సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా యంత్రాంగం భారీ కుదుపునకు గురైంది. ఒకేసారి 50 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృ త్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనా వ్యవహారాలపై దృష్టిపెట్టేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులతో కొత్త జట్టుకు రూపకల్పన చేసుకుంది. ఒకేసారి 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. ఇక బదిలీల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్ కుమార్‌కు కీలకమైన నీటిపారు దల శాఖ వరించింది. కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది.
సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హాను ప్రాధాన్యత లేని పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖకు బదిలీ చేసింది. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌కు కీలకమైన విద్యాశాఖ బాధ్యతలను అప్పగించింది. వికాస్‌రాజ్‌ను మరో కీలకమైన సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ, సీఎం కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలు లభించాయి. పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ డి.రొనాల్డ్ రాస్‌లను ఆర్థిక శాఖ కార్యదర్శులుగా నియమించింది. చాలా జిల్లాలకు కలెక్టర్లుగా యువ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇటీవల ముగిసిన పల్లెప్రగతి తొలి విడత కార్యక్రమంలో సాధించిన ఫలితాలు, త్వరలో అమల్లోకి తేనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిగణనలోకి తీసుకుని సర్కారు జిల్లా కల్లెక్టర్ల బదిలీలు జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment