
సాక్షి, హైదరాబాద్: భారత్–అమెరికా రక్షణ సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని అమెరికా రాజకీయ, మిలటరీ వ్యవహారాల విభాగం డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జోయల్ స్టార్ అన్నారు. హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్, ఢిల్లీ యూఎస్ రాయబార కార్యాలయ అధికారి కెప్టెన్ డేనియల్ ఫిలియన్‌తో కలసి బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రక్షణ రంగంలో ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాల కారణంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సంయుక్త పరిశోధన, అభివృద్ధి, అత్యాధునిక రక్షణ పరికరాల ఉత్పత్తి, పరస్పర సహకారం మరింతగా మెరుగుపడుతుందని జోయల్ స్టార్ అన్నారు. బలమైన భారత్– అమెరికా ప్రైవేట్‌రంగ భాగస్వామ్యంతో హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఏరోస్పేస్, రక్షణ రంగ ఉత్పత్తి కేంద్రాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
విశాఖ తీరంలో ‘టైగర్ ట్రంప్’
విశాఖ సముద్ర తీరంలో ఇటీవల ‘టైగర్ ట్రంప్’పేరిట తొలిసారిగా ఉభయ దేశాలకు చెందిన త్రివిధ దళాలు మిలిటరీ విన్యాసాలు జరిపాయని జోయల్ స్టార్ వెల్లడించారు. విశాఖ తీరంలో గతేడాది మూడు అమెరికా నావికాదళ నౌకలతో విన్యాసాలు నిర్వహించామన్నారు. ఇండో అమెరికా సైన్యాలు సంయుక్తంగా పనిచేయడం వల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని, ఇందు లో భారత్‌ను తాము వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నామన్నారు. భారత్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో వాణిజ్యం పదేళ్ల కాలంలో 16 బిలియన్ డాలర్లకు చేరడం అభినందనీయమన్నారు. అమెరికా రక్షణ రంగం అనుసరిస్తున్న అత్యున్నత సాంకేతికతను భారత్‌కు అందజేయడంపై సంప్రదింపులు జరుగుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment