బహిరంగ సభలో మాట్లాడుతున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. చిత్రంలో ఎంపీ నామా, ఎమ్మెల్యేలు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు తనకు రెండు కళ్లలాంటివని, ఆయా జిల్లాల అభివృద్ధి కోసం అందరి సహకారంతో నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఉద్ఘాటించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఖమ్మం చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు గురువారం ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్దార్ పటేల్ స్టేడియంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితకాలం రుణపడి ఉంటానని, అలాగే జిల్లా, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయన్నారు. పేదల గుండెల్లో గూడు కట్టుకునే విధంగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగానే మంత్రిగా తన పనితీరు ఉంటుందే తప్ప దర్పం ప్రదర్శించడానికి తన పదవిని ఏనాడూ వినియోగించనని అన్నారు. అన్ని వర్గాలకు ఆత్మీయుడిగా ఉండటానికి పార్టీలోని పెద్దల ఆశీస్సులు, సహకారం, సహచరు లు, చిన్నవారి తోడ్పాటుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేం దుకు ప్రయత్నిస్తానన్నారు. రెండు జిల్లాల ప్రజల అవసరాలు, సమస్యలు, భౌగోళిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉందని, ఆ యా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో తాను పర్యటిస్తున్న సమయంలో ఎక్కడా ట్రాఫిక్ నిలుపుదల చేయవద్దని కోరారు. తన కాన్వాయ్, వాహనాలు ప్రజలకు ఆటంకం కాకూడదన్నారు.
గిరిజనుల్లో గిరిజనుడిలా.. దళితుల్లో దళితుడిలా.. బహుజనుల్లో బహుజనుడిలా, మైనార్టీల్లో మైనార్టీలా ప్రయాణం చేశానని, వారంతా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. తనకు మంత్రి పదవి లభించడం ఖమ్మం ప్రజల చలవేనని, వారిని తాను ఎన్నడూ మర్చిపోనన్నారు. పార్టీ నాయకులకు తలలో నాలుకలా ఉంటానన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రాములునాయక్, హరిప్రియనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, మేయర్ పాపాలాల్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, టీఆర్‌ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర, తెల్లం వెంకట్రావు, ఆర్‌జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరమణ, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి ఎంపీ నామా
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తూ.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అండగా ఉంటామని ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం తొలిసారిగా ఖమ్మం వచ్చిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజుజ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఎంపీ నామా మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచి పార్టీలకతీతంగా ఎంతోమంది మహానుభావులు కేంద్ర, రాష్ట్రస్థాయిలో పదవులను అలంకరించారని గుర్తు చేశారు. చరిత్రలో తొలిసారి ఖమ్మం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, మంత్రి పదవిని పొందిన అజయ్‌కుమార్ అభివృద్ధి ప్రదాతగా పేరు తెచ్చుకుని చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. పువ్వాడ నాగేశ్వరరావు రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకున్న అజయ్ ప్రజలకు అదే స్థాయిలో సేవలు అందించాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పెద్దలు, చిన్నలను కలుపుకుని ముందుకు పోవాలన్నారు. అజయ్‌కుమార్‌కు శత్రువులు ఉండకూడదని, అంతా మిత్రులు కావాలని ఆకాంక్షించారు.
జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాతగా మంత్రి పదవి దక్కిందని, ఇదే స్ఫూర్తితో ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా.. యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్న అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడంతోపాటు ఉమ్మడి జిల్లాను సమగ్రాభివృద్ధి చేసే అవకాశం పువ్వాడకు దక్కిందన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ ఇది పండుగ వాతావరణం అని.. జిల్లాకు మంత్రి పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా జూలూరుపాడు, కారేపల్లి మండలాలకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ మాట్లాడుతూ ఇల్లెందు నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉందన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న యువ నేత అజయ్‌కుమార్ తమ నియోజకవర్గంపై దృష్టి సారించాలని కాంక్షించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ సామాన్యుడిగా ప్రజల్లో పేరున్న అజయ్‌కుమార్ అజేయుడిగా నిలిచారని, రాబోయే కాలంలో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టాలని కాంక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఇల్లెందులో బస్సు డిపో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. మేయర్ పాపాలాల్ మాట్లాడుతూ ఇదొక చరిత్ర అని, ఖమ్మం ఖిల్లాపై పువ్వాడ ముద్ర పడనున్నదన్నారు. అనంతరం పువ్వాడ అజయ్‌కుమార్‌ను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పూజారులు ఆశీర్వదించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు మంత్రికి నోట్‌బుక్స్, పెన్సిళ్లు అందించి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment