసం ఎక్కువ ఖర్చు అవుతుండటం, ఆర్థిక స్థోమత లేని కారణంగా ఫర్నీక తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో చిన్నారికి తక్షణమే చికిత్స అందించాల్సిందిగా నిలోఫర్ ఆస్పత్రి, తెలంగాణ మెడికల్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
మలుపులు తిరుగుతున్న శిశువు కథ
సాక్షి, జగిత్యాల(కరీంనగర్) : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పసికందు విక్రయానికి సిద్ధపడ్డ ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతి మహారాష్ట్రకు చెందిన నవీన్ దంపతులు. ఇద్దరు ఆర్మూర్ బస్టాండ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి కూతురు నక్షత్ర ఉంది. నవీన్ విడిచిపెట్టి పోవడంతో జ్యోతి భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతోంది. కాగా నెల రోజులు నిండని పసికందును రూ.20 వేలకు అమ్మడానికి సిద్ధపడుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులకు అప్పగించారు. జ్యోతి పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. శిశువును కరీంనగర్‌లోని శిశుగృహకు తరలించారు. గంగ జ్యోతి, నక్షత్రను స్వధార్‌హోమ్‌కు తరలించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. ఈక్రమంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గందం సుమలత పాప కనిపించడం లేదని ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మెట్పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా ఆర్మూర్ పోలీసులు డీఎన్ఏ పరీక్షల కోసం శిశువును తరలించారు. పరారీలో గంగజ్యోతి.? ఒకవైపు ఆర్మూర్ పోలీసులు శిశువును డీఎన్ఏ పరీక్షలకు పంపగా.. ఇంతలోనే గంగజ్యోతి కరీంనగర్‌లోని స్వధార్‌హోమ్ నుంచి ఐదు రోజుల క్రితం పరారైనట్లు తెలిసింది. దీంతో గంగజ్యోతి పాపను కిడ్నాప్ చేసి అమ్మకానికి పెట్టినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. తన కూతురు నక్షత్రను స్వధార్‌హోమ్‌లోనే ఉంచి పారిపోయింది. ఆ మె కోసం వెతుకుతున్నారు. ఒకవేళ డీఎన్ఏ రిపో ర్ట్ వచ్చినా గంగజ్యోతి దొరికితే గానీ విషయం బ యటకు పొక్కదు. పరారీ సంఘటనపై సైతం వి చారణ కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
నోటీస్ ఇచ్చాకే చెక్ బౌన్స్ కేసు
సాక్షి, జగిత్యాల(కరీనగర్) : ఇటీవలి కాలంలో డబ్బులు బాకీ ఉన్న వ్యక్తికి చెక్కులు ఇవ్వడం, ఆ చెక్కులు బ్యాంకుకు వెళ్లినప్పుడు తిరస్కరించడం వంటి సంఘటలను చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకులో డబ్బులు లేక చెక్కు తిరిగి వచ్చిందని చెప్పినప్పటికీ, చెక్కులు ఇచ్చిన వ్యక్తులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్నారు. కేసు దాఖలుకు ముందే చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఓ నోటీస్‌ను పంపించాల్సి ఉంటుంది. నోటీస్‌కు సంబంధించిన విషయాల గురించి జగిత్యాల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మారిశెట్టి ప్రతాప్(94404 38914) వెల్లడించారు. నోటీస్‌లో ఏం ఉండాలంటే.. నోటీస్ ఇలానే ఉండాలనే నియమం ఏమి లేదు. నోటీస్‌ను స్వయంగా లేదా అడ్వకేట్ ద్వారా పంపవచ్చు. చెక్కు ఎవరిపేరిట ఇవ్వబడిందో ఆ వ్యక్తే స్వయంగా నోటీస్ పంపాల్సి ఉంటుంది. నోటీస్‌లో చెక్కు ఇచ్చిన వ్యక్తి బాకీ ఉన్న విషయం, ఆ బాకీ తీర్మానం నిమిత్తం చెక్కు ఇచ్చినట్లు స్పష్టంగా ఉండాలి. అలాగే ఏ తేదీన చెక్కును బ్యాంకులో ప్రజెంట్ చేసింది, ఏ తేదీన ఆ చెక్కు చెల్లలేదని బ్యాంకు ద్వారా తెలిసిందనే విషయాలను నోటీస్‌లో స్పష్టంగా పేర్కొనాలి. చెల్లకుండా పోయిన చెక్కు నంబర్‌ను కూడా నోటీస్‌లో చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఏ కారణం చేత చెక్కు చెల్లకుండా పోయిందన్న విషయాలు కూడా తెలియజేయాలి. ముఖ్యంగా ఆ చెక్కులో పొందుపర్చిన మొత్తాన్ని, నిర్దేశించిన వ్యవధి లోపల చెల్లించాల్సిందిగా డిమాండ్ తప్పనిసరిగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో తెలిసి, తెలియక నోటీస్‌లో కొంత అస్పష్టత ఉండవచ్చు. ఇలాంటి సమయాల్లో నోటీస్ చెల్లకుండా పోతుందా అనే విషయాలపై సుప్రీంకోర్టు పలు కేసుల్లో వివరణలు సైతం ఇచ్చింది. నోటీస్ ఇవ్వడం ప్ర«ధాన ఉద్దేశ్యం..చెక్కు కర్త తన తప్పును తాను తెలుసుకుని సొమ్ము చెల్లించేందుకు ఒక అవకాశాన్ని ఇవ్వడంటూ 1999లో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా వర్సెస్ సాక్సోన్ ఫామ్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 30 రోజుల్లో నోటీస్ ఇవ్వాలి.. చెక్కు చెల్లని విషయాన్ని చెక్కు ఇచ్చిన వ్యక్తికి నోటీస్ ద్వారా తెలియజేయడం తప్పనిసరి. నోటీస్ ఇవ్వకుండా కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తే అది చెల్లదు. ఏదో మాములుగా నోటీస్ ఇవ్వడం కాకుండా అది చట్టబద్ధంగా ఉండాలి. నోటీస్ రాతపూర్వకంగా మాత్రమే ఉండాలి. మౌఖికంగా ఇచ్చె నోటీస్ చెల్లదు. చెక్కు చెల్లలేదని బ్యాంకు నుంచి సమాచారం అందినప్పటి నుంచి 30 రోజుల్లోపు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా 30 రోజుల్లోపు నోటీస్ ఇవ్వకపోతే, ఆ చెక్కును తిరిగి బ్యాంకులో ప్రజెంట్ చేయవచ్చు. చెక్కుపై వేసిన తేదీ నుంచి ఆరు నెలల వ్యవధి ఉన్నట్లయితేనే తిరిగి బ్యాంకులో ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. మరో ముఖ్య విషయమేమిటంటే, బ్యాంకులో చెక్కువేసిన తేదీ కంటే కూడా, చెక్కు చెల్లకుండా పోయిందని బ్యాంకువారు తెలియజేసిన రోజే ప్రధానం. ఉదాహరణకు.. చెక్కు చెల్లకుండా పోవడానికి సంబంధించి బ్యాంకువారు ఇచ్చిన మెమోపై 5–1–2019 అని ఉండవచ్చు. కాని 9–1–2019 రోజున ఆ మెమో చెక్కు ప్రజెంట్ చేసిన వ్యక్తికి ఇవ్వబడింది. దీని ప్రకారం 10–1–2019 నుంచి 30 రోజులలోపు చెక్కు ఇచ్చిన వ్యక్తికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నోటీస్ ఎలా పంపాలంటే.. చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి నోటీస్ పంపించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నప్పటికీ, నోటీస్‌ను ఎలా పంపాలన్న విషయంపై స్పష్టత లేదు. సాధారణంగా నోటీస్‌కు తిరుగు రశీదు(ఎకనాలేడ్జ్మెంట్ కవర్)తో కూడిన రిజిస్టర్ పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది. తిరుగు రశీదుతో కూడిన నోటీస్ పంపడం వల్ల, ఆ నోటీస్ ఎవరికి పంపబడిందో ఆ వ్యక్తికి ఆ నోటీస్ ఎప్పుడు అందినదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. నోటీస్ ఇవ్వడం ఎంత ముఖ్యమో, సరైన చిరునామాకు పంపడం కూడా అంతే ముఖ్యం. చాలా సందర్భాల్లో నోటీస్‌లు డోర్ లాక్డ్, సదరు వ్యక్తి ఆ అడ్రస్‌లో లేడని, తీసుకోలేదంటూ తిరిగి రావడం జరుగుతుంది. అయితే వీటిలో కొన్ని నిజాలు, కొన్ని అవాస్తవాలు ఉండోచ్చు. ఇలాంటి సందర్భాల్లో నోటీస్ పంపానని ఒకరు, నోటీస్ అందలేదని మరొకరు చెప్పడం పరిపాటిగా మారింది. నోటీస్‌పై వాదోపవాదాలు.. నోటీస్ అందడం, అందకపోవడంపై పలు వాదోపవాదాలు ఉన్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి నివాసం ఉండే చిరునామాకు, అంటే సరైనా చిరునామాకు నోటీస్ పంపబడి ఉండి, అతడికి అందకపోయినప్పటికీ, నోటీస్ అందినట్లుగానే భావించడం జరుగుతుందని సుప్రీంకోర్టు 1999లో కె.భాస్కరన్ వర్సెస్ ఎస్.కె.బాలన్ కేసులో స్పష్టం చేసింది. ఇలాంటి కేసులో నోటీస్ అందలేదని భావిస్తే, దానిని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కూడా అతడిపైనే ఉంటుందని కూడా పేర్కొంది. అలాగే నోటీస్ తిరస్కరించినప్పటికీ అందినట్లుగానే భావించబడుతుంది. అయితే నోటీస్ అందినట్లుగా భావించే సూత్రాన్ని అన్ని కేసులకు ఒకే విధంగా అన్వయించరాదని సుప్రీంకోర్టు మరో కేసులో వ్యాఖ్యానించింది. అయితే కేసు సందర్భాన్ని బట్టి, ఆ కేసు స్వరూపాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యలు చేసింది. ఇంకా నోటీస్ సరైన అడ్రస్‌కు పంపించామని, పోస్ట్‌మాన్ ముద్దాయితో మిలాఖత్ అయ్యాడని, పోస్ట్‌మాన్ సహకారంతో ముద్దాయి ఇంట్లో లేనట్టుగా తప్పుడు ఎండార్స్మెంట్ వచ్చిందని ఫిర్యాది వాదన చేస్తే, ఆ విషయాన్ని ఫిర్యాదే రుజువు చేసుకోవాల్సి ఉంటుందని, చట్టప్రకారం అది అతడి బాధ్యత అని సుప్రీంకోర్టు 2004లో వి.రాజకుమారి వర్సెస్ పి.సుబ్రమనాయుడు కేసులో స్పష్టం చేసింది. -
పట్టపగలే గొడ్డలితో నరికి..
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో పట్టపగలే ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి గొడ్డలితో బీభత్సం సృష్టించాడు. జగిత్యాల టౌన్ లోని విద్యానగర్‌లో 2 గుంటల భూమి విషయంలో తిప్పర్తి కిషన్, లక్ష్మణ్‌ల మధ్య వివాదం నడుస్తుంది. రిజిస్ట్రేషన్ డబ్బుల విషయంలో తగాదా మరింత ముదిరింది. ఈ భూమి విషయంలో నష్టపోయానని భావించిన కిషన్‌పై లక్ష్మణ్ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సారుగమ్మ వీధికి వచ్చిన కిషన్‌పై లక్షణ్ గొడ్డలితో దాడికి దిగాడు. ఆ సమయంలో అక్కడున్న వారు ఎవరూ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దాడి అనంతరం గొడ్డలిని పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసి లక్ష్మణ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. గాయపడిన కిషన్‌ను ఆసుపత్రికి తరలించారు. -
పట్టపగలే వ్యక్తిపై గొడ్డలితో దాడి..
-
ఇండోర్ స్టేడియం పూర్తయ్యేదెప్పుడో?
సాక్షి, జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన ఇప్పటికి ఒక్క ఇండోర్ స్టేడియం కూడా లేదు. గతంలో నిర్మాణం ప్రారంభించిన ఏళ్లు గడుస్తున్నా... మోక్షం రావడం లేదు. దీంతో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాక్టిస్ చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇన్డోర్ స్టేడియాలపై ఆధారపడాల్సి వస్తుంది. దూర భారంతో పాటు వ్యయ ప్రయాసాలతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేద, మద్యతరగతి క్రీడాకారులు క్రీడలకు దూరమవుతున్నారు. నిధులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో ఇండోర్ స్టేడియం పనులు నిలిచిపోయాయి. మంజురు అయిన డబ్బులతో చేపట్టిన కాస్త పనులు అసంపూర్తిగా ఉండి విద్యార్థులను నిరాశలోకి నెట్టుతున్నాయి. పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. 2011లో ప్రారంభం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అవరణలో 2011లో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ ద్వారా ఇండోర్ స్టేడియం మంజూరైంది. ఇండోర్ స్టేడియానికి మొత్తం రూ. 40 లక్షలు ఖర్చును అంచనా వేయగా, ప్రభుత్వం రూ. 20 లక్షలు కేటాయించడంతో 2015లో కేవలం గోడలు వరకు మాత్రమే నిర్మించారు. దీంతో ఇంకా 20 లక్షలు అవసరమని అంచనా వేసారు. ప్రస్తుతం ఏళ్ల క్రితం అంచనా కాబట్టి మరింత ఖర్చు పెరిగే ఆవకాశం ఉంది. నిరాశలో విద్యార్థులు.. నిర్మాణం పూర్తి కాకపోవడంతో క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. ఫలితంగా క్రీడలకు దూరం కావాల్సి వస్తుందని క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. సంబందిత కళాశాలకు చెందిన విద్యార్థులు క్రీడా మెలకువలు మెరుగు పరుచుకునేందుకు కరీంనగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఆర్థికభారం పెరుగుతోంది. స్థానికంగా సౌకర్యాలు కల్పిస్తే ఇలాంటి దుస్థితి ఉండదని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మందికి ఆటల్లో ప్రావీ ణ్యం సాధించాలని ఉన్నా సౌకర్యాలు లేక మిన్నకుండి పోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇండోర్ స్టేడియం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పనులు పూర్తి చేయాలి క్రీడాకారుల కోసం నిర్మాణం చేపట్టిన ఇన్డోర్ స్టేడియం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో రాణించలేక పోతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. త్వరగా పూర్తి చేస్తే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది – అంజలి, విద్యార్థిని, జగిత్యాల ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది జిల్లాలో ఇండోర్ స్టేడియం లేక విద్యార్థులు, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసక్తి ఉన్న ఏమి చేయలేని పరిస్థితి నెలకోంది. కరీంనగర్, హైదారాబాద్‌కు వెళ్లి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. త్వరగా పూర్తి చేస్తే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదు. – సుమన్, విద్యార్థి, జగిత్యాల -
హోరాహోరీగా ఎమ్మెల్సీ పోరు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికి ఈనెల 22న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలే బరిలోకి దిగగా.. ఉపాధ్యాయులే ఓటర్లుగా వ్యవహరించనున్నారు. అయితే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేతలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీకి అధికారికంగా అభ్యర్థిని ప్రకటించడం లేదని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా గ్రూప్–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతు ఇస్తున్నట్లు తాజాగా స్పష్టం చేయడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతు ఇవ్వాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అధికార పార్టీ నుంచి అనధికారిక అభ్యర్థిగా రంగంలోకి దిగిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ జిల్లాల వారీగా 42 నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓట్ల కోసం వేట ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటల్లాంటి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో విద్యావంతులు తనకే ఓటేస్తారని ఆశాభావంతో ఆయన ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రశ్నించే గళం కావాలంటున్న జీవన్‌రెడ్డి శాసనమండలిలో ప్రతిపక్షం ఊసే లేకుండా చేయాలని టీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామిక పద్ధతిలో సాగుతోందని విమర్శిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో ప్రజా గొంతుక అవుతానని చెబుతున్న ఆయన రాష్ట్ర మంత్రిగా, జగిత్యాల ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులు కూడా గెలుపునకు దోహదపడతాయని అంటున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే 70వేలకు పైగా పట్టభద్రుల ఓట్లు ఉండగా.. వరంగల్, ఆదిలాబాద్‌లో సైతం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంతృప్తికరమైన రీతిలో ఓటింగ్ జరగడం తనకు అనుకూలించే అంశంగా ఆయన భావిస్తున్నారు. అన్నింటికి మించి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఆయన తాజా అసెం బ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోవడం.. వెనువెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో సానుభూతి కూడా పనిచేస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన మిగతా జిల్లాల్లో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు. యువ ఓటర్ల మద్దతుపై రాణి రుద్రమ ఆశలు యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ సైతం పట్టభద్రుల స్థానానికి చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేశారు. పట్టభద్రులైన యువ ఓటర్లతో పాటు విద్యావంతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమ సంఘాల మద్దతు తనకు లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం మద్దతు పొందిన ఆమె ఆదివారం నుంచి ప్రచార పర్వంలోకి దిగాలని నిర్ణయించారు. తన వంటి యువతను ఎన్నుకుంటే శాసనమండలి విలువలను కాపాడుతానని చెబుతున్న రాణిరుద్రమ సమాజంలో మార్పు కోసం యువత తన వెంట నిలుస్తుందని, పట్టభద్రుత మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవన్‌రెడ్డితోనే పోటీ.. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పొల్సాని సుగుణాకర్‌రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు జీవన్‌రెడ్డితోనే పోటీ అని చెబుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ల్లోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతూ ఇప్పటికే ప్రచారం చేస్తున్న ఆయన గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ఇప్పటికే నష్టపోయామన్న భావనతో ఉన్న పట్టభద్రులు.. ఏ అజెండా లేని ఆ పార్టీలకు ఈసారి ఓటు వేసేందుకు యువత, ఉద్యోగ సంఘాలు సిద్ధంగా లేరనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఇండిపెండెంట్లు కూడా... సామాజిక, రాజకీయ రంగాల్లో కొనసాగుతున్న పలువురు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. ఆయా జిల్లాల్లో తమకు ఉన్న సంబంధాలు, వివిధ సమస్యలపై గతంలో తాము చేసిన పోరాటాలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెడతాయని భావిస్తున్నారు. ఏబీవీపీ మాజీ నాయకుడు గురువుల రణజిత్‌మోహన్, ఎడ్ల రవికుమార్, కేశిపెద్ది శ్రీధర్‌రాజు, ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు పడే ఓట్లపై ప్రభావం చూపనున్నారనడంలో సందేహం లేదు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ సహా నాలుగు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
హాట్ హాట్ చిప్స్
జగిత్యాల టౌన్: కాలానికి అనుగుణంగా రుచులు కూడా మారుతున్నాయి. ఆహార ప్రియులు కొత్తకొత్త రుచులను కోరుతున్నారు. ఏదిఏమైనా సాయంత్రం స్నాక్స్ పక్కా ఉండాల్సిందేనని ఆరాటపడుతున్నారు. పట్టణాల్లో అయితే ఇది తప్పనిసరిగా మారింది. రుచితో పాటు వేడివేడిగా హాట్ చిప్స్ అందించే కేంద్రాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో యువకులు హాట్ చిప్స్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. హాట్ చిప్స్‌పై ఈఆదివారం ప్రత్యేక కథనం మీకోసం ..... అందరికీ అందుబాటులో చిన్నారులు, పెద్దలు సాయంత్రం స్నాక్స్ కోసం చిప్స్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. చిప్స్ కేంద్రాల్లో వివిధ పిండి పదార్థాలతో ఘటి, బొంది, రింగులు, కారపూస, మిక్చర్, శబ్దాన, దల్మోట్, మురుకులు వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు చిప్స్‌లో ఆలు, కాకరకాయ, అల్లం ఆలు చిప్స్, బనాన చిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంతో రుచి తాజాగా ఎప్పటకప్పుడు పిండి పదర్ధాలు తయారు చేయడంతో ఎంతో రుచిగా ఉంటాయి. ప్రతి రోజు స్నాక్స్ కొనుగోలు చేస్తుంటాం. రుచి, శుచితో ఉండటంతో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. – గోపినాథ్, జగిత్యాల ఆదరణ లభిస్తోంది మొదట్లో ఇబ్బంది ఎదురైంది. రుచి శుభ్రత విషయంలో రాజీ పడలేదు. రోజు రోజుకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎక్కువగా చిప్స్ అమ్మకాలు ఉంటాయి. – నరేశ్, నిర్వాహుకుడు, జగిత్యాల -
కాంగ్రెస్‌కు కంచుకోట
జగిత్యాల నియోజకవర్గం... పూర్తి స్థాయిలో వ్యవసాయాధారిత ప్రాంతం. రాష్ట్రంలోనే నాణ్యమైన పంటలు తీస్తున్న జగిత్యాల అన్నింటా ముందంజలో సాగుతోంది. జిల్లాగా ఏర్పడిన తరవాత అభివృద్ధి మరింత వేగమైంది. అయితే ఇక్కడి ప్రజలు ఏళ్ల కాలంగా కాంగ్రెస్‌నే ఆదరించటం విశేషం. 1952లో జరిగిన తొలి శాసన సభ ఎన్నికల్లో ఎస్సీఎఫ్ పార్టీ నుంచి డి.రాజారాం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఒకసారి గెలుపొందిన వారిని ఇక్కడి ప్రజలు మరోసారి ఆదరించలేదు. అయితే 1983లో టీడీపీ నుంచి బరిలో దిగిన తాటిపత్రి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి రమణ రెండుసార్లు శాసనసభకు వెళ్లారు. ఈ సారి అభివృద్ధి మంత్రంతో టీఆర్ఎస్... అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టిపోటీ నెలకొనుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చరిత్ర చూస్తే... జగిత్యాల నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఎస్సీఎఫ్ పార్టీ తరపున రాజారాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. రాజయ్యపై విజయం సాధించారు. 1952లో (ద్విసభ్యనియోజకవర్గం) నుంచి పీడీఎఫ్ పార్టీ నుంచి బి. మల్లారెడ్డి స్వాతంత్ర్య అభ్యర్థి కె. సేవరాజం పై గెలుపోందారు. 1957లో కాంగ్రెస్ నుంచి డి.హన్మంతరావు పీఎస్పీఅభ్యర్థి ఎస్ఆర్. లింగాల పై గెలిచారు.1962లో స్వత్వంత్ర అభ్యర్థి ఎం.ధర్మారావు కాంగ్రెస్ అభ్యర్థి డి. హన్మంతరావును ఓడించారు. 1963 ఉపఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి కె. లక్ష్మీనర్సింహారావు స్వతంత్ర అభ్యర్థి ఎస్. రెడ్డిపై గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి కె.లక్ష్మీనరసింహారావు ఏకగ్రీవం అయ్యారు. 1972లో కాంగ్రెస్అభ్యర్థి వి. జగపతిరావు స్వతంత్ర అభ్యర్థి ఎస్ఆర్ .రావుపై విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ రావు జనతా పార్టీ అభ్యర్థి జె. దామోదర్‌రావును ఓడించారు. 1983లో టీడీపీఅభ్యర్థిగా తాటిపర్తి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెఆర్. రావుపై విజయం సాధించారు. 1985లో టీడీపీ అభ్యర్థిగా జి.రాజేశం గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఓడించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి రాజేశంగౌడ్పై గెలుపొందారు. 1994లో టీడీపీఅభ్యర్థి ఎల్.రమణ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డిపై గెలుపొందారు. 1996 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టి. జీవన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి బండారి వేణుగోపాల్‌పై విజయంసాధించారు. 1999,2004లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి ఎల్.రమణపై విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2009లో టీడీపీ అభ్యర్థిఎల్.రమణ కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్‌రెడ్డిపై విజయం సాధించారు.2014లో మళ్లీ టి.జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్‌పై విజయం సాధించారు. 10 సార్లు కాంగ్రెస్ ... టీడీపీ నాలుగున సార్లు ... వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన జగిత్యాలకు ఎంతో చారిత్రాత్మాక పేరుంది.మొదటి నుంచి కాంగ్రెస్ ప్రాబల్యం నియోజకవర్గంపై అధికంగా ఉంది.నియోజకవర్గం 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 10 సార్లు ,టీడీపీ నాలుగుసార్లు విజయం సాధించాయి.అలాగే పీడీఎఫ్ ,ఎస్సీఎఫ్ ,ఇండిపెండెంట్ అభ్యర్థులుఒక్కోసారి విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గస్థానాల్లో 12 స్థానాలను టీఆర్ఎస్ కైవసంచేసుకుంటే జగిత్యాలలో మాత్రం 'హస్తం 'హవా కొనసాగింది. ఆరుసార్లు జీవన్ .. రెండుసార్లు రమణ కాంగ్రెస్ పార్టీ కీలకనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి జగిత్యాల నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు పోటీచేశారు. ఆరుసార్లు గెలుపొందారు. ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణనాలుగుసార్లు పోటీచేయగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ,ఒకసారి ఎంపీగా గెలుపొందారు.జీవన్‌రెడ్డి ఎక్సైజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పని చేశారు. రమణకార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ ద్విముఖ పోటీ ఉండేది. 2014లో తొలిసారిటీఆర్ఎస్ జగిత్యాల నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్‌కుమార్‌ను బరిలో దింపింది. దీంతో మొదటిసారి త్రిముఖ పోటీ ఏర్పడింది. 2018 ఎన్నికల్లోమహాకూటమితో ఎల్.రమణ ,జీవన్‌రెడ్డిలు ఒకటికావడంతో సంజయ్‌కుమార్‌కు మద్దతుగా ఎంపీ కవిత తన గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. మహిళ ఓటర్లే కీలకం జగిత్యాల అర్భన్ మండలంలో మహిళా ఓటర్లు 37,611 ఉంటే ...పురుషలు 37,010 మంది ఉన్నారు. రూరల్‌లో మహిళా ఓట్లు 23,420 ఉన్నాయి.సారంగాపూర్‌లో స్త్రీలు 9,160 ,పురుషులు 8360 మంది ఉన్నారు.బీజపూర్లో స్త్రీలు 7,644, పురుషులు 7010 మంది ఉన్నారు. మొత్తంగా పురుషులకంటేఆరువేలు పైబడే మహిళా ఓట్లు ఉన్నాయి. గతంలో ఈ ఆరువేల తేడాతో ఓడిన అభ్యర్థులు ఉన్నారు. జగిత్యాల స్వరూపం ... జగిత్యాల వ్యవసాయ ఆధారిత నియోజకవర్గంగా పేరుగాంచింది.వరి ,మొక్కజొన్న,పసుపు పండిస్తారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జగిత్యాల నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది.ఇందులో కొడిమాల్య ,మల్యాల,జగిత్యాల పట్టణం , జగిత్యాల మండలాలు ఉండేవి. 2009 లో నియోజకవర్గాలపునర్విభజనలో జగిత్యాల, రాయ్కల్ ,సారంగాపూర్ మండలాలతో ఏర్పాటైంది. 2016లో 18 మండలాలతో జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించింది. బీజాపూర్ ,జగిత్యాల అర్బన్ మండలాలలు ఏర్పాటు అయ్యాయి. జగిత్యాల దేశవ్యాప్తగుర్తింపు పొందిన జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ,పొలాస వ్యవసాయ పరిశోధన క్షేత్రం ఉన్నాయి. బరిలో వీరే .. జగిత్యాలలో ఈ సారి టీఆర్ఎస్ -కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు రమణ మహాకూటమి తరుఫు కోరుట్లనుంచి పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నియోజకవార్గంలో పట్టున్న అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి బరిలో దిగనున్నారు. టీఆర్ఎస్ నుంచినియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ పేరు ప్రకటించారు. ఈ సారి ఎలాగైనా జగిత్యాలలో గులాబీ జెండా ఎగురవేయాలని ఎంపీ కవిత పావులుకదుపుతున్నారు. ఇక బీజేపీ నుంచి ముదుగంటి రవీందర్‌రెడ్డి టికెట్‌కోసం ప్రయత్నిస్తున్నారు. పలువురు నాయకులు వివిధ పార్టీల నుంచి టికెట్కోసంవిశ్వప్రయత్నలు చేస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గ ఓటర్లు .. పురుషులు 94,347 స్త్రీలు 1,00,051 ఇతరులు 15 మొత్తం 1,94,413 -
‘రాష్ట్రంలో రాచరిక పాలన’
సాక్షి, జగిత్యాల : ప్రజలపై అణచివేత ధోరణి ఉంటే ప్రభుత్వానికి వినాశనం తప్పదని కాంగ్రెస్‌పక్ష ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సాగునీటి కోసం శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ‘ఛలో పోచంపాడు’ కార్యక్రమాన్ని చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందుస్తుగానే కాంగ్రెస్ నేతలను, రైతు సంఘల నేతలను అరెస్ట్ చేశారు. దీనిపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని, ప్రజల హక్కుల కోసం పోరాడం చేస్తున్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతమున్న నీటిలో ఐదు టీఎంసీలు వాడుకునే అవకాశం ఉందని, దానిలో ఒక్క టీఎంసీ సాగుకోసం విడుదల చేయవచ్చునని తెలిపారు. రైతుల న్యాయమైన డిమాండ్‌కు తెలంగాణ సర్కార్ పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాగా శ్రీరాం సాగర్ నీటి విడుదల కోసం గత వారం రోజులుగా రైతుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
ఉద్యోగం వదిలేశా: రచ్చ రవి
సాక్షి, జగిత్యాల: ‘నా స్వస్థలం వరంగల్ జిల్లా కేంద్రం. నన్ను సినీ ఇండస్ట్రీయే ఎంతో గొప్పవాన్ని చేసింది. సినీరంగంలో దాదాపు 45 సినిమాల్లో అగ్రనాయకులతో నటించా. నన్ను ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రజలు లేకుంటే నేను లేను. మున్సిపల్లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చినా నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి వెళ్లా. ఇంట్లో డాక్టర్ కావాలని తల్లిదండ్రులకు కోరిక ఉన్నా యాక్టర్నయ్యాను. డాక్టర్లనే నవ్వించడంతో ఇంట్లో వారు కూడా నన్ను అభినందిస్తున్నార’ని జబర్దస్త్ ఫేం రచ్చరవి తెలిపారు. శుక్రవారం జగిత్యాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్నప్పటి నుంచి చెట్లు అంటే ఎంతో ఇష్టమని.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాలలో డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి మొక్కలను నాటే కార్యక్రమంలో భాగంగా జగిత్యాలకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు ఆదరించడం ఆనందంగా ఉందని.. ముఖ్య లక్ష్యం మన ఊరులో మన జమ్మిచెట్టుతో దసరా జరుపుకోవడమేనని వివరించారు. కొన్ని గ్రామాల్లో తుమ్మచెట్టుతో జమ్మి జరుపుకునే దుర్గతి వచ్చిందని.. రానున్న కాలంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా విజృంభించడంతో చెట్లే లేకుండా పోయే పరిస్థితి నెలకొందన్నారు. మనం ఎంత సంపాధించామన్నది ముఖ్యం కాదని.. ఎలా బతికామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీలో అనేక చోట్ల దయగల పెట్టెలను ఏర్పాటు చేశానని.. ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. నా మొదటి సినిమా వెయ్యి అబద్దాలు మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. -
జగిత్యాలలో 15 తులాల బంగారం చోరీ
జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో దొంగలు హల్చల్ చేశారు. స్ధానికంగా నివాసం ఉంటున్న రాచర్ల మహేష్ అనే వ్యక్తి ఇంట్లో శనివారం వేకువజామున దొంగలుపడి 15 తులాల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్ దోచుకెళ్ళారు. ఉక్కపోత కారణంగా కుటుంబసభ్యులు డాబాపై నిద్రిస్తుండగా ఇంటి కిటికీ ఊచలు తొలగించి లోనికి జొరబడిన దొంగలు బీరువాలోని 15 తులాల బంగారు నగలు, ల్యాప్‌టాప్ దోచుకెళ్లారు. ఉదయం లేస్తూనే చోరీ జరిగిన విషయం గమనించిన మహేష్ జగత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ ఇంటిని పరిశీలించిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
సారంగాపూర్‌లో మహిళ హత్య
జగిత్యాల: జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో పూర్ణ (35) అనే మహిళ సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. ఈమె భర్త చనిపోగా ఒక కుమార్తె ఉంది. పూర్ణకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో సదరు వ్యక్తి కుమారుడు, ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను తలపై రోకలిబండతో మోది హత్య చేశాడు. కేకలు వినిపించడంతో స్థానికులు వచ్చేసరికి ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. కాగా పారిపోతూ ముగ్గురు నిందితులు బావిలో పడిపోయారు. దీంతో వారిలో ఒకరిని స్థానికలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.