ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రస్తుత(2017–19) ఆబ్కారీ సీజన్ కొద్ది రోజుల్లో ముగియనుంది. అయితే, ఇంకా కొత్త పాలసీపై ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. దీంతో ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాలో వైన్స్ నడుపుతున్న వ్యాపారులు కొందరు ఆఖరి మోఖాగా ధరలు పెంచేశారు. ఇంతకాలం ఎవరికి వారుగా ఉన్న వ్యాపారులు ఇప్పుడు ‘సిండికేట్’గా ఏర్పడి ఒక్కో విస్కీ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు... బీరు బాటిల్‌పై రూ.10 నుంచి రూ.15 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. మాకేం కాదు.. అన్నట్లుగా ధరల పెంచేయడంతో పాటు అర్ధరాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు నిర్వహిస్తున్నా ఆబ్కారీ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.
ఇంతకాలం దూరం
తొలినాళ్లలో ఏసీబీ దాడుల కారణంగా ఎక్సైజ్ అధికా>రులు, మద్యం సిండికేట్ల డొంక కదిలింది. దీంతో చాలాకాలం సిండకేట్ మాటెత్తలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ గడువు సమీపిస్తుండడంతో ‘ఇగ అయ్యేదేముంది.. పోతే దుకాణం, వస్తే డబ్బులు’ అన్న రీతిలో కొందరు వ్యాపారులు తెగబడి అధిక ధరలకు మద్యం విక్రయాలు చేస్తున్నారు. నెల రోజులుగా ఈ దందా సాగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ) నిబంధనలను విస్మరించి ధరలు పెంచడంతో మొదటి పెగ్గు పుచ్చుకోక ముందే మద్యపాన ప్రియులకు ధరలు కిక్కెక్కుతోంది. ధరల పెంపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల్లో సుమారు రూ.15 కోట్లకు పైగా అదనంగా వసూలు చేసినట్లు ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు ఎక్కువ ధరలపై విక్రయిస్తూ అధిక ధరలను ప్రోత్సహిస్తున్నారు.
పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్, కాళేశ్వరం, ములుగు, గోవిందరావుపేట, వెంకటపురం(కే), ఏటూరు నాగారం, తాడ్వాయి, జనగామ, బచ్చన్నపేట, తరిగొప్పుల, రఘునాథపల్లి, కొడకండ్ల, తొర్రూరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ తదితర ప్రాంతాల్లో అధిక ధరలపై మద్యం విక్రయిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈ దందా సాగుతున్నా ఆబ్కారీశాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కొన్నిచోట్ల వైన్స్ నిర్వాహకులు మద్యం దుకాణాలను ముందు ఎమ్మార్పీ పట్టిక ప్రదర్శిస్తూ... గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు తరలించే క్రమంలో 20 శాతం అధిక ధరలు వసూలు చేస్తున్నారు. బెల్టుషాపులను తాత్కాలికంగా అరికట్టినా... ‘సిండికేట్’ దందాకు మాత్రం తెరపడటం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో అక్రమ వ్యాపారాన్ని తాజా మాజీ సిండికేట్లు చాపకింది నీరులా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
మద్యం దుకాణాల వద్ద లూజ్ అమ్మకాలు చేయకూడదన్న నిబంధన కూడా ఉల్లంఘనకు గురవుతోంది. ఎలాంటి అనుమతి లేకుండానే పర్మిట్ రూంలు ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయంచిన సమయాన్ని కూడా చాలా మంది పాటించకపోవడం గమనార్హం. ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యాపారులు వీటిని కప్పి పుచ్చుకునేందుకు మామూళ్లు ముట్టజెబుతుండగా... అధికారులు చూసీచూడనట్లు ఊరుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నెలవారీ మామూళ్లు అందజేయాల్సిందేనని ఎక్పైజ్ జిల్లాలో పట్టుబడుతుండటంతో వ్యాపారులు అక్రమాలకు తెగబడుతున్నారు. ప్రతీ దుకాణం ముందు ఖచ్చితంగా ధరల పట్టికను సూచించే బోర్డు ఏర్పాటుచేయాలని, ఎలక్ట్రానిక్ బిల్లు ఇవ్వాలనే నిబంధనలు పాలసీలో ఉన్నా ఎవరూ పాటించడం లేదు. తమ పరిధిలో ఎక్కడా బెల్ట్ దుకాణాలు లేవని, అక్రమ మద్యం అమ్మకాలు జరగట్లేదని పేర్కొంటూ ప్రతీ ఎస్‌హెచ్‌ఓ కూడా అఫిడవిట్‌లాగా సమర్పించాలన్న ఆదేశాలను ఎక్సైజ్ అధికారులే అమలు చేయడం లేదు.
ఇవి కాకుండా ప్రతీ దుకాణం ముందు గ్రిల్స్ ఏర్పాటు చేయాలని నిబంధనను ఒకటి రెండు చోట్ల తప్ప ఎవరూ పాటించడం లేదు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రం, పట్టణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల యజమానులు దాబాలు, హోటళ్లను ఆసరాగా చేసుకుని బెల్టు దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కోల్‌బెల్ట్, తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో ముఠాలుగా ఏర్పడిన నిందితులు ఇథైల్ అల్కహాల్‌కు ‘క్యారమిల్’ అనే రసాయన పదార్థాన్ని కలిపి అనుమానం రాకుండా తయారు చేసిన నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాసన, రంగు అసలైన మద్యం మాదిరే ఉండగా.. కిక్కు కాస్త ఎక్కువే ఇస్తుండడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని సమాచారం.
జిల్లా | వైన్స్ | బార్లు | ఎలైట్ బార్లు |
వరంగల్ అర్బన్ | 59 | 88 | 11 |
వరంగల్ రూరల్ | 58 | 03 | 04 |
జనగామ | 42 | 03 | 01 |
భూపాలపల్లి | 28 | 03 | 0 |
ములుగు | 27 | 0 | 0 |
మహబూబాబాద్ | 51 | 03 | 01 |
మొత్తం | 265 | 100 | 17 |
ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు
మద్యం షాపుల్లో ఎమ్మార్పీ కంటే అధి క ధరలతో విక్రయిస్తే ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తాం. ప్రొహిబిహిషన్, ఎక్సైజ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించి నా ఉపేక్షించేది లేదు. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు బాధ్యులకు జరిమానా విధించడంతో పాటు షాపులను తాత్కలికంగా మూసివేస్తాం.
– బాలస్వామి, ఎక్సైజ్ సూపరింటెండెంట్, వరంగల్ అర్బన్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment