ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
ఫైలుపై కేసీఆర్ సంతకం.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు జీతంతోపాటు ఈ ప్రత్యేక ఇంక్రిమెంట్ జత కూడనుంది. ఉద్యోగులు సర్వీసులో ఉన్నంత కాలం ఇది కొనసాగనుంది. అయితే దీన్ని బేసిక్‌పేలో కలపకుండా విడిగా చూపుతారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ ఉద్యోగులతోపాటు యూజీసీ, ఏఐసీటీఈ ఆమోదం పొందిన యూనివర్సిటీల ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇంక్రిమెంటు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో మంత్రిమండలి కూడా దీనికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంబంధిత ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. అయితే దీన్ని తమకు కూడా వర్తింపచేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా దీనిపై డిమాండ్ చేస్తూ వస్తున్న కార్మికులు తాజా ఉత్తర్వు నేపథ్యంలో మరోసారి ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరినట్టు ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు.