నేనూ పేదింట్లోనే పుట్టాను | i too born in poor family, says ias officer praveen kumar | Sakshi
Sakshi News home page

నేనూ పేదింట్లోనే పుట్టాను

Published Wed, Jan 14 2015 7:22 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

నేనూ పేదింట్లోనే పుట్టాను - Sakshi

నేనూ పేదింట్లోనే పుట్టాను

బాగా చదివా.. ఉన్నత స్థాయికి వచ్చా
కూలిపనులు చేస్తూ పిల్లల్ని చదివించడం అభినందనీయం
సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్
నిరుపేద కుటుంబంతో మాటామంతీ

 

పరిగి: ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నస్కల్‌కు వచ్చారు. ఇంతలో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా స్థానిక ఎస్సీ కాలనీలోకి నడిచారు. గ్రామం చివరలో ఉన్న సీనయ్య, సాయమ్మ దంపతులు ఇంటి తలుపు తట్టారు. రెక్కాడితే గానీ డొక్కాడని దయనీయ పరిస్థితి ఆ కుటుంబానిది. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. ఓ కుమారుడు.. ఎప్పటిలాగే పిల్లలకు వంటచేసి సద్ది కట్టుకుని కూలిపనులకు పోదామని తయారయ్యారు. అదే సమయంలో అనుకోని అతిథి రావడంతో ఆశ్చర్యపోయారు. తేరుకునేలోపే.. అమ్మా.. పెద్దాయనా.. బాగున్నరానే అంటూ ఆయన ఆప్యాయంగా పలకరించారు.. మీరెవరో గుర్తొస్తలేరు.. ఎవరు నాయనా అంటూ వారు అనుమానంగా పలకరించారు. ఇంతలో ఆ గ్రామానికి చెందిన చదువుకున్న యువకుడు వెళ్లి సీనయ్య దంపతుల చెవిలో విషయం చెప్పాడు. ఆయన ప్రవీణ్‌కుమార్ సార్ అని పెద్దసారు.. మన ఇండ్లల్ల ఎంట్ల బతుకుతున్నరు.. పిల్లల్ని మంచిగ చదివిస్తున్నారా లేదా అని తెలుసుకోనీకే వచ్చిండు.. అని చెప్పటంతో వారు అవాక్కయ్యారు.

ఏం మాట్లాడాలో.. ఏంచేయాలో వారికి తోచలేదు.. ఇంతలో ప్రవీణ్‌కుమార్  కల్పించుకుని మీరు ఏం పని చేస్తరు.. అని అడిగారు. కూలిపనులు చేస్తం సారు అని సమాధానమిచ్చారు.. రోజుకు ఎంతిస్తరు..? నాకు రెండు నూర్లు.. మా ఆవిడకు నూరు ఇస్తరు.. పొలం ఉందా?.. లేదు సారు..  మీకెంతమంది పిల్లలు..?  ముగ్గురు పిల్లలు బాబూ అని చెప్పారు సీనయ్య దంపతులు. వారు ఏం చదివారు ప్రవీణ్‌కుమార్ అడగడంతో.. పెద్దమ్మాయిని డిగ్రీ చదివించినం.. ఇప్పుడు ప్రైవేటు దవాఖాన్ల నర్సు ఉద్యోగం చేస్తోంది. చిన్నబిడ్డ.. కొడుకు పరిగిల కాలేజ్‌కి పోతున్నరు.. అంటూ ఆ దంపతులు ప్రవీణ్‌కుమార్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు.

సీనయ్య ఇంట్లో ప్రవీణ్‌కుమార్ గంటసేపు ఉన్నారు. వారితో చాయ్ పెట్టించుకుని తాగారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీల్లో సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. 'నేనూ.. మీలాగే పేదింట్లో పుట్టాను.. చదువుకోవటంవల్లే ఈ స్థాయికి వచ్చాన'ని వివరించారు. కూలిపనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్న ఆ దంపతులను ఆయన కొనియాడారు. అనంతరం అక్కణ్నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement