Basra Triple IT
-
ట్రిపుల్‌ఐటీలో ముగిసిన వైజ్ఞానిక మేళా
బాసర(ముథోల్) : బాసర ట్రిపుల్‌ఐటీలో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వైజ్ఞానిక మేళా గురువారం రాత్రి ముగిసింది. దాదాపు 221 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రయోగాలను ప్రదర్శించారు. గురువారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ముగింపు సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, తెలంగాణ యూనివర్సిటీ సాంబయ్య, ఎ¯Œఆర్ఎస్ఏ డైరెక్టర్ సూజాత గోశ్, పాలమూరు యూనివర్శిటీ వైస్ ఛాన్సులార్ రాజరత్నం, వీసీ డాక్టర్ అశోక్‌కుమార్, ముఖ్య అథితులుగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను ఆకస్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ట్రిపుల్ఐటీ ఉండడం అదృష్టమన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న వైజ్ఞానిక దృష్టి కోణాన్ని బహిర్గతం చేయడానికి విజ్ఞాన ప్రదర్శన ఉపయోగపడిందన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏవో వెంకటస్వామి, అకాడమిక్ డీన్ రణదీర్ సాగీ, టెక్ ఫెస్టు కన్వీనర్ స్వప్నిల్, నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో కలకలం
- కలుషిత ఆహారం తిని 120 మంది విద్యార్థులకు అస్వస్థత - నిజామాబాద్ ఆస్పత్రికి కొందరి తరలింపు - స్థానిక ఆస్పత్రిలో మరికొందరికి చికిత్స - ఆందోళనకు దిగిన వేలాది మంది విద్యార్థులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/బాసర/భైంసా : బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని 120 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో కలకలం రేపింది. ట్రిపుల్ ఐటీలో ఆరు వేల మంది విద్యార్థులకు రెండు మెస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మెస్‌లో మూడు వేల మంది విద్యార్థులు భోజనాలు చేస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి మిగిలిన ఆహారాన్నే మధ్యాహ్నం వడ్డించడంతో ఈ సంఘటన జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ-2, ఈ-3, ఈ-4 చదివే విద్యార్థులు భోజనం చేసే తెలంగాణ హాస్పిటాలిటీ సర్వీసెస్ నిర్వహిస్తున్న మెస్‌లో ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయని ట్రిఫుల్ఐటీ పీఆర్ఓ గోపాలకృష్ణ పేర్కొన్నారు. వారిని వెంటనే క్యాంపస్‌లోని వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు. శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులకు కొందరికి ఉదయం నుంచే కడుపునొప్పి ప్రారంభమైంది. వెంటనే ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. తీరా మధ్యాహ్నం నుంచి అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరుగుతూ పోయింది. ఏకంగా 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఆందోళన వ్యక్తమైంది. దీంతో కొందరిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో పరిస్థితి ఆదుపులోకి వచ్చింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రిఫుల్ ఐటీ విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. తాగునీరు, వాతావరణ మార్పుల కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండి ఉంటారని విద్యాసంస్థ ఉన్నతాధికారులు కప్పిపుచ్చుకునే ప్రయాత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అసిస్టెంట్ రిజిష్టార్ రహమాన్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఆరా తీశారు. హుటాహుటిన బాసర వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని పలువురు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ట్రిపుల్ ఐటీలోని తమ పిల్లలకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. -
నాసాకు వెళ్లేందుకు భరోసా
హైదరాబాద్: నాసా ఆహ్వానం అందుకున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పర్యటనకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. కెనడాలో ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్(ఐఎస్‌డీసీ) జరుగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న తెలంగాణకు చెందిన 16 మందితో పాటు పశ్చిమ గోదావరికి చెందిన మరో విద్యార్థిని అర్హత సాధించారు. వీరందరూ నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కావటంతో సదస్సుకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత అడ్డంకిగా మారింది. దీంతో స్పందించిన సీఎం విద్యార్థులకయ్యే పూర్తి ఖర్చును అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం హామీ మేరకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున 17 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన అంకితి పావని, స్టెల్లా కుమారి, దివ్యరాణి, మేఘన, నాగ సంతోష్, శ్రీనిజ, హైదరాబాద్‌కు చెందిన ఎం.శ్రీనివాసరావు, చెన్నరాయుడు, ప్రభాదీనరాజు, నవ్య, షేక్ మనీషాబాబు, డి.పల్లవి, డి.వినయ్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జమీమిహా ఎవాంజలైన్, షాద్ నగర్‌కు చెందిన బాస రచన, కొత్తాపూర్కు చెందిన షేక్ గుల్జా ఈ సదస్సులో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. క్రికెట్ క్రీడాకారుడికి చేయూత నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన మహ్మద్ రియాజుద్దీన్ ఖాజాకు ప్రభుత్వం రూ. 2 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసింది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగే ఫిజికల్లీ చాలెంజ్డ్ క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు అయ్యే ఖర్చులకు సాయం కోరుతూ రియాజుద్దీన్ ఇటీవలే సీఎంకు విజ్ఞప్తి చేసుకున్నారు.