నోటీస్‌ ఇచ్చాకే చెక్‌ బౌన్స్‌ కేసు | Senior Lawyer Explains How To Care With Bank Checks In Karimnagar | Sakshi
Sakshi News home page

నోటీస్‌ ఇచ్చాకే చెక్‌ బౌన్స్‌ కేసు

Published Sun, Jul 14 2019 10:06 AM | Last Updated on Sun, Jul 14 2019 10:10 AM

Senior Lawyer Explains How To Care With Bank Checks In Karimnagar - Sakshi

బ్యాంక్‌ చెక్‌, లాయర్‌ మారెశెట్టి ప్రతాప్‌

సాక్షి, జగిత్యాల(కరీనగర్‌) : ఇటీవలి కాలంలో డబ్బులు బాకీ ఉన్న వ్యక్తికి చెక్కులు ఇవ్వడం, ఆ చెక్కులు బ్యాంకుకు వెళ్లినప్పుడు తిరస్కరించడం వంటి సంఘటలను చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకులో డబ్బులు లేక చెక్కు తిరిగి వచ్చిందని చెప్పినప్పటికీ, చెక్కులు ఇచ్చిన వ్యక్తులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్నారు. కేసు దాఖలుకు ముందే చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఓ నోటీస్‌ను పంపించాల్సి ఉంటుంది. నోటీస్‌కు సంబంధించిన విషయాల గురించి జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది మారిశెట్టి ప్రతాప్‌(94404 38914) వెల్లడించారు. 

నోటీస్‌లో ఏం ఉండాలంటే..
నోటీస్‌ ఇలానే ఉండాలనే నియమం ఏమి లేదు. నోటీస్‌ను స్వయంగా లేదా అడ్వకేట్‌ ద్వారా పంపవచ్చు. చెక్కు ఎవరిపేరిట ఇవ్వబడిందో ఆ వ్యక్తే స్వయంగా నోటీస్‌ పంపాల్సి ఉంటుంది. నోటీస్‌లో చెక్కు ఇచ్చిన వ్యక్తి బాకీ ఉన్న విషయం, ఆ బాకీ తీర్మానం నిమిత్తం చెక్కు ఇచ్చినట్లు స్పష్టంగా ఉండాలి. అలాగే ఏ తేదీన చెక్కును బ్యాంకులో ప్రజెంట్‌ చేసింది, ఏ తేదీన ఆ చెక్కు చెల్లలేదని బ్యాంకు ద్వారా తెలిసిందనే విషయాలను నోటీస్‌లో స్పష్టంగా పేర్కొనాలి. చెల్లకుండా పోయిన చెక్కు నంబర్‌ను కూడా నోటీస్‌లో చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఏ కారణం చేత చెక్కు చెల్లకుండా పోయిందన్న విషయాలు కూడా తెలియజేయాలి. ముఖ్యంగా ఆ చెక్కులో పొందుపర్చిన మొత్తాన్ని, నిర్దేశించిన వ్యవధి లోపల చెల్లించాల్సిందిగా డిమాండ్‌ తప్పనిసరిగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో తెలిసి, తెలియక నోటీస్‌లో కొంత అస్పష్టత ఉండవచ్చు. ఇలాంటి సమయాల్లో నోటీస్‌ చెల్లకుండా పోతుందా అనే విషయాలపై సుప్రీంకోర్టు పలు కేసుల్లో వివరణలు సైతం ఇచ్చింది. నోటీస్‌ ఇవ్వడం ప్ర«ధాన ఉద్దేశ్యం..చెక్కు కర్త తన తప్పును తాను తెలుసుకుని సొమ్ము చెల్లించేందుకు ఒక అవకాశాన్ని ఇవ్వడంటూ 1999లో సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ సాక్సోన్‌ ఫామ్స్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

30 రోజుల్లో నోటీస్‌ ఇవ్వాలి..
చెక్కు చెల్లని విషయాన్ని చెక్కు ఇచ్చిన వ్యక్తికి నోటీస్‌ ద్వారా తెలియజేయడం తప్పనిసరి. నోటీస్‌ ఇవ్వకుండా కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తే అది చెల్లదు. ఏదో మాములుగా నోటీస్‌ ఇవ్వడం కాకుండా అది చట్టబద్ధంగా ఉండాలి. నోటీస్‌ రాతపూర్వకంగా మాత్రమే ఉండాలి. మౌఖికంగా ఇచ్చె నోటీస్‌ చెల్లదు. చెక్కు చెల్లలేదని బ్యాంకు నుంచి సమాచారం అందినప్పటి నుంచి 30 రోజుల్లోపు నోటీస్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా 30 రోజుల్లోపు నోటీస్‌ ఇవ్వకపోతే, ఆ చెక్కును తిరిగి బ్యాంకులో ప్రజెంట్‌ చేయవచ్చు. చెక్కుపై వేసిన తేదీ నుంచి ఆరు నెలల వ్యవధి ఉన్నట్లయితేనే తిరిగి బ్యాంకులో ప్రజెంట్‌ చేసే అవకాశం ఉంటుంది. మరో ముఖ్య విషయమేమిటంటే, బ్యాంకులో చెక్కువేసిన తేదీ కంటే కూడా, చెక్కు చెల్లకుండా పోయిందని బ్యాంకువారు తెలియజేసిన రోజే ప్రధానం. ఉదాహరణకు.. చెక్కు చెల్లకుండా పోవడానికి సంబంధించి బ్యాంకువారు ఇచ్చిన మెమోపై 5–1–2019 అని ఉండవచ్చు. కాని 9–1–2019 రోజున ఆ మెమో చెక్కు ప్రజెంట్‌ చేసిన వ్యక్తికి ఇవ్వబడింది. దీని ప్రకారం 10–1–2019 నుంచి 30 రోజులలోపు చెక్కు ఇచ్చిన వ్యక్తికి నోటీస్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట.

నోటీస్‌ ఎలా పంపాలంటే..
చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి నోటీస్‌ పంపించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నప్పటికీ, నోటీస్‌ను ఎలా పంపాలన్న విషయంపై స్పష్టత లేదు. సాధారణంగా నోటీస్‌కు తిరుగు రశీదు(ఎకనాలేడ్జ్‌మెంట్‌ కవర్‌)తో కూడిన రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది. తిరుగు రశీదుతో కూడిన నోటీస్‌ పంపడం వల్ల, ఆ నోటీస్‌ ఎవరికి పంపబడిందో ఆ వ్యక్తికి ఆ నోటీస్‌ ఎప్పుడు అందినదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. నోటీస్‌ ఇవ్వడం ఎంత ముఖ్యమో, సరైన చిరునామాకు పంపడం కూడా అంతే ముఖ్యం. చాలా సందర్భాల్లో నోటీస్‌లు డోర్‌ లాక్‌డ్, సదరు వ్యక్తి ఆ అడ్రస్‌లో లేడని, తీసుకోలేదంటూ తిరిగి రావడం జరుగుతుంది. అయితే వీటిలో కొన్ని నిజాలు, కొన్ని అవాస్తవాలు ఉండోచ్చు. ఇలాంటి సందర్భాల్లో నోటీస్‌ పంపానని ఒకరు, నోటీస్‌ అందలేదని మరొకరు చెప్పడం పరిపాటిగా మారింది.

నోటీస్‌పై వాదోపవాదాలు..
నోటీస్‌ అందడం, అందకపోవడంపై పలు వాదోపవాదాలు ఉన్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి నివాసం ఉండే చిరునామాకు, అంటే సరైనా చిరునామాకు నోటీస్‌ పంపబడి ఉండి, అతడికి అందకపోయినప్పటికీ, నోటీస్‌ అందినట్లుగానే భావించడం జరుగుతుందని సుప్రీంకోర్టు 1999లో కె.భాస్కరన్‌ వర్సెస్‌ ఎస్‌.కె.బాలన్‌ కేసులో స్పష్టం చేసింది. ఇలాంటి కేసులో నోటీస్‌ అందలేదని భావిస్తే, దానిని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కూడా అతడిపైనే ఉంటుందని కూడా పేర్కొంది. అలాగే నోటీస్‌ తిరస్కరించినప్పటికీ అందినట్లుగానే భావించబడుతుంది. అయితే నోటీస్‌ అందినట్లుగా భావించే సూత్రాన్ని అన్ని కేసులకు ఒకే విధంగా అన్వయించరాదని సుప్రీంకోర్టు మరో కేసులో వ్యాఖ్యానించింది. అయితే కేసు సందర్భాన్ని బట్టి, ఆ కేసు స్వరూపాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యలు చేసింది. ఇంకా నోటీస్‌ సరైన అడ్రస్‌కు పంపించామని, పోస్ట్‌మాన్‌ ముద్దాయితో మిలాఖత్‌ అయ్యాడని, పోస్ట్‌మాన్‌ సహకారంతో ముద్దాయి ఇంట్లో లేనట్టుగా తప్పుడు ఎండార్స్‌మెంట్‌ వచ్చిందని ఫిర్యాది వాదన చేస్తే, ఆ విషయాన్ని ఫిర్యాదే రుజువు చేసుకోవాల్సి ఉంటుందని, చట్టప్రకారం అది అతడి బాధ్యత అని సుప్రీంకోర్టు 2004లో వి.రాజకుమారి వర్సెస్‌ పి.సుబ్రమనాయుడు కేసులో స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement