మియాపూర్.. రవాణా హబ్ | In Miyapur transport hub | Sakshi
Sakshi News home page

మియాపూర్.. రవాణా హబ్

Published Tue, Jun 23 2015 1:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

మియాపూర్.. రవాణా హబ్ - Sakshi

మియాపూర్.. రవాణా హబ్

- మళ్లీ తెరపైకి ఇంటర్ సిటీ బస్ టెర్మినల్
- పాత ఫైళ్లకు బూజు దులిపిన హెచ్‌ఎండీఏ
- కొత్త టెర్మినళ్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో :
హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఆవిష్కరించేందుకు నగరానికి నలువైపులా అత్యాధునిక వసతులతో కూడిన ‘బస్ టెర్మినళ్ల’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో గతంలో రూపొందించిన పలు ప్రాజెక్టులకు ప్రాణ ప్రతిష్ట చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో మియాపూర్‌లో తలపెట్టిన ‘ట్రాన్స్‌పోర్టు సిటీ’ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది.

టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పెండింగ్‌లో పడిన ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలపైకి ఎక్కించేందుకు హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రాజెక్టుపై ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లగా దానిని పునరుద్ధరించాలని ఆయన సూచించారు. దీంతో దాన్ని మరోసారి లోతుగా పరిశీలించి సీఎంకు పంపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు సిద్ధంగా ఉండటంతో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు.
 
మెగా ప్రాజెక్టు : నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూసేందుకుగాను శివారు ప్రాంతాల్లోనే ఇంటర్ సిటీ బస్ టెర్మినల్స్ నిర్మించాలని  హెచ్ ఎండీఏ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆ మేరకు నగర శివారులోని మియాపూర్‌లో ఆధునిక వసతులతో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మియాపూర్ ( ఎన్‌హెచ్-9, 7లను కలిపే మియాపూర్-కొంపల్లి ఇంటర్మీడియట్ రింగ్‌రోడ్డు) వద్ద 55 ఎకరాల్లో ‘ట్రాన్స్‌పోర్టు సిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడమేగాక ఇందుకు సంబంందించి టెండర్లు కూడా ఖరారయ్యాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించేందుకు  కేఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం సైతం కుదుర్చుకొంది.

బస్ టెర్మినల్ నిర్మాణంతో పాటు 33 సంవత్సరాలు లీజ్ ప్రాతిపదికన దానిని నిర్వహించేందుకు అప్పట్లో అంగీకారం కుదిరింది  ఇందుకు ప్రతిఫలంగా హెచ్‌ఎండీఏ సదరు సంస్థకు  రూ.64.22కోట్లు  చెల్లించే విధంగా అగ్రిమెంట్ చేసుకొంది.  అయితే పీపీపీ విధానంలో చేపట్టిన ఏ ప్రాజెక్టుకైనా  స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ ( ఎస్‌ఐఏఈ) నుంచి విధిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే... ఈ ప్రాజెక్టుకు హెచ్‌ఎండీఏ  ఏపిఐఏఈ నుంచి అనుమతి తీసుకోలేక పోయింది.  అప్పట్లో హెచ్ ఎండీఏ కమిషనర్‌గా ఉన్న నీరభ్‌కుమార్ ప్రసాద్ దీనిపై శ్రద్ధ  చూపకపోవడంతో లాంఛనాలన్నీ పూర్తయినా ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ఈ ప్రాజెక్టు పెండింగ్ జాబితాలో చేరింది.
 
ట్రాఫిక్ ఫ్రీ...: నగరానికి నలువైపులా ఇంటర్ సిటీ బస్ టెర్మినల్స్‌ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో రానున్న రోజుల్లో నగరరోడ్లపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే బస్సులు, ఇతర వాహనాలు పగలంతా ఇక్కడే ఉండి రాత్రిపూట తిరుగు పయనమవుతుంటాయి. ఈ క్రమంలో ఆయా వాహనాలన్నీ నగరంలోని వివిధ రోడ్ల వెంట పార్కు చేసి ఉంచుతుండటంతో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ప్రస్తుతం తలపెట్టిన ఇంటర్‌సిటీ బస్ టెర్మినళ్లు అందుబాటులోకి వస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలన్నీ శివార్లలోనే నిలిపివేయనుండడంతో నగరంలో ట్రాపిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించగలదని వారు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement