ఆ ఉత్తర్వులను పట్టించుకోకండి
-
ఏపీ ఉద్యోగులకు సీఎస్ సూచన
సాక్షి, హైదరాబాద్: ఈనెల 19న నిర్వహించనున్న సమగ్ర సర్వేలో విధులు నిర్వర్తించాలంటూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ఉత్తర్వులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు చెప్పారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం సీఎస్‌ను కలిసింది. ఏపీ ఉద్యోగులకు వచ్చిన ఉత్తర్వులను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగుల జాబితా ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వులను ఇచ్చిందని వివరించింది. దీనికి కృష్ణారావు స్పందిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. ఇదే విధంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ సచివాలయ ఉద్యోగల సంఘం సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. ఆ ఉత్తర్వులను పట్టించుకోవద్దని సీఎస్ వారికి కూడా సూచించారు.
డ్యూటీ వేయడానికి మీరెవరు? : ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ నెల 19న జరిగే ఇంటింటి సర్వేలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిబ్బందికి విధులు అప్పగించమేమిటని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రశ్నించారు. ఇంటింటి సర్వే కోసం తమ ఉద్యోగులకు డ్యూటీ వేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ఆదేశాలివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పలు విభాగాలకు చెందిన ఉద్యోగులకు సోమేష్‌కుమార్ డ్యూటీలు వేశారని చెప్పారు. ఈ విషయమై అడగటానికి వెళ్లిన ఏపీ ఉద్యోగులపై సోమేష్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇది సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఆ డ్యూటీ ఉత్తర్వులను పట్టించుకోవద్దన్నారని తెలిపారు.