ఇం‘ధన’ శాఖే!
- బడ్జెట్‌లో భారీగా పెరిగిన నిధులు
- గతంలో రూ. 4,955 కోట్లు, తాజాగా రూ. 7,399 కోట్లు
- జెన్‌కోకు నిధులు రెట్టింపు, కొత్త ప్రాజెక్టులకు రూ. వెయ్యి కోట్లు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో రాష్ర్ట విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)కు ఊతం లభించగా.. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు మాత్రం నిరాశే మిగిలింది. గతేడాదితో పోల్చితే ఇంధన శాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. గతంలో రూ. 4,955.89 కోట్లు కేటాయింపులు జరగ్గా.. తాజాగా రూ. 7,399.96 కోట్లకు పెరిగాయి. ప్రణాళికేతర కేటాయింపులు దాదాపు రెట్టింపు కాగా.. ప్రణాళిక కేటాయింపులు స్వల్పంగా తగ్గాయి. జెన్‌కోకు కేటాయింపులు గతంలోకన్నా రెట్టింపయ్యాయి.
విద్యుదుత్పత్తి కోసం ప్రణాళికేతర పద్దు కింద రూ. వెయ్యి కోట్లు, ప్రణాళిక పద్దు కింద రూ. వెయ్యి కోట్లను పెట్టుబడి నిధిగా జెన్‌కోకు కేటాయించింది. జెన్‌కో ఆధ్వర్యంలో కొత్తగూడెంలో 800 మెగావాట్లు, మణుగూరులో 540(2702) మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. ప్రతిపాదన దశలో ఉన్న నల్లగొండ జిల్లా దామరచర్ల, ఆదిలాబాద్ జిల్లా జైపూర్ ప్లాంట్ల కోసం కూడా నిధులను కేటాయించింది. ట్రాన్స్‌కోకు విద్యుత్ బాండ్ల రూపంలో ప్రణాళికేతర పద్దు కింద రూ. 455.76 కోట్లు దక్కాయి. ఇక విద్యుత్ సంస్థ(ఎలక్ట్రిసిటీ బోర్డు)కు రూ. 287 కోట్లను కేటాయించింది.
ప్రజలపై భారం తప్పదేమో!
విద్యుత్ చార్జీల పెంపుతో 2015-16లో డిస్కంలకు రూ. 1088 కోట్ల అదనపు ఆదాయం రానున్నప్పటికీ.. అవి ఇప్పటికే రూ. 6476.30 కోట్ల నష్టాల్లో మునిగి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో ఈ నష్టాలను అధిగమించవచ్చని డిస్కంలు ఆశించాయి. ఇటీవల ఈఆర్‌సీకి సమర్పించిన వార్షిక ఆదాయ నివేదిక(ఏఆర్‌ఆర్)లో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన రాయితీలను అందులో పేర్కొన్నాయి. కానీ తాజా బడ్జెట్‌లో మాత్రం రాయితీల కింద డిస్కంలకు రూ. 4257.24 కోట్లను మాత్రమే సర్కారు కేటాయించింది. దీంతో మిగిలిన భారాన్ని డిస్కంలు ఏదో ఒక రూపంలో మళ్లీ ప్రజలపైనే వేసే అవకాశాలున్నాయి. లేదంటే ఆర్థిక నష్టాలతో డిస్కంలు కుప్పకూలిపోయే ప్రమాదముంది. గతేడాది రాయితీలు కూడా రూ. 3000 కోట్లు మాత్రమే కాగా, ఈసారి ఈ నిధులు పెరిగినా డిస్కంలకు మాత్రం ఊరట లభించలేదు.