బెంగళూరు: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేతలు గెలుపు కోసం హామీలు గుప్పించడంతో పాటు ప్రత్యర్థులపై మాటల దాడిని పెంచుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో కులాలు కీలక పాత్రను పోషించనున్నాయి. సామాజిక వర్గాల వారిగా చూస్తే.. 55% ఓబీసీలు, 17% ఎస్సీలు, 7% ఎస్టీలు, 11% ముస్లింలు, 3.5% అగ్రవర్ణాలు, 2% క్రిస్టియన్లు ఉన్నారు.
కీలక పాత్ర వారిదే
ఈ ఎన్నికల్లో లింగాయత్‌ల పాత్ర కీలకమైంది. జనాభాలో 15.3 శాతంతో వీరు 50 ఉపకులాలుగా ఉన్నారు. లింగాయత్‌లలోనూ వారివారి ఉపకులాల వర్గాలను బట్టి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలో రిజర్వేషన్లున్నాయి. అయితే వీరిలో పంచమశాలి లింగాయత్‌లు అధికంగా ఉంటారు. తర్వాత స్థానం వీరశైవ లింగాయత్, గానిగ్ లింగాయత్, సాదర్ లింగాయత్‌లది. ఈ వర్గాల ప్రభావం 70కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలపై ఉంటుంది. బీజేపీకి మొదటి నుండి మద్దతుగా ఉంటున్న లింగాయత్‌లు మాజీ ముఖ్యమంత్రి యడియురప్ప కారణంగా ఇప్పటికీ ఆ పార్టీకే మద్దతుగా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ అంచనాలను పరిశీలిస్తే లింగాయత్ అభ్యర్థుల ఎంపిక ఆధారంగా పార్టీలు గెలుపు ఓటములు ఆధారపడనున్నాయి. దీంతో పార్టీలు లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
రెండో పెద్ద వర్గం విషయానికొస్తే.. వొక్కలింగాలు అని చెప్పాలి. వీరు జనాభాలో 11శాతం ఉండి, 44కు పైగా నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన దేవగౌడ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కారణంగా ఆయన కుటుంబం ప్రభావం ఈ సామాజిక ఓటర్లపై అధికంగా ఉండనుంది. హస్తం పార్టీకి ఇక్కడ కలిసొచ్చే అంశం ఏమనగా.. ఈ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు కాంగ్రెస్‌లో ఉన్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో వారి ఓటు బ్యాంకు దోహదపడే అవకాశం ఉంది. ప్రస్తుతం వొక్కలింగాలు ప్రధానంగా జెడీ (ఎస్)కు మద్దతుగా ఉంటున్నారు, తర్వాత కాంగ్రెస్ పక్షాన నిలుస్తున్నారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా కర్ణాటకలో 17.15% మంది ఎస్సీలున్నారు. ఎస్సీ వర్గాలలో ప్రధానంగా ఆది కర్ణాటక (25.7%), మాదిగ (15.2%), బంజారా (11.6%), బోవి (11.2%), హోలయా (7.5%), ఆది ద్రావిడ (7.2%), భాంబి (6.6%) ఉపకులాల వారున్నారు. ఎస్సీలలో వారి వారి సంప్రదాయాల ఆధారంగా ఎస్సీ లెఫ్ట్, ఎస్సీ రైట్ వర్గాలున్నాయి. ఓటింగ్ సమయంలో ఈ విభజన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్సీ లెఫ్ట్ (మాదిగలు) కాంగ్రెస్‌పై కొంత అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ప్రభావంతో ఎస్సీ రైట్ వర్గం ఆ పార్టీ పక్షాన నిలుస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఎస్సీ లెఫ్ట్ బీజేపీకి, ఎస్సీ రైట్ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు
కోస్తా కర్ణాటక రూటే సెపరేటు
కోస్తా కర్ణాటక ప్రాంతంలో సామాజిక ప్రభావం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఓబీసీలలో ఈదిగా, మొఘవీర, బంట్స్ (షెట్టి), తులుస్, బెల్లావాస్ వర్గాల ఆధిపత్యం ఉంది. వీరితో పాటు ముస్లింలు కూడా అధికంగానే ఉన్నారు. మంగళూరు సమీపంలో క్రిస్టియన్ల ప్రభావం కూడా ఉందనే చెప్పాలి. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో బ్రాహ్మణుల ఆధిపత్యం కనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషిస్తే.. ముస్లింలు, క్రిస్టియన్లు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపగా, బ్రాహ్మణులు బీజేపీ పక్షాన ఉన్నారు. విశ్వకర్మ, ఉపార, జైన్, క్షత్రియ, బలిజ, హడ్పాడా సామాజిక వర్గాల ఓట్లు రెండు ప్రధానపక్షాలకూ పడనున్నాయి. బాంబే కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలోని కొన్ని భాగాలలో ఉండే మరాఠాల మద్దతు చాలావరకు బీజేపీకి ఉండగా, కాంగ్రెస్‌లో బలమైన నేతలున్న చోట ఆ పార్టీకి అనుకూలంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment