హైవేపై అత్యవసర ఆస్పత్రులు నిర్మిస్తాం
ఇన్ముల్‌నర్వ (కొత్తూరు) : జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక ఆస్పత్రులు నిర్మిస్తామని, క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఇన్ముల్‌నర్వ గ్రామంలోని హజ్రత్ జహంగీర్ పీర్ దర్గాలో శుక్రవారం బంధువులు నిర్వహించిన న్యాజ్(విందు) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జాతీయ రహదారిపై పలు కూడళ్ల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు మృత్యువాత పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలను అరికడతామన్నారు.
దర్గాలో సౌకర్యాలు కల్పిస్తాం...
జేపీ దర్గా నుంచి ఏటా వక్ఫ్‌బోర్డుకు సుమారు రూ.60లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆదాయం వస్తున్నా కనీస సౌ కర్యాలు కల్పించడంలో సంబంధిత శాఖ అధికారులు అలసత్వం ప్రద ర్శిస్తున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన హోంమంత్రి తమ ప్రభుత్వంలో వక్ఫ్‌బోర్డు అధికారులకు సరైన సూచనలు ఇచ్చి దర్గాలో అవసరమైన ఏర్పాట్లు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. హోంమంత్రి రాక సందర్భంగా షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణాచార్యులు దర్గా రోడ్డుతోపాటు ఆవరణలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, తహశీల్దార్ నాగయ్య, ఆర్డీఓ, ఇతర నాయకులు సత్తయ్య, యాదగిరి, మిట్టునాయక్, గోపాల్, మంగులాల్‌నాయక్ పాల్గొన్నారు.