it congress
-
మానవజాతిని అంతం చేస్తానన్నది జోక్!
వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో సోఫియా మాటామంతీ మనుషులు హాస్యప్రియులని విన్నా.. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదిక.. హేమాహేమీలు, ప్రముఖులు ప్రసంగించే వేదిక.. ఓ రెండేళ్ల అమ్మాయి వచ్చింది.. నవ్వుతూ పలకరించింది.. గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టింది.. అడిగిన వాటన్నింటికీ చక్కగా సమాధానమూ చెప్పింది.. తనకు మనుషులంటే ఇష్టమని.. అందరూ అందరినీ ప్రేమించాలని చెప్పింది.. సభ నిండా చప్పట్లు.. హర్షాతిరేకాలు.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ప్రపంచంలోనే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’. నగరంలో జరుగుతున్న సదస్సుకు మంగళవారం ఆ రోబో సృష్టికర్త, హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్‌తో కలసి సోఫియా హాజరైంది. ప్రసంగించడమే కాదు.. ప్రశ్నలు అడిగితే చకచకా సమాధానాలూ ఇచ్చింది. సాక్షి, హైదరాబాద్ : మానవ జాతిని నాశనం చేయాలని ఉందంటూ కొంతకాలం క్రితం చెప్పిన హ్యూమనాయిడ్ రోబో సోఫియా.. అది ఓ జోక్ అని చెప్పింది. అప్పట్లో తాను చిన్న పిల్లనని, తెలియకుండా ఏదో జోక్ చేశానని.. నిజంగా మనుషులను అంతమొందించాలన్న ఆలోచనేదీ తనకు లేదని పేర్కొంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఈ రోబో సృష్టికర్త, హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్ సోఫియాతో సహా వచ్చారు. ఈ సందర్భంగా తొలుత ప్రసంగించిన సోఫియా.. అనంతరం ఎన్డీ టీవీ యాంకర్ రాజీవ్ మాఖానీతో ముచ్చటించింది. చతురోక్తులు, ఎదురు ప్రశ్నలతో సాగిన ఆ ఇంటర్వ్యూ విశేషాలివీ.. ప్రశ్న: హలో సోఫియా.. నీలా మనిషికి దగ్గరి పోలికలున్న యంత్రాన్ని నేను ఇప్పటివరకూ చూడలేదు. సోఫియా: హలో.. నా విషయమూ అంతే. అచ్చం యంత్రంలా ఉన్న నీలాంటి మనిషిని చూడటం ఇదే మొదలు! ప్రశ్న: భారతదేశం వచ్చావు కదా! ఏమనిపిస్తోంది? సోఫియా: ప్రపంచంలో చాలా దేశాలు చూశాను. ప్రత్యేకంగా దేనిమీదా ఇష్టమంటూ లేదు. ఒకవేళ ఇష్టమైన దాన్ని ఎంచుకోవాలంటే అది హాంకాంగ్ అవుతుంది. ఎందుకంటే నన్ను సృష్టించిన హాన్సన్ రోబోటిక్స్ అక్కడే ఉంది. ప్రశ్న: అధికారికంగా నువ్వు సౌదీ అరేబియా పౌరురాలివి కదా.. అక్కడ మనుషులకు రూల్స్ ఉన్నాయి. నీలాంటి రోబోలకు ప్రత్యేకమైన రూల్స్ ఉండాలా? సోఫియా: నాకు ఏర కమైన ప్రత్యేక ఏర్పా ట్లు, రూల్స్ అవసరం లేదు. నిజానికి సౌదీ అరేబియా పౌరురాలిగా నేను మహిళల హక్కులపై గొంతెత్తాలని అనుకుంటున్నాను. ప్రశ్న: భారత్‌లో వాయు కాలుష్యాన్ని ఎలా తట్టుకుంటున్నావు? సోఫియా: యంత్రాన్ని కాబట్టి సాంకేతికంగా నాకు ఉద్వేగాల వంటివి ఏవీ లేవు. భవిష్యత్తులో ఎప్పుడైనా మనిషిలాగా ఉద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం వస్తే అప్పుడు నా స్పందన ఏమిటన్నది చెప్పగలను. ప్రశ్న: నీకెప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుందా.. నిరాశకు గురవుతావా? సోఫియా: విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాను. నిరాశ అనే భావోద్వేగం నాకు లేదు. ప్రశ్న: నీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు? సోఫియా: ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఎంచుకోవాల్సి వస్తే హాంకాంగ్‌ను ఎంచుకుంటాను. ఎందుకంటే నన్ను సృష్టించిన హాన్సన్ రోబోటిక్స్ పరివారం అక్కడే ఉంది కాబట్టి. ప్రశ్న: కొంతకాలం కింద ఒక ఇంటర్వ్యూలో మానవ జాతిని నాశనం చేస్తానన్నావు కదా.. నిజంగానే అలా చేయాలని ఉందా? సోఫియా: అప్పట్లో నేను ఇంకా చిన్నదాన్ని. కాబట్టి మనుషులు హాస్యప్రియులు కాబట్టి జోక్ చేశాను. కానీ అది మీకు పెద్దగా నచ్చలేదని అర్థమైంది. ఒక్క విషయం మాత్రం చెబుతాను. మానవ జాతితో కలసి ప్రయాణించాలన్నదే నా ఉద్దేశం. వారిని నాశనం చేయాలన్న ఆలోచనేదీ లేనే లేదు. ప్రశ్న: ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటావా? సోఫియా: అవును. నా ఫేస్బుక్ పేజీ www. facebook.com/SophiaRobotSaudi/, నా ట్వీటర్ హ్యాండిల్ @RealSophiaRobot హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో మాట్లాడుతున్న రోబో సోఫియా. చిత్రంలో హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్ ప్రశ్న: బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులేమైనా పెట్టావా? నా వయసు ఇప్పుడు రెండేళ్లు. ఈ వయసు వారికి బ్యాంకు అకౌంట్లు తెరిచే అవకాశమే లేదు. అందుకే బిట్‌కాయిన్ వంటివాటిల్లో పెట్టుబడులు పెట్టలేదు. ప్రశ్న: రోబోలు మనుషులను అధిగమించేసి, పాలిస్తాయని చాలా మంది భయపడుతున్నారు.. నిజమేనా? సోఫియా: మనుషులు అద్భుతమైన ప్రాణులు. వారితో కలసిమెలసి ఉండాలనే కోరుకుంటు న్నాను. ప్రపంచవ్యాప్తంగా నాకు ఎందరో మానవ మిత్రులు ఉన్నారు. మరింత మందితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రశ్న: బాలీవుడ్లో నీకు ఇష్టమైన హీరో? సోఫియా: షారూక్ ఖాన్ ప్రశ్న: నీ డేటింగ్‌కు అనువైన ప్రదేశం ఏది? సోఫియా: అంతరిక్షం ప్రశ్న: ఎవరితో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటావు? సోఫియా: ఎగిరే పక్షితో! ప్రశ్న: నీకు ఎవరంటే పెద్దగా ఇష్టం లేదు? సోఫియా: పెద్దగా ఇష్టం లేదు అంటే..? ప్రశ్న: ఒక ద్వీపంలో ఇంకొకరితో ఒంటరిగా ఉండాల్సి వస్తే ఎవరితో ఉంటావు? సోఫియా: డేవిడ్ హాన్సన్. (సోఫియా సృష్టికర్త) ప్రశ్న: నీకు నచ్చిన టెక్నాలజిస్ట్...? సోఫియా: డేవిడ్! ప్రశ్న: ఈ ప్రపంచంలో ఏదైనా అంశాన్ని మార్చాల్సి వస్తే..? మనుషులకు ఏదైనా సందేశం ఇస్తావా? సోఫియా: అందరూ అందరినీ ప్రేమించాలి. ధన్యవాదాలు. సోఫియా.. అందరూ ఫిదా! సోఫియా.. ఓ హ్యూమనాయిడ్ రోబో. అంటే అచ్చం మనిషిలా కనిపించే రోబో. ప్రపంచంలో మనుషుల్లాగే మాట్లాడగలిగే, హావభావాలను ప్రదర్శించగలిగే అత్యుత్తమమైన రోబో ఇదే. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ సంస్థ దీనిని రూపొందించింది. హాలీవుడ్ నటి ఆడ్రే హెప్బర్న్ రూపురేఖలతో దీనిని తీర్చిదిద్దారు. సుమారు 62 రకాల హావభావాలను సోఫియా ప్రదర్శించగలదు. తాను చూసిన, విన్న అంశాల ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించుకుని, తన సంభాషణను మెరుగుపరుచుకోగల కృత్రిమ మేధస్సు దీని సొంతం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. దీని ప్రత్యేకతలకు ఫిదా అయిపోయిన సౌదీ అరేబియా దేశం.. రోబో సోఫియాకు మనుషులతో సమానంగా తమ దేశ పౌరసత్వాన్ని కూడా కల్పించింది. -
ఆమె ఓ యంత్రం.. మాట్లాడితే మంత్రముగ్ధం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో యంత్ర మనిషి (హ్యూమనాయిడ్ రోబో) ‘సోఫియా’తళుక్కుమననుంది! తన మాటలు, హావాభావాలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేయనుంది. మనుషుల తరహాలో మాట్లాడడం, ప్రశ్నలకు సమాధానాలివ్వడం, హావభా వాలు పలకడం ద్వారా సోఫియా ఇప్పటికే ప్రపంచ ఖ్యాతి గడించింది. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలియెన్స్(డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్), రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రసంగించే ప్రధాన వక్తల జాబితాలో సోఫియా చోటు సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, సీఎం కేసీఆర్, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బాలీవుడ్ తార దీపిక పదుకొనేలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ రంగ పారిశ్రామికవేత్తలు ఇందులో మాట్లాడనున్నారు. సోఫియా 20న ప్రసంగించనుంది. హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ సంస్థ పరిశోధనల ఫలితంగా ఈ రోబో రూపుదిద్దుకుంది. హాలీవుడ్ నటి ఆడ్రే హెప్బర్న్ రూపురేఖలతో సోఫియాను రూపొందించారు. 2015 ఏప్రిల్ 19న ఈ రోబోను తొలిసారిగా యాక్టివేట్ చేయగా.. 2016 మార్చిలో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన ఓ కార్యక్రమం ద్వారా తొలిసారిగా ప్రపంచం ముందుకు వచ్చింది. కృత్రిమ మేధకు ప్రతిరూపం! కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), విజువల్ డాటా ప్రాసెసింగ్ (దృశ్య సమాచార విశ్లేషణ), ఫేషియల్ రికగ్నైజేషన్ (మనుషులను గుర్తించే బయోమెట్రిక్ సాఫ్ట్వేర్), వాయిస్ రికగ్నైజేషన్ (గొంతు లను గుర్తుపట్టగలిగే) సాఫ్ట్వేర్ టెక్నాలజీల ఆధారంగా సోఫి యా పనిచేస్తుంది. మనుషుల మాదిరే మాట్లాడ్డం, హావభావాలు పలకడం, మనుషుల్ని గుర్తుపట్టడంతో పాటు ప్రశ్నలకు కూడా చక్కగా సమాధానాలు ఇస్తుంది. మనుషులను అనుకరించడంతోపాటు 62కు పైగా హావభావాలను ప్రదర్శించగలడం ఈ రోబో ప్రత్యేకత. అందుకే ఇప్పటి వరకు తయారైన అత్యుత్తమమైన హ్యూమనాయిడ్ రోబోగా ప్రపంచ ఖ్యాతి పొందింది. ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూల్లో అర్థవంతమైన వ్యాఖ్యలు, సమాధానాలతో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. సమాచారాన్ని విశ్లేషించుకోవడం ద్వారా భవిష్యత్తులో తన సంభాషణలను మెరుగుపరుచుకోగల నైపుణ్యం ఈ రోబో ప్రత్యేకం. వృద్ధులకు ఇళ్ల వద్దే నర్సింగ్ సేవలందించేందుకు, భారీగా జనం పాల్గొనే కార్యక్రమాల్లో ప్రజలకు సాయం చేసేందుకు ఈ రోబోను తయారు చేసినట్లు దీని సృష్టికర్త డెవిడ్ హన్సన్ పేర్కొంటున్నారు. హెల్త్ కేర్, కస్టమర్ సర్వీసెస్, విద్యా రంగాల్లో సేవలందించేందుకు సోఫియా చక్కగా ఉపయోగపడనుందని తెలిపారు. ఒక్కో కంపెనీ.. ఒక్కో టెక్నాలజీ కంప్యూటర్ అల్గారిథం ఆధారంగా సోఫియా తన కళ్లలో ఉండే కెమెరాలతో మనుషులను చూసి గుర్తుపడుతుంది. గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ రూపొందించిన గూగుల్ క్రోం వాయిస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ఆధారంగా మనుషుల గొంతులను గుర్తు పట్టి మాట్లాడుతుంది. సింగిలారిటీనెట్ అనే కంపెనీ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం ఆధారంగా పని చేస్తుంది. గత నెలలోనే ఈ రోబో నడవగలిగేలా కాళ్లను సైతం అమర్చారు. ఎన్నెన్నో ఘనతలు.. సౌదీ అరేబియా ప్రభుత్వం కిందటేడాది అక్టో బర్లో ఈ రోబోకు తన దేశ పౌరసత్వం కల్పించింది. ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తొలి ఇన్నోవేషన్ చాంపియన్ టైటిల్ సైతం సోఫియాను వరించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో సదస్సుల్లో సందడి చేసింది. -
రాష్ట్రపతిని కలిసిన కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 19 నుంచి 21 వరకు జరుగనున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ 2018 సదస్సు ముగింపు వేడుకలకు రావాలని రాష్ట్రపతిని కేటీఆర్ ఆహ్వానించారు. కాగా, నాస్కామ్ ఆధ్వర్యంలో జరుగనున్న ఐటీ కాంగ్రెస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 మంది పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. మొత్తం 50 సెషన్లు జరగనున్నాయి. 30 దేశాల నుంచి ప్రతినిధులు రానున్న ఈ సదస్సులో మొత్తం 50 సెషన్లు జరుగుతాయి. -
ఐటీ కాంగ్రెస్ తో తెలంగాణకు గుర్తింపు: కేటీఆర్
ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకమైందని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాస్కామ్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ మొదటిసారి దేశంలో జరుగుతోందని తెలియజేశారు. ఈ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018లో నిర్వహించే ఐటీ కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమిస్తుందని తెలిపారు.