బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికల సమరం మొదలైంది. గెలుపు కోసం రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరో సారి రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ సారి సీఎం పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నేతలు పరస్పర మాటల యుద్ధానికి తెరలేపారు. దీంతో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో అధికారం చేజిక్కుంచుకోవాలంటే 113 స్థానాలు గెలవాల్సి ఉంది. అయతే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఇటీవల ‘పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సర్వే ఏం చెబుతోంది
‘ప్రాబబులిటీ ప్రొఫెషనల్ మెథడాలజీ’ (పీపీఎస్) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 20 శాంపిల్స్ తీసుకున్నారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, స్త్రీలు, పేద`సంపన్నులు ఇలా తగు నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 5600 శాంపిల్స్ సేకరించారు.
సర్వేలో వెల్లడైన అంశాల్ని గమనిస్తే.. ఈ సారి పార్టీల మధ్య హోరాహోరి పోరు తప్పదని వెల్లడైంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పాలక బీజేపీపై కొంతమేర పైచేయి సాధిస్తుందని స్పష్టమవుతోంది. ఇక్కడో గమనించాల్సిన విషయం ఏంటంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీకి మెజార్టీ తెచ్చిపెడుతుందని ప్రచారం జరిగినా, అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రాహుల్ భారత జోడో యాత్ర ప్రభావం, ఇదే రాష్ట్రం నుంచి మల్లికార్జున్ ఖర్గేను పార్టీ అఖిల భారత అధ్యక్షుడుగా చేసిన పరిణామ ప్రభావం.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల శ్రేణులు ఆశించిన స్థాయిలో ప్రజాక్షేత్రంలో లేదని పేర్కొంది. ఈ సారి రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ మెజారిటీ సీట్లు అందించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వేలో బయటపడింది.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో కొంత మొగ్గు ఈ సర్వేలో కనిపించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 95-105 స్థానాలు వస్తాయని తేలింది. ఇక అధికార బీజేపీకి 90-100 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వేలో వెల్లడయిన అంశాలను బట్టి చూస్తే రాష్ట్రంలో హోరాహోరీ పోటీ తప్పదనిపిస్తోంది. హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తుండడంతో జేడీ (ఎస్) మరోమారు కీలకపాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఈ పార్టీ 25-30 సీట్లు గెలవవచ్చు. ఈ పరిణామాలను గమనిస్తే మరోమారు 2018లో వచ్చినట్టు హంగ్ ఫలితాలు పునరావృత్తమవడం ఖాయంగా కనిపిస్తోంది.
గాలి జనార్థన్ నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన కేఆర్‌పీపీ పార్టీకి పెద్దగా ప్రభావం చూపే అవకాశాల లేవని.. ఎస్‌డీపీఐ, ఏఐఎంఐఎం పార్టీలకు ఒక్క సీటు కూడా వచ్చేలా లేదని సర్వేలో బయటపడింది. ఆప్ పార్టీ ప్రభావం స్వలంగా ఉన్నా నిర్దిష్టంగా సీట్లు లభించే అవకాశం లేదు. మరోవైపు ఈ సర్వేలో సుమారు నాలుగు శాతం మంది రాబోయే ప్రభుత్వం గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడిపరచలేదు. మే 10న జరగనున్న ఎన్నికల్లో ఈ తటస్థుల పాత్ర కీలకం కాబోతుంది. మొత్తానికి ఈ సర్వే ద్వారా కర్ణాటకలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సర్వే ప్రకారం ఈ ఫలితాలు పునరావృత్తమైతే రాజకీయ పార్టీలకు భారీ షాక్ అనే చెప్పాలి.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 2018 ఎన్నికలతో పోలిస్తే 2018లో 38.14 శాతం ఓట్లు పొందిన హస్తం పార్టీ ఈ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు సాధిస్తుంది. తద్వారా మునుపటి ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 18 సీట్లను అధికంగా కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. అధికార బీజేపీకి మాత్రం ఓట్ల శాతం స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. 2018లో 36.35 శాతం సాధించిన బీజేపీ ఇప్పుడు 36 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన జేడీ (ఎస్) 16 శాతం ఓట్లను పొందనుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 10 సీట్లు కోల్పోయి, ఈ సారి 27 సీట్లు పొందే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment