విజయ డెయిరీలో అక్రమాల వెల్లువ  | Illegal in vijaya dairy | Sakshi
Sakshi News home page

విజయ డెయిరీలో అక్రమాల వెల్లువ 

Published Sat, Mar 16 2019 3:42 AM | Last Updated on Sat, Mar 16 2019 3:42 AM

Illegal in vijaya dairy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలు విక్రయించగా వచ్చే మొత్తాన్ని విజయ డెయిరీ అధికారులే మాయం చేశారు. గత రెండేళ్లుగా వరంగల్‌ జిల్లాలో రూ.46 లక్షలు, నిజామాబాద్‌ జిల్లాలో రూ.26 లక్షలు స్వాహా చేసినట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. నల్లగొండ జిల్లా ఇందుగులలోని విజయ బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్‌ ప్లాంట్‌ను ఓ ప్రైవేటు వ్యక్తి మిర్యాలగూడకు తరలించుకుపోయారు. రైతుల నుంచి పాలు కొనకుండా అతనే పాలు సరఫరా చేస్తూ బోగస్‌ పేర్లతో బిల్లులను నొక్కేసినట్లు గుర్తించారు. రెండున్నరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపించడానికి జిల్లా అధికారులు అతనికి సహకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.  

ఎలా బయటపడిందంటే... 
జిల్లాల్లో ఎన్ని పాలు విక్రయిస్తున్నాం... వాటిపై ఎంత ఆదాయం వస్తుందనే అంశంపై అన్ని జిల్లాల అకౌంటింగ్‌ అధికారులతో డెయిరీ ఎండీ శ్రీనివాసరావు ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల్లో అకౌంట్లలో తేడాలున్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేయించారు. రెండు జిల్లాల్లో రూ.72 లక్షల మేర డెయిరీకి రావాల్సిన సొమ్మును స్థానిక అధికారులు జేబుల్లో వేసుకున్నట్లు గుర్తించారు. నల్లగొండ జిల్లాలో స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురు అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించారు. ప్లాంటును తరలించడంతోపాటు, బోగస్‌ పేర్లతో పాలు సరఫరా చేస్తూ బిల్లులను నొక్కేస్తున్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.

మిర్యాలగూడలో ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉన్న 2 వేల లీటర్లు, 3 వేల లీటర్లు, ఐదు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డెయిరీ మిషనరీని స్వాధీనం చేసుకునేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడి నుంచి వచ్చే పాలను గురువారం నుంచి నిలిపివేశారు. సదరు వ్యక్తికి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయనున్నారు. ఇందుగులలో ప్లాంట్‌ తరలింపు సమయంలో డీడీగా పనిచేసిన అధికారిని, పాల సొమ్ము స్వాహా చేసిన రెండు జిల్లాల డీడీలను, ఇద్దరు మార్కెటింగ్‌ సూపరింటెండెంట్లను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సంస్థ ఎండీ శ్రీనివాసరావు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటు విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో అకౌంట్‌ విభాగంలోని డీడీ, నల్లగొండ జిల్లాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న డీడీలపై బదిలీ వేటు పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement