పసికందుల విక్రయాల గుట్టురట్టు
► వైద్యుడి ముసుగులో అక్రమ వ్యాపారం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం కేంద్రంగా పసికందుల విక్రయాల వ్యాపారం గుట్టు రట్టయింది. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్, బీఏఎంఎస్ పూర్తిచేసి మహబూబాబాద్ జిల్లా కురవిలో 20 సంవత్సరాల క్రితం శ్వేత నర్సింగ్‌హోం ప్రారంభించాడు. సంతాన లేమితో తన వద్దకు వచ్చిన వారికి మాయమాటలు చెప్పి, పసికందులను విక్రయిస్తున్నాడు. ఇది యథేచ్ఛగా సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇతడి ‘వ్యాపారం’ విస్తరించింది. ఖమ్మంలో ఓ పసికందును విక్రయించడంతో బయటకు పొక్కింది. పోలీసుల దృష్టికి వెళ్లింది.
బయటపడిందిలా...
ఖమ్మం నగరంలోని జయనగర్ కాలనీకి చెందిన గుంటూరు భానుప్రసాద్, రాణి దంపతులకు 20 ఏళ్ళుగా సంతానం కలగడంలేదు. గతంలో కురవి ప్రాంతంలో భానుప్రసాద్ పనిచేసిన సమయంలో వైద్యుడు శ్రీనివాస్‌తో పరిచయమేర్పడింది. పిల్లలు లేకపోవడంతో నేరేడు తండాకు చెందిన మహిళకు జన్మించిన పాపను కొనుగోలు చేశారు. ఇందుకుగాను డెలివరీ ఖర్చుల పేరుతో రూ.50 వేలు ఇచ్చినట్టు తెలిసింది. ఆ పాపను భానుప్రసాద్ ఇటీవల తన ఇంటికి తీసుకొచ్చి పెంచుకోసాగాడు. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
అర్బన్ సీఐ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాము దర్యాప్తు చేపట్టారు. కురవికి చెందిన వైద్యుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్ ఇప్పటివరకు ఏడుగురు పిల్లలను విక్రయించినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. లింగ నిర్థారణ పరీక్షలు చేస్తున్నారన్న కారణంతో కురవిలోగల ఇతడికి చెందిన శ్వేత నర్సింగ్ హోమ్‌ను అధికారులు ఇటీవల సీజ్ చేశారు. శ్రీనివాస్‌ను అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.