
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని సినిమా హాళ్లలో అన్ని తరగతుల టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ధరల పెంపుపై ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేసి ఈ వ్యవహారం తేల్చేంత వరకు పెంచిన ధరలు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. పెంపును సంబంధిత అధికారులకు తెలియజేయాలని, ధరల నిష్పత్తిలో పన్ను చెల్లించాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీ భట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కోర్టు విధించిన షరతులను యాజమాన్యాలు అమలు చేస్తున్నాయో లేదో జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలని, సంబంధిత నివేదికను తమ ముందుంచాలని స్పష్టం చేశారు.
ధరల పెంపుపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, నిర్ణయం తీసుకునే వరకు ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలంటూ పలు థియేటర్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీ భట్ విచారణ జరపగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టికెట్ ధరల సవరణపై 2013లో ప్రభుత్వం జీవో 100ను జారీ చేయగా హైకోర్టు కొట్టేసిందన్నారు. ధరలను నిర్ణయించేందుకు హోం శాఖ ముఖ్య కార్యదర్శుల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించిందని వివరించారు. 2017 మార్చి 30 లోపు ధరలపై మార్గదర్శకాలు రూపొందించాలని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని.. కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment