పెరిగిన సింగరేణి స్కూల్ ఫీజులు
శ్రీరాంపూర్ : కార్మికుల సంక్షేమంలో భాగంగా సింగరేణి ఏర్పాటు చేసిన పాఠశాలలు రానురాను ప్రైవేటు పాఠశాలలుగా మారుతున్నాయి. నామమాత్రం ఫీజులతో విద్యాబోధన చేయాల్సిన ఈ పాఠశాలల్లో ఫీజుల పెంపు తల్లిదండ్రులకు భారంగా పరిణమించింది. సంస్కరణల మూలంగా సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే పలు పాఠశాలలను మూసివేశారు. ఉన్నవి కూడా మూతపడేలా యజామాన్యం వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ఈ విద్యాసంవత్సరం నుంచి ఫీజులు పెంచుతూ యాజమాన్యం కొద్ది రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది కంటే రెండు, మూడు రేట్లు ఫీజులు పెరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క సారిగా ఇంత భారం మోపుతారా అని ప్రశ్నిస్తున్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫీజులు తగ్గించాలని వారు కోరుతున్నారు.
పెంచిన ఫీజులు తగ్గించాలి
పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలి. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం. చాలా మంది కార్మికుల పిల్లలు, ప్రైవేటు పిల్లలు ఇప్పుడిప్పుడే కంపెనీ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రైవేటు పాఠశాలల వలే ఫీజులు పెంచడంతో వచ్చే పిల్లలు కూడా రాకుండా పోతారు.
- వేముల కిరణ్‌కుమార్, బీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు
పాఠశాలలను మూసివేసే కుట్ర
సింగరేణి యాజమాన్యం ఉన్న పాఠశాలలను మూసివేసే కుట్ర చే స్తోంది. ఇప్పటికే చాలా పాఠశాలలను మూసివేశారు. కోట్ల లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి లాభార్జన కోసం కాకుండా ఈ ప్రాంత వాసుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని స్వల్ప ఫీజులకే విద్యాబోధన చేయాలి. ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కంపెనీ బాధ్యత.
- పెరక మహేందర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి