మంగళవారం రవీంద్ర భారతిలో మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘‘భగవంతుడు నాకు అవకాశమిస్తే త్వరలోనే బసవేశ్వర భవన్‌కు శంకుస్థాపన చేస్తా’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర వీరశైవ లింగాయత్-లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా బసవేశ్వర 882వ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బసవేశ్వర భవన్ కోసం హైదరాబాద్‌లో ఎకరం స్థలం కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
అలాగే హైదరాబాద్‌లోనే ప్రముఖ ప్రదేశంలో రూ. కోటితో బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బసవేశ్వర జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. తానున్నా, పోయినా రాష్ట్రం అభివృద్ధి తీరం చేరేదాక ఆడిపాడాలంటూ ఆదివారం తెలంగాణ కళాకారుల శిక్షణా కార్యక్రమంలో కళాకారులను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ రెండు రోజుల వ్యవధిలోనే మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. కాగా, బసవేశ్వర జయంతి సందర్భంగా సెలవు ప్రకటించాలన్న విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన కేసీఆర్... అన్ని సెలవులను ప్రకటిస్తే పెద్ద ప్రయోజనం ఉండదని, బసవేశ్వరుడు కూడా దీనిని క్షమించడని పేర్కొనగా సభలో నవ్వులు విరిశాయి.
లింగాయత్‌లను బీసీలలో చేర్చాలి...
రాష్ట్రంలోని లింగాయత్‌లను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చే బాధ్యతను తీసుకోవాలని ఈ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు కేసీఆర్ సూచించారు. ఈ విషయమై రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపాలని దత్తాత్రేయ సూచించగా, అటువంటిదేమీ అవసరం లేదని, దీనికోసం వినతి పత్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో మే 1కల్లా దత్తన్నను తమ పార్టీ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు కలుస్తారని కేసీఆర్ అన్నారు.
తెలుగులో ఆదికవి సోమనాథుడే...
తెలుగు భాషలో ఆదికవి నన్నయ కాదని ముమ్మాటికి పాల్కురికి సోమనాథుడేనని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని తాను చెబితే ఆంధ్రోళ్లకు కోపం వస్తుందని, కాని ఇది కఠోర వాస్తవమని నవ్వుతూ అన్నారు. అశోక్ ముస్తాపూర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆదిలాబాద్‌కు చెందిన కేంద్ర జలవనరుల శాఖలో సంయుక్తకార్యదర్శిగా పనిచేస్తున్న బి.రాజేందర్‌కు బసవేశ్వర జీవనసాఫల్య పురస్కారాన్ని కేసీఆర్ చేతుల మీదుగా అందించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, టి.హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్ పాల్గొన్నారు.