ట్రిపుల్ ఐటీలో కలకలం
- కలుషిత ఆహారం తిని 120 మంది విద్యార్థులకు అస్వస్థత
- నిజామాబాద్ ఆస్పత్రికి కొందరి తరలింపు
- స్థానిక ఆస్పత్రిలో మరికొందరికి చికిత్స
- ఆందోళనకు దిగిన వేలాది మంది విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/బాసర/భైంసా : బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని 120 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో కలకలం రేపింది. ట్రిపుల్ ఐటీలో ఆరు వేల మంది విద్యార్థులకు రెండు మెస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మెస్‌లో మూడు వేల మంది విద్యార్థులు భోజనాలు చేస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి మిగిలిన ఆహారాన్నే మధ్యాహ్నం వడ్డించడంతో ఈ సంఘటన జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ-2, ఈ-3, ఈ-4 చదివే విద్యార్థులు భోజనం చేసే తెలంగాణ హాస్పిటాలిటీ సర్వీసెస్ నిర్వహిస్తున్న మెస్‌లో ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయని ట్రిఫుల్‌ఐటీ పీఆర్‌ఓ గోపాలకృష్ణ పేర్కొన్నారు.
వారిని వెంటనే క్యాంపస్‌లోని వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు. శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులకు కొందరికి ఉదయం నుంచే కడుపునొప్పి ప్రారంభమైంది. వెంటనే ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. తీరా మధ్యాహ్నం నుంచి అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరుగుతూ పోయింది. ఏకంగా 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఆందోళన వ్యక్తమైంది. దీంతో కొందరిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో పరిస్థితి ఆదుపులోకి వచ్చింది.
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రిఫుల్ ఐటీ విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. తాగునీరు, వాతావరణ మార్పుల కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండి ఉంటారని విద్యాసంస్థ ఉన్నతాధికారులు కప్పిపుచ్చుకునే ప్రయాత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అసిస్టెంట్ రిజిష్టార్ రహమాన్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఆరా తీశారు. హుటాహుటిన బాసర వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని పలువురు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ట్రిపుల్ ఐటీలోని తమ పిల్లలకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.