మంథనిలో రాజకీయ దాడులు | In manthani political attacks | Sakshi
Sakshi News home page

మంథనిలో రాజకీయ దాడులు

Published Mon, May 19 2014 2:24 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

In manthani political attacks

మంథని, న్యూస్‌లైన్:  మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ శ్రేణులు ఘర్షణలకు దిగడంతో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంథనిలోని శ్రీపాద కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డుసభ్యుడు ఆకుల శ్రీనివాస్‌పై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
 
 ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడి విషయం ఆనోట ఈనోట బయటకు పొక్కడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు గుమిగూడారు. కాలనీకి చెందిన వ్యక్తులు కాకుండా వేరే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ టీఆర్‌ఎస్ వారు ఎదురుతిరిగారు. ఈక్రమంలో రెండు వర్గాలు ఘర్షణపడ్డాయి. దీంతో పరిస్థితి అదుపుతప్పి ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది కారంపొడి, మారణాయుధాలతో ఇక్కడికి వచ్చారని, తమ కార్యకర్తపై దాడి చేశారని టీఆర్‌ఎస్ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 కాంగ్రెస్‌కు చెందిన కొందరిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకోవడంతో.. తమపై దాడి చేసేందుకు వచ్చిన వారికి రక్షణ ఎలా కల్పిస్తారని మంథని సర్పంచ్ పుట్ట శైలజ, జెడ్పీటీసీ సరోజనతోపాటు కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు సదరు కార్యకర్తలను వదిలేశారు. వాహనం నుంచి వారు దిగి పరుగెత్తడంతో మరోసారి రెండు వర్గాలు దాడికి దిగాయి. ఇలా సుమారు గంటకు పైగా పరస్పరం దాడులు జరుగడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు పట్టణంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. రాజకీయ కక్షల కారణంగా రెండు రోజులుగా పరస్పర దాడులు జరుగుతుండటంతో మంథనిలో భయానక వాతావరణం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement