గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా ...
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. పట్టణాలు, పల్లెల నుంచి సిలిండర్లు నల్లబజారుకు తరలుతున్నాయి. గృహావసరాలకు ఉపయోగించే రాయితీ సిలిండర్లను వ్యాపారం కోసం వినియోగిస్తున్నారు. పట్టణాల్లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తదితరాల్లో గృహావసారాలకు వినియోగించే సిలిండర్లను వాడుతున్నారు. అధికారులు తనిఖీలు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకుంటున్నా అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు. కేసులు నమోదు చేయాల్సిన పౌర సరఫరాల
అధికారులు మామూలుగా తీసుకుంటున్నారు.
688 సిలిండర్లు.. 374 కేసులు..
జిల్లాలో అధికారులు 2010 నుంచి ఐదేళ్లుగా పలుమార్లు దాడులు నిర్వహించి 688 గృహావసర సిలిండర్లు స్వాధీనం చేసుకున్నా రు. అక్రమంగా గ్యాస్ వినియోగిస్తున్న 374 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 5న ఆదిలాబాద్, నిర్మల్‌లలో దాడులు నిర్వహించి 45 గృహావసర సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 21 కేసులు నమోదు చేశారు. వినియోగదారుడికి ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు రాయితీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల అండతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి.
‘ఆధార్’తో ఆగని దందా
జిల్లాలో ప్రస్తుతం 3,30,747 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు సుమారుగా 1,29,600 ఉన్నాయి. ఒక్కో వినియోగదారునికి ఏడాదికి పన్నెండు రాయితీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలి. గతేడాది ఇదే మాసంలో గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాను అనుసంధానం చేశారు. దీంతో కొన్ని అక్రమ కనెక్షన్లు బయటపడ్డాయి. రాయితీ సొమ్మును ప్రభుత్వం నేరుగా వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఆ సమయంలో అర్హులై ఉన్న గ్యాస్ తీసుకునేందుకు వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఆధార్ వల్ల రాయితీ గ్యాస్ సిలిం డర్ల అక్రమ వ్యాపారం అరికట్టవచ్చునని ప్రభుత్వ భావించినా.. దానిలోని లోపాలను వెతికి అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు.
ఈ విషయంలో అప్పట్లో ప్రభుత్వంపై పలు విమర్శలకు దారితీసింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం గ్యాస్‌కు ఆధార్ లింకును తీసేయడంతో మళ్లీ మొదటికొచ్చింది. దీన్ని ఆసరగా చేసుకుంటున్న అక్రమార్కులు అక్ర మ గ్యాస్ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2013 జూలై నెలలో జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఖాతా, ఆధార్ నం బర్ అనుసంధానం చేయడం వల్ల సుమారు 75 వేలకుపైగా బోగస్ గ్యాస్ కనెక్షన్లు గుర్తించబడ్డాయి. ఇందులో దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీపం కనెక్షన్ కింద మంజూరు చేయబడిన వారు గృహావసరాలకు వినియోగించకుండా వేరే వ్యక్తులకు అమ్ముకున్నారు. దీనికితోడు ఒకరి పేరు మీదా గ్యాస్ కనెక్షన్ మంజూరైతే మరోకరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దీంతో ఆ గ్యాస్ కనెక్షన్లు బోగస్ కింద గుర్తించి తొలగించారు.