స్వైన్‌ఫ్లూ పంజా | in crease Swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ పంజా

Published Wed, Jan 21 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

స్వైన్‌ఫ్లూ పంజా

స్వైన్‌ఫ్లూ పంజా

హైదరాబాద్‌లో జనగామ వాసి మృతి
షాక్‌లో భర్తకు పక్షవాతం
అదే వ్యాధితో కుమారుడు ఆస్పత్రి పాలు
 

తెలంగాణలో స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేసులు నమోదు కావడం.. పదుల సంఖ్యలో మృతి చెందడంతో జిల్లావాసులు జంకుతున్నారు.. జనగామకు చెందిన ఉప్పల సంధ్యారాణి(35) స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కాగా, కొన్ని జాగ్రత్తలు
 పాటిస్తే మేలని వైద్యులు పేర్కొంటున్నారు.- ఎంజీఎం/జనగామ
 
స్వైన్‌ఫ్లూ.. ప్రస్తుతం ఇది రాష్ట్రంలోని ప్రజలందరితోపాటు ముఖ్యంగా వైద్యులను కూడా వణికిస్తున్న వ్యాధి. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి కావడంతో దీనిని అరికట్టడం కాస్త కష్టతరంగా మారింది. అందుకే స్వైన్‌ప్లూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులతోపాటు వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధులు సామాన్యంగా తిండి, నీళ్ల ద్వారా, తాకడం ద్వారా, సుఖవ్యాధుల ద్వారా వ్యాప్తిచెందుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ మూడు రకమైన వ్యాధులను అరికట్టవచ్చు. కానీ గాలి ద్వారా వ్యాపించే స్వైన్‌ఫ్లూను అరికట్టడం కష్టతరంగా మారడంతో ఈ వ్యాధి వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.     - ఎంజీఎం
 
స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్‌ప్లుయెంజా విభాగానికి చెందిన వైరస్‌తో వ్యాపించే జలుబు. అయితే ఈ రకమైన వైరస్ తరచూ తనలో ఉన్న జన్యువులను ఇతర వైరస్‌లతో మార్చుకోవడం వల్ల కొత్త రకం వైరస్‌లు పుట్టుకొచ్చి ఫ్లూ జ్వరం కలుగజేస్తుంటాయి. తొలుత ఈ వైరస్‌ను పరిశీలించినప్పుడు అది పంది శ్వాసకోశ వ్యాధికి కారణమయ్యే ఒక వైరస్‌లోని జన్యువులతో పోలి ఉంది. ఇన్‌ప్లుయెంజాకు కారణమయ్యే అనేక వైరస్‌ల్లో ఒకటి జన్యుమార్పిడికి లోనైంది. పందుల్లో ఉండే ఈ వైరస్ తన యాంటీ జెనిక్ స్వరూపాన్ని మార్చుకుని మనుషుల్లో వ్యాప్తిచెందడం వల్ల స్వైన్‌ఫ్లూగా పేరు పెట్టారు. ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ’ రకానికి చెందిన వైరస్ కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంటుంది. వ్యవహారిక భాషలో స్వైన్‌ఫ్లూ అని పిలుస్తున్నా వైద్యులు మాత్రం దీన్ని తమ పరిభాషలో హెచ్1 ఎన్1 అని అంటారు.  
 
రోగి జాగ్రత్తలు తీసుకోకుంటే ఎదుటివారికి వ్యాధి సంక్రమణ
 
ఈ వ్యాధి వ్యాపించినప్పుడు చికిత్స కంటే నివారణ చాలా ముఖ్యం. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సిందే. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ఖాళీ చేతులు అడ్డుపెట్టుకుని దగ్గడం, తుమ్మడం, దగ్గడం చేస్తే చేతుల్ని శుభ్రంగా సబ్బుతో చాలాసేపు కడుక్కోవాలి. జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు కూడా తమ లక్షణాలు తగ్గిన 24 గంటల వరకు అందరి నుంచి దూరంగా ఉండడం మంచిది. జలుబు లక్షణాలు కనిపించినా అది తగ్గే వరకు పది మంది మెదిలే ప్రదేశాలకు ఆఫీసులకు వెళ్లండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి.
 
స్వైన్ ఫ్లూను గుర్తించండిలా..
 
మొదట్లో ఈ జబ్బు అన్ని ఫ్లూ జ్వరంలాగే కనిపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతుల్లో ఇన్‌ఫెక్షన్, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేగాక విరేచనాలు, వాంతులు కూడా కనిపించినప్పుడు దీనిని స్వైన్‌ఫ్లూగా అనుమానిస్తారు. అయితే ఇది పిల్లలో వేగంగా శ్వాస తీసుకోవడం, చర్మం నీలిరంగుగా మారడం, నీళ్లు, ద్రవపదార్థాలు తీసుకోకపోవడం, త్వరగా నిద్రలేవలేకపోవడం, ప్లూ జ్వరం తగ్గినా, దగ్గు ఒక పట్టాన త్వరగా తగ్గకపోవడం కనిపిస్తుంటాయి. పెద్దల్లో విపరీతమైన అయాసం, చాతి, పొట్టలో నొక్కేస్టున్నట్లు నొప్పి రావడం, నీరసపడిపోవడం, వాంతులు వంటి  లక్షణాలు కనిపిస్తుంటాయి.
 
వ్యాక్సిన్‌తో వ్యాధిని అరికట్టలేం


వ్యాధుల రాకుండా వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ స్వైన్‌ఫ్లూను వ్యాక్సిన్‌తో అరికట్టలేం. జన్యుమార్పిడి వల్ల కలిగేది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టలేం.  అన్ని రకాల జలుబు, జ్వరాన్ని స్వైన్‌ఫ్లూగా భ్రమించి విరివిగా మందులు వాడడంతో వైరస్‌లపై మందుల ప్రభావం తగ్గిపోయి పనిచేయకుండా పోతాయి. బయట మెడికల్ షాపుల్లో దీనికి సంబంధించిన మందులు దొరకవు. కేవలం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల యంలో లభిస్తాయి. తప్పనిసరిగా డాక్టర్ వద్దకు పరీక్ష చేయించుకుని వైద్యుడి  సూచన మేరకే ఈ మందులు వాడాలి. జిల్లా అధికారులు కూడా ఈ మందులను సంబంధిత వైద్యులకే అందిస్తుంటారు.
 - డాక్టర్ ఏరుకొండ శ్రీధర్, చెస్ట్ ఫిజీషియన్
 
 స్వైన్‌ఫ్లూతో వివాహిత మృతి
 

అదేవ్యాధితో కుమారుడు ఆస్పత్రిపాలు
షాక్‌తో భర్తకు పక్షవాతం
జనగామలో విషాదం

 
 జనగామ : స్వైన్‌ఫ్లూ వ్యాధి జిల్లాకు చెందిన ఓ మహిళను బలిగొంది. పట్టణానికి ఉప్పల సంధ్యారాణి(35) హెచ్1ఎన్1 వైరస్ బారినపడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచింది. భార్య చ నిపోయిందనే షాక్‌తో సంధ్యారాణి భర్తకు పక్షవాతం రాగా, స్వైన్‌ఫ్లూతో వారి కుమారు డు ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. జనగామ పాతబీటు బజారుకు చెందిన గుండా కేశవులు, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె సంధ్యారాణిని కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ చింతల్‌కు చెందిన ఉప్పల శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశారు. శ్రీనివాస్ కుత్బుల్లాపూర్ మండల డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తుండగా సంధ్యారాణి గృహిణిగా ఉంటోం ది. వారికి కుమారులు రాహుల్, కిట్టూ ఉన్నారు. ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబాన్ని  స్వైన్‌ఫ్లూ రక్కసి ఒక్కసారిగా కుదిపేసింది. రెండు రోజుల క్రితమే సంధ్యారాణి అనారోగ్యానికి గురికాగా సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేసి మంగళవారం ఉదయం  స్వైన్‌ఫ్లూగా నిర్ధారించి గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ ఆమె సాయంత్రం కన్నుమూసింది. ఇదిలా ఉండగా మృతురాలి చిన్నకుమారుడు కిట్టూ(10) కూడా స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంధ్యారాణి మృతితో జనగామలోని తల్లిగారింట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
 
షాక్‌తో భర్తకు పక్షవాతం

 భార్యకు స్వైన్‌ఫ్లూ సోకిందన్న వార్త తెలియగానే సంధ్యారాణి భర్త శ్రీనివాస్ మంగళవారం ఉదయం షాక్‌కు గురయ్యారు. దీంతో ఆయన కుడి చేయి, కుడి కాలు వంకరపోయి పక్షవాతానికి గురయ్యారు. బంధువులు అతడిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని పెనువిషాదంలోకి నెట్టింది. పైగా వ్యాధి భయానికి బంధువులు దగ్గరకు రాకుండా అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండడంతో వారి గోస వర్ణణాతీతంగా ఉన్నట్లు వారి స్నేహితులు తెలిపారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement