- తెలంగాణకు కేటాయించిన అధికారుల్లో పలువురు కేంద్ర సర్వీసుల్లో..
- మరికొందరు రిటైర్ అయినవారు.. కాబోయేవారు
- ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంజీ గోపాల్‌ను నియమించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఐఏఎస్‌ల కేటాయింపు ప్రక్రియ పూర్తయినా వారిలో ఏకంగా 20 మంది అధికారులు ఇప్పటికిప్పుడు సేవలందించే అవకాశం లేదు. వీరిలో చాలామంది కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై ఉన్నారు. మరికొందరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. మరికొందరు త్వరలో రిటైర్ కావాల్సిన వారున్నారు. తెలంగాణకు కేటాయించిన 128 మంది ఐఏఎస్ అధికారుల్లో మొదటి యాభై పేర్లలోనే దాదాపు పది మంది సీనియర్ అధికారులు రాష్ట్రంలో పనిచేయడానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
విచిత్రంగా 2005లో కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రపంచ బ్యాంకులో పనిచేయడానికి వెళ్లిన రణదీప్ సుడాన్ (1983 బ్యాచ్) అనే సీనియర్ అధికారిని తెలంగాణకు కేటాయించారు. ఆయన ప్రపంచ బ్యాంకులో పనిచేయడానికి వెళ్లిన గడువు ముగిసిపోయి దాదాపు ఐదేళ్లు గడిచిపోయింది. సెలవులను కూడా పొడిగించుకోలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా ఇవ్వలేదు. తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి. ఈ అధికారి విషయాన్ని సీఎస్ రాజీవ్‌శర్మ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. కేంద్రానికి నివేదించాలని సూచించినట్లు సమాచారం.
సోమవారం ఢిల్లీ వెళ్లిన రాజీవ్ శర్మ అక్కడ సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారని తెలిసింది. కాగా, సీనియర్ అధికారుల్లో ఒకరైన ఎంజీ గోపాల్‌కు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే అధికారుల జాబితాను పరిశీలించిన సీఎం.. వారి పోస్టింగ్‌లపై ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే అధికారులను నేడోరేపో రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం అక్కడి అధికారులను రిలీవ్ చేయగానే వారు ఇక్కడ చేరాల్సి ఉంటుంది.
వీరిలో వచ్చేవారెవరో?: తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లలో ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారిలో బినయ్‌కుమార్, సీబీ వెంకటరమణ, ఆర్.భట్టాచార్య, చిత్రా రామచంద్రన్, పుష్పా సుబ్రమణ్యం, వసుంధరా మిశ్రా, రాజీవ్ రంజన్ మిశ్రా, సుతీర్థ భట్టాచార్య, రజత్ భార్గవ, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, రాణి కుముదిని, అరవిందకుమార్, ఏకే సింఘాల్ ఉన్నారు. పదవీ విరమణ చేసిన వారిలో చందనాఖన్, అరవింద్‌రెడ్డి ఉన్నారు. ఈనెల 31న ఆర్.భట్టాచార్య పదవీ విరమణ చేయనున్నట్లు సమాచారం. కాగా ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న లక్ష్మీపార్థసారథి ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. సస్పెండ్ అయిన వై.శ్రీలక్ష్మిని కూడా తెలంగాణకే కేటాయించారు.
నలుగురికి పదోన్నతులు: 1983 బ్యాచ్‌కు చెందిన ఎస్పీ సింగ్, ఎంజీ గోపాల్, వినోద్ కుమార్ అగర్వాల్, రాజీవ్ ఆర్ ఆచార్యలకు ఒకట్రెండు నెలల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు లభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీటీఆర్‌ఐ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న ఏకే ఫరీదా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
కేటాయింపులపై గెజిట్ నోటిఫికేషన్
అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) ఇటీవల జారీ చేసిన గెజిట్ ఉత్తర్వులను టీ సర్కార్ రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వుల్లో మార్పులు కోరే అధికారులు తమ దరఖాస్తులను సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల ద్వారా పంపించాలని డీవోపీటీ స్పష్టంచేసింది. పరస్పర మార్పిడి, భార్యాభర్తలు, రెండేళ్లలో పదవీ విరమణ చేసే అధికారులు.. కావాల్సిన పోస్టింగ్ కోసం నేరుగా డీవోపీటికి దరఖాస్తులను పంపాలని పేర్కొంది. మరోవైపు ఒకే బ్యాచ్ లేదా పేగ్రేడ్‌లో ఉన్న తమ సహచరుల కోసం అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి తెలంగాణకు రావాలనే అధికారులు ఈ మేర ప్రయత్నాలు చేస్తున్నారు.