వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న కేసీఆర్
నేను మాట అంటే తప్పను.. జిల్లాకు సాగు నీరు తెచ్చి చూపిస్తా. ఈప్రాంత ప్రజల కోరిక మేరకు జిల్లాను జోగులాంబ నుంచి చార్మినార్ జోన్‌లోకి మారుస్తా. అనంతగిరిని అద్భుతంగా తీర్చిదిద్దుతా. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వికారాబాద్ జిల్లా ఏర్పాటును సాకారం చేసిన నాకు బహుమానంగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆనంద్‌కు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నా.
సాక్షి, వికారాబాద్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వికారాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి అంగుళం పచ్చగా కళకళలాడే వరకూ విశ్రమించబోనని స్పష్టంచేశారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జిల్లాను జోగులాంబ జోన్‌లో కలుపుతామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు. అనంతగిరి ప్రాంతాన్ని అద్భుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తాను గతంలో వికారాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్లబుద్ధి అయ్యేదికాదని గుర్తుచేసుకున్నారు. అనంతగిరిని సుందర ప్రదేశంగా చేస్తామని తెలిపారు. ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తామని వివరించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు ద్వారా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కేసీఆర్ స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ అని, మైనార్టీలకు కూడా అండగా ఉంటా మని చెప్పారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్. ఆనంద్ దంపతులు ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్నారని, ఆయనను లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉర్దూలో ప్రసంగించి మైనార్టీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సమావేశంలో అభ్యర్థి డాక్టర్. మెతుకు ఆనంద్, ఆపద్ధర్మ మంత్రులు హరీష్‌రావు, మ హేందర్‌రెడ్డి, విద్య వైద్య మౌళిక వసతుల కల్పన చైర్మన్లు నాగేందర్‌గౌడ్, పర్యాద కృష్ణమూర్తి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎస్.కొండల్‌రెడ్డి, జెడ్పీటీసీ ముత్తార్‌షరీఫ్, నాయకులు నరోత్తంరెడ్డి, రాంచంద్రారెడ్డి, శుభప్రద్‌పటేల్, భూమనోళ్ల కృష్ణయ్య, రాంచందర్‌రావు, పలు మండలాల నాయకులు పాల్గొన్నారు.
శ్రేణుల్లో ఉత్సాహం..
వికారాబాద్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఎన్నికల సభలో గులాబీ దళపతి కేసీఆర్ పాల్గొనడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఈ ప్రాంతానికి సంబంధించి మూడు ప్రధాన అంశాలైన జిల్లాను జోగులాంబ జోన్‌నుంచి మార్చడం, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడం, అనంతగిరిని అతి సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పిన సమయంలో ప్రజలు కేరింతలు కొట్టారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్. ఆనంద్ చాలా మంచి వ్యక్తని, కుళ్లు రాజకీయాలు తెలియవని చెప్పినప్పుడు సభికులనుంచి విశేష స్పందన లభించింది. ఆనంద్ దంపతులిద్దరూ ఈ ప్రాంతంలో వైద్య సేవలందిస్తున్నారని కేసీఆర్ ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.
లక్ష మెజారిటీతో ఆనంద్‌ను గెలిపిస్తే తానే స్వయంగా వికారాబాద్ వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొనడం ద్వారా స్థానిక ప్రజలను ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 118 నియోజకవర్గాల్లో పర్యటించి మాట్లాడానని తెలిపారు. బుధవారం చివరగా తన సొంత సెగ్మెంట్ గజ్వేల్‌లో పర్యటిస్తానని చెప్పారు. సమయం లేనందున త్వరగా ముగిస్తున్నానని వెల్లడించారు. మొత్తానికి కేసీఆర్ సభ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.
సమయం లేదు..
వికారాబాద్‌లో కేసీఆర్ సభ వాస్తవానికి 4.15 నిమిషాలకు ఉంటుందని పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా ఆయన గంట ఆలస్యంగా 5.12 నిమిషాలకు వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే చీకటి పడుతుండడంతో హెలికాఫ్టర్ టేకాఫ్ అయ్యే అవకాశం లేకపోవడంతో కేసీఆర్ ఒక్కరే మాట్లాడారు. మేరీనాట్స్ గ్రౌండ్‌లో హెలికాప్టర్ దిగగానే ఐదు నిమిషాల్లోనే సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి అతివేగంగా స్టేజీపైకి చేరుకున్నారు. ఆ వెంటనే కేసీఆర్ కూడా వేదికపైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. ఈ దశలో ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి మైకు అందుకుని కేసీఆర్ మాట్లాడతారని చెప్పేసరికి స్టేజీ పైనున్న వారు ఆశ్చర్యపోయారు. కనీసం అభ్యర్థి డాక్టర్. మెతుకు ఆనంద్‌కు కూడా మాట్లాడే అవకాశం కల్పించలేదు. దీంతో సరిగ్గా 5.13 నిమిషాలకు కేసీఆర్ ప్రసంగం మొదలుపెట్టి 5.25 వరకు.. సరిగ్గా 12 నిమిషాలు.. మాట్లాడి వెళ్లిపోయారు. సెగ్మెంట్‌లోని పలు మండలాల నుంచి వేలాదిగా వచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ స్పల్ప ప్రసంగం విని నిట్టూర్చారు. ఎంతో సేపు మాట్లాడుతారని, ఏవేవో చెబుతారని ఊహించిన ప్రజలకు నిరాశే మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment