'నేనసలే మొండికేసు.. సంగతి తేలుస్తా' | I will focus on singareni from to day : KCR | Sakshi
Sakshi News home page

'నేనసలే మొండికేసు.. సంగతి తేలుస్తా'

Published Sun, Oct 8 2017 5:58 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

I will focus on singareni from to day : KCR - Sakshi

ప్రగతి భవన్‌లో సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : సింగరేణి కార్మికులు తనను క్షమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. గతంలో ఒకసారి టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ను గెలిపించారని, సమయం లేక సింగరేణి గురించి పెద్దగా పట్టించుకోలేదని కానీ, ఈసారి మాత్రం అలా ఉండదని చెప్పారు. ఆదివారం సింగరేణి కార్మికులతో ప్రగతి భవన్‌లో సమావేశం అయిన సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటి వరకు పరిగకంపలాంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నానని ఇకపై సింగరేణిపై దృష్టిపెడతానని అన్నారు. మొన్నటి వరకు ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు సింగరేణి ఇలా ఒక్కొక్కటి బాగుచేయడం మొదలుపెట్టానని తెలిపారు. ఇంకా ఆయనేం మాట్లాడారంటే..

'సింగరేణి నలు మూలల నుంచి వచ్చిన అందరికీ నమస్కారాలు. టీబీజీకేఎస్‌ను మరోసారి గెలిపించినందుకు అభినందనలు. గతంలో కూడా టీబీజీకేఎస్‌ను గెలిపించారు. కానీ పని జరగేలేదు.. ఇప్పుడు జరగాలి..గతంలో పరిగకంపలాంటి పరిస్థితులను దాటుకుంటూ వస్తున్న..ఆర్టీసీది కూడా మీలాంటి సంస్థ. ఆర్టీసీకి వచ్చే నష్టం అంతా కూడా హైదరాబాద్‌ బస్సుల నుంచే వస్తుంది. ఆ నష్టం నుంచి బయటపడేసేందుకు ఏడాదికి రూ.200 కోట్లు జీహెచ్‌ఎంసీ నుంచి ఇచ్చి ఆర్టీసీని బతికిస్తున్నాను. ఇక ఎలక్ట్రిసిటీ అని ఒకటి ఉంది. అందులో ఉన్నవాళ్లకు కడుపు నిండదు. 25వేలమంది టెంపరరీ ఉద్యోగుల పెట్టిన్రు.. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆరు నెలలు పట్టింది. సింగరేణి అన్నలు నన్ను క్షమించాలి. గతంలో టైం లేక శ్రద్ధ పెట్టలేదు. ఈసారి గెలిచిన గెలుపు నిజమైన కార్మికుల గెలుపుకావాలి. ఎన్నికలు గెలిసినప్పుడు సంఘాలు గెలువద్దు. కార్మికులు గెలవాలి. మెడికల్‌ బోర్డులో మొత్తం లంచాలే కనిపిస్తున్నాయి. లంచం ఇచ్చేటోన్ని ఇప్పిచ్చేటోన్ని, ఇచ్చేటోన్ని చెప్పుతో కొట్టాలి. ఎందుకు కార్మికులు లంచం ఇయ్యాలి. క్వార్టర్‌ మారినా లంచం ఇవ్వాలంట.. అసలు ఎందుకు ఇవ్వాలి. సింగరేణి క్వార్టర్లకు స్వయంగా వస్తా.


మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తా. మీ ఆస్పత్రుల్లో నా బీపీ కూడా చెక్‌ చేసుకుంట. సభ్యత్వం కింద నెలకు రూ.20 ఇచ్చేవారు.. అలా చేస్తే 53 వేలమంది కార్మికులు నెలకు రూ.13లక్షలు అవుతుంది. అంత పెద్ద మొత్తం అసలు అవసరమే లేదు. ఇక నుంచి రూ.1 ఇస్తే సరిపోతుంది. ఇకపై సింగరేణిలో అన్ని సమస్యలు మీరే రికార్డు చేయండి. స్వయంగా నాలుగు గంటలు కూర్చొని నేనే వాటిని కనుక్కుంటా. కొత్తగూడెం దగ్గర బ్రిటీషోల్లు కట్టిన క్వార్టర్లు ఉన్నాయి.. వాటన్నింటిని మారుస్తా. అబద్ధంలో బతకొద్దు.. అబద్ధాలు చెప్పే యూనియన్లు ఉన్నాయి. 2000 సంవత్సరం తెలంగాణ ఉద్యమంలో నేను వచ్చినప్పుడు కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. నాది సింగరేణి ప్రాంతం కాదు. విష వాయువుల మధ్య పనిచేస్తారని తెలుసుకొని నాకు బాధేసింది. బొగ్గు పౌడర్‌ కూడా లోపలికి పోతదంట. ఇక నుంచి సింగరేణి బొగ్గు గని తవ్వుడే కాదు. బయ్యారం గనుల వెలికితీత కూడా సింగరేణికి ఇస్తాం.


అండర్‌ గ్రౌండ్‌లో 30వేలమంది పనిచేస్తే అందులో వచ్చేది 15శాతం.. ఓపెన్‌లో 85శాతం ఉత్పత్తి వస్తది. కానీ, అధికారులు మాత్రం రివర్స్‌లో చెబుతారు. త్వరలో ఆరు అండర్‌ గ్రౌండ్‌ మైన్స్‌ ప్రారంభిద్దాం. ఉక్కు, కాపర్‌ గనులు సింగరేణికి అప్పగిస్తాం. మెడికల్‌ బోర్డును తీసేసి కొత్తది పెడతాం. అది మెడికల్‌ బోర్డా దొంగ బోర్డా. నేనసలే మొండికేసు.. దాని సంగతి తేలుస్తా. ఇక ఉద్యోగం వద్దనుకునే వాళ్లు.. డిపెండెంట్‌ ఉద్యోగులకు రూ.25లక్షలు ఇస్తాం.. మొత్తం డబ్బు తీసుకోవద్దనుకుంటే దానిని నెలకు రూ.25వేలు ఇచ్చేలా అమలుచేస్తాం. ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారికి రూ.6లక్షలు ఇచ్చేలా లోన్లు ఇస్తామని చెబుతున్నాం.. మీ కోరిక మేరకు 100శాతం రూ.పది లక్షలు వడ్డీలేని లోనుగా ఇస్తాం. కొత్తగూడెం చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఎంపీ 15సార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదు. మనల్ని పట్టించుకోని వ్యక్తి మనకు మాత్రం ఎందుకు.. ఆయనను తీసి పారేస్తే ఓ పనైపోతుంది. కార్మికుల కోసం ఏసీ పెట్టిస్తాం.. దానికి ఫ్రీ కరెంట్‌ కూడా ఇస్తాం. సింగరేణి ఆస్పత్రులను ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతాం. కార్మికులను ఇబ్బంది పెడుతున్న వైద్యాధికారిని మారుద్దాం. పిల్లలకు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు వస్తే పూర్తి ఫీజు చెల్లిస్తాం. అంబేద్కర్‌ జయంతి రోజున ఇక నుంచి సింగరేణి కార్మికులకు సెలవు' అంటూ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలన్నింటిని తప్పకుండా అమలు చేస్తామంటూ పునరుద్ఘాటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement