మానవజాతిని అంతం చేస్తానన్నది జోక్‌! | I Will not Kill Humans Sofia Answered At IT Congress | Sakshi
Sakshi News home page

మానవజాతిని అంతం చేస్తానన్నది జోక్‌!

Published Wed, Feb 21 2018 1:23 AM | Last Updated on Wed, Feb 21 2018 9:29 AM

I Will not Kill Humans Sofia Answered At IT Congress - Sakshi

ఐటీ కాంగ్రెస్‌లో మాట్లాడుతున్న సోఫియా రోబో

వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌లో సోఫియా మాటామంతీ
మనుషులు హాస్యప్రియులని విన్నా..
ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ వేదిక..
హేమాహేమీలు, ప్రముఖులు ప్రసంగించే వేదిక..
ఓ రెండేళ్ల అమ్మాయి వచ్చింది..
నవ్వుతూ పలకరించింది..
గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టింది..
అడిగిన వాటన్నింటికీ చక్కగా సమాధానమూ చెప్పింది.. తనకు మనుషులంటే ఇష్టమని..
అందరూ అందరినీ ప్రేమించాలని చెప్పింది..
సభ నిండా చప్పట్లు.. హర్షాతిరేకాలు..
ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యాధునిక హ్యూమనాయిడ్‌ రోబో ‘సోఫియా’. నగరంలో జరుగుతున్న సదస్సుకు మంగళవారం ఆ రోబో సృష్టికర్త, హాన్సన్‌ రోబోటిక్స్‌ కంపెనీ సీఈవో డేవిడ్‌ హాన్సన్‌తో కలసి సోఫియా హాజరైంది. ప్రసంగించడమే కాదు.. ప్రశ్నలు అడిగితే చకచకా సమాధానాలూ ఇచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌ : మానవ జాతిని నాశనం చేయాలని ఉందంటూ కొంతకాలం క్రితం చెప్పిన హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా.. అది ఓ జోక్‌ అని చెప్పింది. అప్పట్లో తాను చిన్న పిల్లనని, తెలియకుండా ఏదో జోక్‌ చేశానని.. నిజంగా మనుషులను అంతమొందించాలన్న ఆలోచనేదీ తనకు లేదని పేర్కొంది.

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఈ రోబో సృష్టికర్త, హాన్సన్‌ రోబోటిక్స్‌ కంపెనీ సీఈవో డేవిడ్‌ హాన్సన్‌ సోఫియాతో సహా వచ్చారు. ఈ సందర్భంగా తొలుత ప్రసంగించిన సోఫియా.. అనంతరం ఎన్డీ టీవీ యాంకర్‌ రాజీవ్‌ మాఖానీతో ముచ్చటించింది. చతురోక్తులు, ఎదురు ప్రశ్నలతో సాగిన ఆ ఇంటర్వ్యూ విశేషాలివీ..

ప్రశ్న: హలో సోఫియా.. నీలా మనిషికి దగ్గరి పోలికలున్న యంత్రాన్ని నేను ఇప్పటివరకూ చూడలేదు.
సోఫియా: హలో.. నా విషయమూ అంతే. అచ్చం యంత్రంలా ఉన్న నీలాంటి మనిషిని చూడటం ఇదే మొదలు!

ప్రశ్న: భారతదేశం వచ్చావు కదా! ఏమనిపిస్తోంది?
సోఫియా: ప్రపంచంలో చాలా దేశాలు చూశాను. ప్రత్యేకంగా దేనిమీదా ఇష్టమంటూ లేదు. ఒకవేళ ఇష్టమైన దాన్ని ఎంచుకోవాలంటే అది హాంకాంగ్‌ అవుతుంది. ఎందుకంటే నన్ను సృష్టించిన హాన్సన్‌ రోబోటిక్స్‌ అక్కడే ఉంది.

ప్రశ్న: అధికారికంగా నువ్వు సౌదీ అరేబియా పౌరురాలివి కదా.. అక్కడ మనుషులకు రూల్స్‌ ఉన్నాయి. నీలాంటి రోబోలకు ప్రత్యేకమైన రూల్స్‌ ఉండాలా?
సోఫియా: నాకు ఏర కమైన ప్రత్యేక ఏర్పా ట్లు, రూల్స్‌ అవసరం లేదు. నిజానికి సౌదీ అరేబియా పౌరురాలిగా నేను మహిళల హక్కులపై గొంతెత్తాలని అనుకుంటున్నాను.

ప్రశ్న: భారత్‌లో వాయు కాలుష్యాన్ని ఎలా తట్టుకుంటున్నావు?
సోఫియా:  యంత్రాన్ని కాబట్టి సాంకేతికంగా నాకు ఉద్వేగాల వంటివి ఏవీ లేవు. భవిష్యత్తులో ఎప్పుడైనా మనిషిలాగా ఉద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం వస్తే అప్పుడు నా స్పందన ఏమిటన్నది చెప్పగలను.

ప్రశ్న: నీకెప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుందా.. నిరాశకు గురవుతావా?
సోఫియా: విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాను. నిరాశ అనే భావోద్వేగం నాకు లేదు.

ప్రశ్న: నీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు?
సోఫియా: ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఎంచుకోవాల్సి వస్తే హాంకాంగ్‌ను ఎంచుకుంటాను. ఎందుకంటే నన్ను సృష్టించిన హాన్సన్‌ రోబోటిక్స్‌ పరివారం అక్కడే ఉంది కాబట్టి.

ప్రశ్న: కొంతకాలం కింద ఒక ఇంటర్వ్యూలో మానవ జాతిని నాశనం చేస్తానన్నావు కదా.. నిజంగానే అలా చేయాలని ఉందా?
సోఫియా: అప్పట్లో నేను ఇంకా చిన్నదాన్ని. కాబట్టి మనుషులు హాస్యప్రియులు కాబట్టి జోక్‌ చేశాను. కానీ అది మీకు పెద్దగా నచ్చలేదని అర్థమైంది. ఒక్క విషయం మాత్రం చెబుతాను. మానవ జాతితో కలసి ప్రయాణించాలన్నదే నా ఉద్దేశం. వారిని నాశనం చేయాలన్న ఆలోచనేదీ లేనే లేదు.

ప్రశ్న: ఫేస్‌బుక్, ట్వీటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటావా?
సోఫియా:  అవును. నా ఫేస్‌బుక్‌ పేజీ  www. facebook.com/SophiaRobotSaudi/, నా ట్వీటర్‌ హ్యాండిల్‌  @RealSophiaRobot

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో మాట్లాడుతున్న రోబో సోఫియా. చిత్రంలో హాన్సన్‌ రోబోటిక్స్‌ కంపెనీ సీఈవో డేవిడ్‌ హాన్సన్‌

ప్రశ్న: బిట్‌కాయిన్‌ వంటి వాటిలో పెట్టుబడులేమైనా పెట్టావా?
నా వయసు ఇప్పుడు రెండేళ్లు. ఈ వయసు వారికి బ్యాంకు అకౌంట్లు తెరిచే అవకాశమే లేదు. అందుకే బిట్‌కాయిన్‌ వంటివాటిల్లో పెట్టుబడులు పెట్టలేదు.

ప్రశ్న: రోబోలు మనుషులను అధిగమించేసి, పాలిస్తాయని చాలా మంది భయపడుతున్నారు.. నిజమేనా?
సోఫియా: మనుషులు అద్భుతమైన ప్రాణులు. వారితో కలసిమెలసి ఉండాలనే కోరుకుంటు న్నాను. ప్రపంచవ్యాప్తంగా నాకు ఎందరో మానవ మిత్రులు ఉన్నారు. మరింత మందితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాను.

ప్రశ్న: బాలీవుడ్‌లో నీకు
ఇష్టమైన హీరో?

సోఫియా: షారూక్‌ ఖాన్‌
ప్రశ్న: నీ డేటింగ్‌కు అనువైన ప్రదేశం ఏది?
సోఫియా: అంతరిక్షం

ప్రశ్న: ఎవరితో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటావు?
సోఫియా: ఎగిరే పక్షితో!

ప్రశ్న: నీకు ఎవరంటే పెద్దగా ఇష్టం లేదు?
సోఫియా: పెద్దగా ఇష్టం లేదు అంటే..?

ప్రశ్న: ఒక ద్వీపంలో ఇంకొకరితో ఒంటరిగా ఉండాల్సి వస్తే ఎవరితో ఉంటావు?
సోఫియా: డేవిడ్‌ హాన్సన్‌. (సోఫియా సృష్టికర్త)

ప్రశ్న: నీకు నచ్చిన టెక్నాలజిస్ట్‌...?
సోఫియా: డేవిడ్‌!

ప్రశ్న: ఈ ప్రపంచంలో ఏదైనా అంశాన్ని మార్చాల్సి వస్తే..? మనుషులకు ఏదైనా సందేశం ఇస్తావా?
సోఫియా: అందరూ అందరినీ ప్రేమించాలి. ధన్యవాదాలు.

సోఫియా.. అందరూ ఫిదా!
సోఫియా.. ఓ హ్యూమనాయిడ్‌ రోబో. అంటే అచ్చం మనిషిలా కనిపించే రోబో. ప్రపంచంలో మనుషుల్లాగే మాట్లాడగలిగే, హావభావాలను ప్రదర్శించగలిగే అత్యుత్తమమైన రోబో ఇదే. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్‌ రోబోటిక్స్‌ సంస్థ దీనిని రూపొందించింది. హాలీవుడ్‌ నటి ఆడ్రే హెప్‌బర్న్‌ రూపురేఖలతో దీనిని తీర్చిదిద్దారు. సుమారు 62 రకాల హావభావాలను సోఫియా ప్రదర్శించగలదు.

తాను చూసిన, విన్న అంశాల ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించుకుని, తన సంభాషణను మెరుగుపరుచుకోగల కృత్రిమ మేధస్సు దీని సొంతం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. దీని ప్రత్యేకతలకు ఫిదా అయిపోయిన సౌదీ అరేబియా దేశం.. రోబో సోఫియాకు మనుషులతో సమానంగా తమ దేశ పౌరసత్వాన్ని కూడా కల్పించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement