
నా కోసమే మరణిస్తున్నా..
- నగరంలో యువతి ఆత్మహత్య
- ఎవరిపైనా కోపం లేదని సూసైడ్ నోట్..
నిజామాబాద్: ‘‘ఎవరిపైనా కోపం లేదు.. నా కోసమే మరణిస్తున్నా’’ అని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం నగరంలోని మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల ఎర్రకుంట కాలనీలో చోటు చేసుకుంది. మూడో టౌన్ ఎస్సై వెంకట్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎర్రకుంట కాలనీకి చెందిన సిరిసిల్ల అరుణ అశోక్‌లకు ముగ్గురు కూతుళ్లు. తండ్రి రైల్వేస్టేషన్ వద్ద ఉడిపి హోటల్‌లో మేనేజర్‌గా, తల్లి బాలసదన్‌లో ఆయాగా, మొదటి, రెండో కుమార్తెలు ప్రైవేట్ ఆస్పత్రులలో పని చేస్తున్నారు.
చిన్నకూతురు దివ్య(18) ఓ కోచింగ్ సెంటర్‌లో బ్యుటీషియన్ కోర్సులో శిక్షణ పొందుతోంది. దివ్య శుక్రవారం మధ్నాహ్నం ఇంటికి చేరుకుని తలుపులు వేసుకుంది. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న తల్లికి ఇంట్లో ఏదో కాలిన వాసన రావటంతో కిటికీలో నుంచి చూడగా కూతురు పూర్తిగా కాలిపోయి కనిపించింది. ఆమె పెద్దగా అరవడంతో స్థానికులు అక్కడకు చేరుకుని తలుపులు తెరిచారు.
దివ్య బలవన్మరణానికి పాల్పడిన స్ధలంలో ఆమె చేతితో రాసిన సూసైడ్ నోట్ లభించింది. ‘‘అమ్మ నువ్వు చాలా మంచి దానివి, నా కోసం ఎన్నో చేశావు, ఎంతో కష్ట పడ్డావు, నాకు బతకాలని లేదు. నేను ఎవరి కోసమో చనిపోవటం లేదు. నా కోసమే చనిపోతున్నాను. నాన్న అమ్మను కొట్టవద్దు. అమ్మ చాలా మంచింది. మీ అందరూ బాగుండాలి’’ అని రాసి ఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.