సింగరేణిలో కొత్త బ్లాకులు అందుబాటులోకి వచ్చి బొగ్గు ఉత్పత్తి పెరగటంతో అదనంగా 15 శాతం వరకు బొగ్గు రవాణా ....
ఆదాయం పెంపునకు
దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు
హైదరాబాద్: సింగరేణిలో కొత్త బ్లాకులు అందుబాటులోకి వచ్చి బొగ్గు ఉత్పత్తి పెరగటంతో అదనంగా 15 శాతం వరకు బొగ్గు రవాణా చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. త్వరలో అందుబాటులోకి రానున్న భూపాలపల్లి థర్మల్ పవర్ ప్లాంటుకు ప్రతిరోజూ ఒక ర్యాక్ చొప్పున బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించింది. బొగ్గు, సిమెంటు రవాణా మరింతగా పెంచే ఉద్దేశంతో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సక్సేనా ఆయా సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే ఆదాయం మందగించడంతో ప్రధాన ఆదాయ వనరు అయిన సరుకు రవాణపై దృష్టి సారించింది. రైల్వే ద్వారా సురక్షితంగా రవాణా చేయొచ్చని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం లేదని సంస్థల ప్రతినిధులకు ద.మ.రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఉమేశ్ సింగ్ సూచించారు. గత ఆర్థిక సంవత్సరం 9 మిలియన్ టన్నులను మించి సరుకు రవాణా చేశామని, ఈసారి అది పెరుగుతుందని చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఝా పేర్కొన్నారు. మరింత మెరుగ్గా వ్యవహరించేందుకు రైల్వేలో ఇ-డిమాండ్ రిజిస్ట్రేషన్, ఈ-పేమెంట్‌ను విస్తృతం చేస్తున్నట్టు చీఫ్ కమర్షియల్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు.