మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, రాణిరుద్రమ, సుగుణాకర్‌రావు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికి ఈనెల 22న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలే బరిలోకి దిగగా.. ఉపాధ్యాయులే ఓటర్లుగా వ్యవహరించనున్నారు. అయితే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేతలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీకి అధికారికంగా అభ్యర్థిని ప్రకటించడం లేదని చెప్పిన టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా గ్రూప్–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతు ఇస్తున్నట్లు తాజాగా స్పష్టం చేయడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతు ఇవ్వాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అధికార పార్టీ నుంచి అనధికారిక అభ్యర్థిగా రంగంలోకి దిగిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ జిల్లాల వారీగా 42 నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓట్ల కోసం వేట ప్రారంభించారు. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటల్లాంటి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో విద్యావంతులు తనకే ఓటేస్తారని ఆశాభావంతో ఆయన ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలని యోచిస్తున్నారు.
ప్రశ్నించే గళం కావాలంటున్న జీవన్‌రెడ్డి
శాసనమండలిలో ప్రతిపక్షం ఊసే లేకుండా చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ అప్రజాస్వామిక పద్ధతిలో సాగుతోందని విమర్శిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో ప్రజా గొంతుక అవుతానని చెబుతున్న ఆయన రాష్ట్ర మంత్రిగా, జగిత్యాల ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులు కూడా గెలుపునకు దోహదపడతాయని అంటున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే 70వేలకు పైగా పట్టభద్రుల ఓట్లు ఉండగా.. వరంగల్, ఆదిలాబాద్‌లో సైతం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంతృప్తికరమైన రీతిలో ఓటింగ్ జరగడం తనకు అనుకూలించే అంశంగా ఆయన భావిస్తున్నారు. అన్నింటికి మించి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఆయన తాజా అసెం బ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోవడం.. వెనువెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో సానుభూతి కూడా పనిచేస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన మిగతా జిల్లాల్లో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు.
యువ ఓటర్ల మద్దతుపై రాణి రుద్రమ ఆశలు
యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ సైతం పట్టభద్రుల స్థానానికి చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేశారు. పట్టభద్రులైన యువ ఓటర్లతో పాటు విద్యావంతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమ సంఘాల మద్దతు తనకు లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం మద్దతు పొందిన ఆమె ఆదివారం నుంచి ప్రచార పర్వంలోకి దిగాలని నిర్ణయించారు. తన వంటి యువతను ఎన్నుకుంటే శాసనమండలి విలువలను కాపాడుతానని చెబుతున్న రాణిరుద్రమ సమాజంలో మార్పు కోసం యువత తన వెంట నిలుస్తుందని, పట్టభద్రుత మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జీవన్‌రెడ్డితోనే పోటీ..
బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పొల్సాని సుగుణాకర్‌రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు జీవన్‌రెడ్డితోనే పోటీ అని చెబుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ల్లోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతూ ఇప్పటికే ప్రచారం చేస్తున్న ఆయన గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ఇప్పటికే నష్టపోయామన్న భావనతో ఉన్న పట్టభద్రులు.. ఏ అజెండా లేని ఆ పార్టీలకు ఈసారి ఓటు వేసేందుకు యువత, ఉద్యోగ సంఘాలు సిద్ధంగా లేరనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
పలువురు ఇండిపెండెంట్లు కూడా...
సామాజిక, రాజకీయ రంగాల్లో కొనసాగుతున్న పలువురు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. ఆయా జిల్లాల్లో తమకు ఉన్న సంబంధాలు, వివిధ సమస్యలపై గతంలో తాము చేసిన పోరాటాలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెడతాయని భావిస్తున్నారు. ఏబీవీపీ మాజీ నాయకుడు గురువుల రణజిత్‌మోహన్, ఎడ్ల రవికుమార్, కేశిపెద్ది శ్రీధర్‌రాజు, ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు పడే ఓట్లపై ప్రభావం చూపనున్నారనడంలో సందేహం లేదు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ సహా నాలుగు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment