![Independents Are Key Factors - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/16/vote2.jpg.webp?itok=JbzxJSWa)
సాక్షి, జనగామ: లోక్‌సభ ఎన్నికల సైరన్ మోగడంతో విజయంపై ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవంతో గులాబీ దళం ఒకడుగు ముందుకు వేస్తుండగా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని మిగతా పార్టీలు కిందస్థాయి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి. నామినేషన్ల ప్రక్రియ షెడ్యూల్ కోసం మరో రెండు రోజుల గడువు ఉండడంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. నామినేషన్ల పర్వం మొదలు కాకముందే ఎవరికి వారే తమ ప్రత్యర్థుల కదలికలను గమణిస్తున్నారు.
గ్రామాల వారీగా చేరికలకు శ్రీకారం చుడుతూ ముఖ్యులపై కన్నేస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటి నుంచే ఎక్కువ సమయం కేటాయి స్తున్నారు. పార్టీలకు సంబంధం లేని ఓటర్ల హృదయాలను గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 6,96,535 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 3,48,301, పురుషులు 3,48,222, ఇతరులు 12 మంది ఉన్నారు.
ప్రముఖులతో కాంటాక్టు....
లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ తలపడనున్నాయి. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న జనగామ నియోజక వర్గంతో పాటు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ‘ఎంపీ’ ఎలక్షన్ల వేడి మొదలైంది. ఆయా నియోజక వర్గాల పరిధిలోని మండల, జిల్లా నాయకులతో పాటు ఎమ్మెల్యేలు విశ్రాంత ఉద్యోగులు, ఆయా వర్గాల్లోని వ్యాపారులు, యువకులు, ఉద్యోగులతో పాటు పార్టీలకు అతీతంగా తటస్థంగా ఉన్న ఓటర్లపై కన్నేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారడంతో ఒక్కరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఆయా గ్రామాల్లో ప్రముఖులను కలుస్తూ అన్ని వర్గాల ప్రజల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఫోన్‌లో అప్యాయంగా పలకరిస్తూ...
నామినేషన్ల సమయం దగ్గర పడుతుండడంతో...గ్రామాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్‌లో ఆప్యాయంగా పలకరిస్తూ... పార్టీ సంగతుల గురించి వాకబు చేస్తున్నారు.
పట్నంపై నజర్..
ఇతర ప్రాంతాలకు బతుకు దెరువు కోసం వెళ్లి... సొంత గ్రామాల్లో ఓటు హక్కు ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. వీరంగా ఎన్నికల సమయంలో సొంత గ్రామాలకు వచ్చి.. ఓట్లు వేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment