భయం వీడితే విజయం ‘పది’లమే.. | if leave the afraid will get victory | Sakshi
Sakshi News home page

భయం వీడితే విజయం ‘పది’లమే..

Published Fri, Mar 21 2014 2:57 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

if leave the afraid will get victory

 ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఎస్సెస్సీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థుల్లో ‘టెన్’షన్ మొదలైంది. ఆందోళన అనేది సహజమే. కానీ, ఆందోళన వీడితే విజయం మనదే అనే విషయాన్ని మరిచిపోవద్దు. ఉన్నత విద్యకు పదో తరగతి తొలి మెట్టయితే, ఉన్నత ఉద్యోగాలకు ఆ మార్కులే కీలకం. ఈ పరీక్షల్లో నెగ్గడం నిజంగా విద్యార్థులకు పరీక్షే. ఇందుకు కష్టంగా కాదు ఇష్టంగా చదువుతూనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈనెల 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అంటే ఇంకా ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం మీ సొంతమవుతుంది.

 పరీక్ష నిర్వహణకు
 పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 178 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 39,449 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 160, ప్రైవేటు విద్యార్థులు కోసం 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,342 మంది ప్రైవేటు విద్యార్థులు, 35,117 రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్ష నిర్వాహణ కోసం 178 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 178 డిపార్ట్‌మెంటల్ అధికారులు, 39 కస్టోడియన్‌లు, పది మంది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు.  

 బట్టి చదువులకు స్వస్తి పలకండి
 ఎన్నిసార్లు చదివినా గుర్తుండటం లేదనే బెంగ అసలే వద్దు. చదివి ఒక్కసారి చూస్తే అందులో లోపాలు తెలుస్తాయి. మననం చేయడం ద్వారా గుర్తుంటుంది. అంతేగాని చదివిన ప్రతి అంశంపై పట్టు సాధించాలని బట్టి విధానానికి పాల్పడద్దు. మనసు పెట్టి ఇష్టంగా చదివితే  లక్ష్యం సులువవుతుంది.
 గ్రూప్ డిస్కషన్స్ మేలు..
 మరో వారం రోజుల్లో పరీక్షలు ఉన్న నేపథ్యంలో మెలకువలు పాటిస్తూ జవాబులు రాయడంలో సృజనాత్మకంగా వ్యవహరించాలి. సమూహ చదువులు, గ్రూప్ డిస్కషన్స్ ద్వారా తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. పునశ్చరణలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

 అక్షర దోశాలు లేకుండా..
 చేతిరాత మెరుగు పర్చుకుని సమాధానాలు సులువుగా అర్థమయ్యేలా రాయాలి. అక్షర దోశాలు లేకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే మార్కులు తగ్గే అవకాశం ఉంది. పునఃశ్చరణ తరగతుల నిర్వాహణ, ప్రతి జవాబును పలుమార్లు రాయడం, మ్యాప్ పాయింటింగ్‌ను గుర్తించడం మేలు.

 ఒత్తిడికి లోనుకావద్దు..
     ఏకధాటిగా చదవకూడదు. ప్రతి 45 నిమిషాలకోసారి విశ్రాంతి తీసుకోవాలి.
     చదువుకునే గదిని శుభ్రంగా ఉంచుకోవాలి.
     వీలైనంత వరకు ఉదయం పూట మాత్రమే ఎక్కువ చదవాలి.
     ఒత్తిడికి లోనుకావద్దు. ఒత్తిడితో చదివితే సమతుల్యత లోపిస్తుంది.

 ఆహార పరంగా..
     పరీక్షలు ముగిసే వరకు చిరుతిండికి దూరంగా ఉండాలి.
     ముఖ్యంగా బయట తోపుడు బండ్లపై చేసే వంటకాలు తీసుకోవద్దు.
     అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, అలవాట్లకు దూరంగా ఉండాలి.

 ఆరోగ్యం విషయంలో..
     టమాట, బీట్‌రూట్, క్యారెట్, జ్యూస్ తాగాలి. మొలకెత్తిన విత్తనాలు తినాలి. పండ్లు తీసుకోవడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
     రోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. టెన్షన్‌కు లోనుకాకుండా క్రమపద్ధతిలో చదవాలి. పరీక్షలు పూర్తయ్యే వరకు టీవీలు, చాటింగ్, సినిమాలు, షికార్లు వదులుకోవాలి.

     ఎండలో ఎక్కువ సమయం తిరగొద్దు.
     నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు అధికంగా తీసుకోవాలి.

 తల్లిదండ్రులకు సూచనలు..
     పరీక్షలు అయ్యేవరకు పిల్లలను పెళ్లిళ్లు, శుభకార్యాలయాలకు తీసుకెళ్లవద్దు.
     పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలను మందలించవద్దు. ఇతర పిల్లలతో పోల్చి తక్కువ చేయొద్దు. మార్కులు ఎక్కువ రావాలని ఒత్తిడి తేవొద్దు.     తల్లిదండ్రులు గొడవ పడవద్దు.

     పిల్లలు చదువుకునేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలి. పిల్లల్ని ప్రోత్సహించాలి.


 ఎస్సెస్సీ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి
 పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్‌లను అందబాటులో ఉం చినట్లు డీఈవో రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. జిల్లా, పాఠశాల, విద్యార్థి పేరు నమోదు చేసి ఆన్‌లైన్ నుంచి హాల్‌టిక్కెట్ పొందవచ్చన్నారు. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్‌లు ఈ హాల్ టిక్కెట్‌లను అనుమతించాలన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement