ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను
- బయటకు వెళ్లడం లేదు
- మిలటరీ వారు రక్షణగా ఉన్నారు
- బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం
- ఇరాక్ నుంచి ఫోన్‌లో మాట్లాడిన వల్లెపు యాకయ్య
వర్ధన్నపేట: ఇరాక్‌లో ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న బాగ్దాద్ పట్టణానికి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్రా జిల్లా ధర్మ పట్టణంలోని బల్కాస్ అల్కామా కంపనీలో తాను క్షేమంగా ఉన్నానని వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన వల్లెపు యూకయ్య తెలిపారు. ఆయన సోమవారం ఇరాక్ నుంచి ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడాడు. తాను బల్కాస్ అల్కామా కంపనీలో వర్కర్లకు వంట చేసి పెడుతుంటానని చెప్పాడు. వారం రోజులుగా ఇరాక్‌లో అంతర్యుద్ధం జరుగుతుండడంతో తాము బయటకు వెళ్లకుండా ఇక్కడి పోలీసులు, మిలటరీ వారు మా ప్రాంతంలో రక్షణగా ఉన్నారని తెలిపాడు.
ప్రస్తుతం ఇక్కడ 40 మంది కూలీలము ఉన్నామని, తాను పనిచేసే కంపెనీ ప్రభుత్వ భవనాల నిర్మాణం చేస్తుందని, ప్రస్తుతం పనులన్నీ నిలిపి వేసి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని చెప్పాడు. కంపెనీ పక్కనే సబ్‌స్టేషన్ ఉందని, అక్కడి నుంచి చుట్టూ ఇరాక్ సైన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో రక్షణగా ఉందని, ఏ సమయంలోనైనా సబ్‌స్టేషన్‌పై దాడి చేయవచ్చనే అనుమానంతో వారు కాపాలా కాస్తున్నారని చెప్పాడు.
తాను నాలుగు సంవత్సరాలు దుబాయ్‌లో పనిచేశానని, అక్కడ జీతం తక్కువగా వస్తుండడంతో ఇంటికి తిరిగి వచ్చానని, అరుుతే ఇరాక్‌కు వెళితే అక్కడ డబ్బులు బాగా వస్తాయని చెప్పడంతో నాలుగు నెలల క్రితం రూ.రెండు లక్షలు అప్పు చేసి ఏజెంటు ద్వారా వీసా తీసుకుని వచ్చానని యూకయ్య వివరించాడు.
పనిలో చేరిన నాలుగు నెలల్లోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నెలకు 550 డాలర్లు వస్తుండగా ఖర్చులు పోను ఇంటికి రూ.25 వేలవరకు పంపుతున్నానని, ఇప్పుడు అప్పు తీరే మార్గం గురించి ఆలోచిస్తున్నానని చెప్పాడు. యుద్ధం ఇక్కడి వరకు వస్తే తమ పరిస్థితి ఏమిటోనని ఆందోళనగా ఉందని అన్నాడు.