పేదింటికి పట్టాభిషేకం చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారుచేయడంతో పట్టాల రూపకల్పనలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పంపిణీకి ఐదు రోజులే మిగిలి ఉండడంతో రెవెన్యూ అధికారులు.. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపుగా అర్హుల జాబితా సిద్ధమైనప్పటికీ, కుత్బుల్లాపూర్ మండలంలో మరికొన్ని దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. రాష్ట్రంలోనే దాదాపు 30శాతం దరఖాస్తులు ఇక్కడి నుంచి రావడంతో.. పరిశీలన ప్రక్రియ ఆలస్యమైంది. పట్టాల పంపిణీకి ప్రభుత్వం తేదీని ఖరారు చేయడంతో బుధవారం జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ కుత్బుల్లాపూర్‌లోనే మకాంవేసి దరఖాస్తుల పరిశీలన తీరును స్వయంగా సమీక్షించారు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా ఉచిత కేటగిరీ (58 జీఓ)కింద దాదాపు 68వేల మందికి పట్టాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ కేటగిరీలో స్థలాలను క్రమబద్ధీకరించాలని 1.43 లక్షల అర్జీలు రాగా, వీటిలో అభ్యంతరకర స్థలాలుగా గుర్తించిన 43వేల దరఖాస్తులను తోసిపుచ్చారు. మిగతావాటి విషయంలో ఉదారంగా వ్యవహరించిన ప్రభుత్వం.. శిఖం మినహా మిగతా అన్నింటికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వివిధ సర్కారీ సంస్థలకు బదలాయించిన స్థలాల్లో వెలిసిన నిర్మాణాలకు కూడా ఆమోదముద్ర వే సింది. ఇప్పటివరకు 58,667 పట్టాలను సిద్ధంచేసిన రెవెన్యూ అధికారులు.. తాజాగా మరో 8 వేల మందిని అర్హులుగా గుర్తించారు.
అధికారుల తప్పిదం వల్ల తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి వడపోసిన యంత్రాంగం.. దీంట్లో 8 వేల అర్జీలు క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా తేల్చారు. అలాగే వివిధ సంస్థలకు కట్టబెట్టిన భూముల్లో నివసిస్తున్న దాదాపు మూడు వేల ఇళ్లకు పచ్చజెండా ఊపారు. రాష్ట్రస్థాయిలో దీనిపై ఆయా శాఖల ఉన్నతాధికారుల సమ్మతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, దీనిపై అధికారికంగా జిల్లా యంత్రాంగానికి ఇంకా సమాచారం అందలేదు. ఇదిలావుండగా, జీఓ 58 కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఆర్థిక స్థితిగతులు, సదరు అర్జీదారు జీవనశైలిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు 2,195 దరఖాస్తులను చెల్లింపు కేటగిరీలోకి మార్చారు. కొన్నింటిని అధికారులే ఈ జీఓ పరిధిలోకి తేగా.. అధికశాతం అర్జీదారుల అభిప్రాయాలనే ప్రామాణికంగా తీసుకున్నారు.
ఆవిర్భావ వేళ..
జూన్ 2వతేదీ నాటికీ అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తవుతుం డడం, అదే రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే లక్షలాది మందికి ఒకే రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. మరీముఖ్యంగా త్వరలో హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు ఉన్నందున.. ఈ కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఈ తరుణంలో గ్రేట ర్‌లో పాగా వేసేందుకు ఆవతరణ దినోత్సవం కలిసివస్తుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే నగర శివార్లలోని 68వేల మందికి ఏకకాలంలో పట్టాలు పంపిణీచేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇదిలాఉండగా, పట్టాల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారుచేసినప్పటికీ, ఆ రోజున ఎంతమందికి పట్టాలు ఇవ్వాలనే అంశంపై మార్గదర్శకాలు రాలేదని కలెక్టర్ రఘునందన్‌రావు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.
ఆవిర్భావ వేళ.. పట్టాల మేళా!
Published Thu, May 28 2015 12:39 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement