మిషన్ కాకతీయపై మంత్రుల దృష్టికి తెచ్చిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనుల ఆరంభానికి ప్రజాప్రతినిధులే అడ్డుపడుతున్నారని చిన్న నీటిపారుదల శాఖ జిల్లాల అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. తాము స్వయంగా పాల్గొనే వరకూ పనులు ఆరంభించరాదంటూ కొందరు ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, అందువల్లే కొన్నిచోట్ల పనుల్లో ఆలస్యం అనివార్యమవుతోందని వెల్లడించారు. శనివారం సచివాలయంలో మిషన్ కాకతీయ పనుల పురోగతిపై మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న మంత్రులు టి.హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు టెండర్ల ప్రక్రియ ముగిసి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగినా పనుల ఆలస్యానికి గల కారణాలపై అధికారులను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధుల వైఖరిని వారి దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో కొన్నిచోట్ల చెరువుల ఆక్రమణలు, అటవీ శాఖతో ఎదురవుతున్న సమస్యలను చెప్పారు. ఇతర శాఖలతో సమన్వయంపై ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయని, సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని మంత్రులు సూచించారు. పూడిక మట్టి తరలింపునకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. మిషన్ కాకతీయ పనుల్లో అధికారుల పనితీరును ప్రశంసించిన మంత్రి హరీష్‌రావు.. నిర్ణీత సమయంలో లక్ష్యం చేరుకోవాలన్నారని సమాచారం.
ప్రతి గురువారం ఐకేపీ మహిళల శ్రమదానం
మిషన్ కాకతీయలో భాగస్వామ్యమయ్యేందుకు తెలంగాణ ఇందిరా కాంత్రిపథం రోస్టర్ యూనియన్ మహిళా విభాగం ముందుకొచ్చింది. ప్రతి గురువారం రాష్ట్రవ్యాప్తంగా మిషన్ కాకతీయ పనుల్లో పాల్గొని శ్రమదానం చేయాలని నిర్ణయించినట్లు యూనియన్ చైర్మన్ సురేఖారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
పనుల ఆరంభానికి ప్రజాప్రతినిధులే అడ్డు!
Published Sun, Apr 12 2015 3:48 AM | Last Updated on Mon, Sep 17 2018 8:04 PM
Advertisement
Advertisement