
2019లో కాంగ్రెస్‌దే అధికారం: కోమటిరెడ్డి
హైదరాబాద్: ‘ప్రస్తుతం రెస్టులో ఉన్నాం. 2018లో రంగంలోకి దిగుతాం. 2019ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దే. కనీసం 95 స్థానాలు మేం గెలుచుకుంటాం.. మంత్రి జగదీశ్‌రెడ్డి ఉంటే చాలు మా విజయం ఇంకా సులువు ’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో గురువారం ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా ముచ్చటించారు. వచ్చేసారి అధికారం కాంగ్రెస్‌దే అని స్క్రోలింగులు ఇవ్వొచ్చా అని కొందరు విలేకరులు అడగడంతో ‘వద్దు వద్దు.. సీఎంఆర్‌ఎఫ్ పనిమీద సీఎం దగ్గరకు పోతున్నా. స్క్రోలింగ్ చూశాడంటే పనికాదు.
ఇలాగే ఓసారి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పనిమీద పోయి పనులు మొదలు పెట్టాలని కోరితే అప్పటికప్పుడే ఈఎన్‌సీకి ఫోన్‌చేసి చెప్పారు. పనులు కూడా మొదలయ్యాయి. కానీ, ఆ తర్వాత ఓ రోజు ఏదో ఒక సమావేశంలో సీఎం కేసీఆర్‌ను విమర్శించా. అంతే తెల్లారే బ్రాహ్మణవెల్లెంల పనులు నిలిచిపోయాయి’ అంటూ వివరించారు.