బోనాల నిధులు పక్కదారి! | In this funded by the wayside! | Sakshi
Sakshi News home page

బోనాల నిధులు పక్కదారి!

Published Tue, Jul 1 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

బోనాల నిధులు పక్కదారి!

బోనాల నిధులు పక్కదారి!

  •  రూ.10 కోట్లు విడుదల చేసిన సర్కార్
  •   కొనసాగుతున్న సంబంధంలేని పనులు
  •   అవన్నీ ప్రజాప్రతినిధులు, అధికారులకు నచ్చినవే
  •   కమిషనర్ తనిఖీలో వెల్లడి
  • సాక్షి, సిటీబ్యూరో: బోనాల పండుగ ఏర్పాట్ల కోసం విడుదలైన నిధులు పక్కదారి పట్టాయి. ఆలయాల వద్ద, ఆలయాలకు వెళ్లే మార్గాల్లో భక్తుల కోసం అవసరమైన పనులు చేపట్టాల్సి ఉంది. అలాంటిదీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు అవసరమైన చోట పనులు చేపడుతున్నారు. ఈ విషయం సాక్షాత్తు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తనిఖీలో వెలుగు చూసింది. పక్కదారి పట్టిన పనులను చూసి నివ్వెరపోవడం కమిషనర్ వంతైంది. బోనాల పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి రూ.10 కోట్లు మంజూరు చేసింది.

    ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే చాలా పనులు మంజూరు చేయగా పనులు కూడా జరుగుతున్నాయి. కానీ.. అవి బోనాలకు సంబంధించిన పనులు కాదు. ఆలయాలకు దారి తీసే మార్గాల్లోవి కావు. ఎక్కడ పడితే అక్కడ ఏవో పనులు కొనసాగుతున్నాయి. అదీ కూడా స్థానిక ప్రజాప్రతినిధుల అవసరం మేరకు చేపడుతున్న పనులని తేలింది. మరి కొన్ని చోట్ల స్థానిక అధికారుల విచక్షణ మేరకు కొనసాగుతున్నాయి.

    ఇలా బోనాల పేరిట మంజూ రైన నిధులను ఎవరికి వారుగా ఇష్టానుసారం ఖర్చు చేస్తున్న విషయం సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ దృష్టికి వచ్చింది. ‘మంజూరైన నిధులు ఏ పనుల కోసమని కమిషనర్ నిలదీస్తే అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడం గమనార్హం. ఎప్పటిలాగే.. ఈసారి కూడా బోనాల నిధులను స్వాహా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నవారికి కమిషనర్ తనిఖీలతో అడ్డుకట్ట పడింది.

    ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నిధులను బోనాల ఏర్పాట్ల కోసమే వెచ్చించాలని కమిషన్ ఆదేశించారు. పండుగల సందర్భంగా ఆయా ఆలయాల వద్ద పండుగ  కళ కనిపించేలా ర హదారి మార్కింగ్‌లను, డివైడర్లను ముగ్గులతో తీర్చిదిద్దాలని సూచించారు. లాల్‌దర్వాజ, గోల్కొండ, సికింద్రాబాద్‌లో అమ్మవార్ల ఆలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

    రహదారుల విస్తరణ, ఫుట్‌పాత్‌లు, తాగునీటి ఏర్పాట్లు, పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పాట్నాలో జరిగే ‘ఛాట్’ పండుగకు రహదారులను అలంకరించే విధంగా ఇక్కడ కూడా భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముగ్గులతో పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.

    బోనాలు.. హలీం ఫుడ్ ఫెస్టివల్స్
     
    బోనాలు, రంజాన్ పండుగలను పురస్కరించుకొని ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. మాదాపూర్‌లోని శిల్పారామంలో వీటిని నిర్వహిస్తామన్నారు. జూలై 11, 18వ తేదీల్లో హలీం, 26, 27వ తేదీల్లో బోనాల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల ఫెస్టివల్‌లో తెలంగాణ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ఇందుకు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ముందుకొచ్చిందని చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement