మార్కెట్ శక్తుల్ని నియంత్రిస్తేనే.. | improve market forces .. | Sakshi
Sakshi News home page

మార్కెట్ శక్తుల్ని నియంత్రిస్తేనే..

Published Mon, Mar 31 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM

మార్కెట్ శక్తుల్ని నియంత్రిస్తేనే..

మార్కెట్ శక్తుల్ని నియంత్రిస్తేనే..

తెలంగాణలో అభివృద్ధి: రాఘవులు
మార్కెట్ శక్తుల వల్లే చెరువులు ధ్వంసం
భూపంపిణీతోనే సామాజిక న్యాయం
ఎస్‌వీకే ట్రస్ట్, సామాజిక న్యాయవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిపై సమావేశం

 
 మార్కెట్ శక్తులు ఆధిపత్యం చలాయించాయని, తెలంగాణలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం మార్కెట్ శక్తులను నియంత్రించకుంటే అభివృద్ధి జరగదని సీపీఎం నేత బి.వి.రాఘవులు అభిప్రాయపడ్డారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌వీకే ట్రస్ట్, సామాజిక న్యాయ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ నూతన తెలంగాణ రాష్ట్రంలో సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు.


తెలంగాణలో చెరువులు ధ్వంసమైన మాట వాస్తవమేనని.. మార్కెట్ శక్తుల వల్లే తెలంగాణతో పాటు సీమాంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లోనూ చెరువులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో పాలక వర్గాలు జాగ్రత్తగా ఉండకపోతే ఉన్న పరిశ్రమలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని.. అదే జరిగితే ఇప్పుడున్న అభివృద్ధి కూడా సాధ్యం కాదని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధి అంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదన్నారు. విద్య అనేది ఉపాధి కోసమే కాదని, వ్యక్తుల్లో చైతన్యాన్ని తెస్తుందని, ఇప్పుడు హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో చైతన్య, నారాయణ వంటి ప్రైవేటు విద్యాసంస్థలే రాజ్యమేలుతున్నాయని చెప్పారు.


ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని సూచించారు. సామాజిక న్యాయం జరగాలంటే భూ పంపిణీ జరగాలన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల సామాజిక న్యాయంలో ఒక అడుగు ముందుకు వేశామన్నారు. ఆంధ్ర పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్రమైన అన్యాయం చేశారని విమర్శించారు. ఆంధ్ర ప్రాంతం వారు 200 సంవత్సరాలు విద్యలో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. వ్యవసాయ సంఘం నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ఆర్.వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ పురేంద్రప్రసాద్, ప్రొఫెసర్ భూక్యా, క్రెడై సంస్థ సీఈఓ రాజేశ్వరరావు, కోవా సంస్థ ప్రతినిధి మజహర్‌హుస్సేన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement