దేశానికి ఎర్రకోట.. మనకు గోల్కొండ కోట
* చారిత్రక ప్రాంతంపై ఎగరనున్న జాతీయజెండా
సాక్షి, హైదరాబాద్: దేశానికి ఎర్రకోట.. మనకు గోల్కొండ కోట.. పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటపై జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలనోట ప్రస్తుతం వినిపిస్తున్న మాటలివి.. కాకతీయుల కాలం నుంచి కుతుబ్‌షాహీల పాలన వరకు... మట్టికోట నుంచి మహా దుర్భేద్యమైన కోటగా మారిన గోల్కొండ కోటకు వేలసంవత్సరాల చరిత్ర ఉంది.
చుట్టూ రక్షణ ప్రాకారాలు.. నలువైపులా ఎనిమిది ప్రధాన ద్వారాలు... అద్భుతమైన రాజప్రాసాదాలు... అందమైన ఉద్యానవనాలు... అంచెలంచెలుగా 87 బురుజులు... కుతుబ్‌షాహీల వైభవోపేతమైన పరిపాలనకు నిలువెత్తు నిదర్శనం గోల్కొండ కోట... మొఘలుల దాడులతో ప్రాభవాన్ని కోల్పోయినా అసఫ్‌జాహీల ఆదరణతో కొత్త వెలుగులద్దుకొంది. ఇప్పుడు ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో మరోసారి ఈ చారిత్రక కోట ప్రాచుర్యంలోకి వచ్చింది.