సదస్సులో మంత్రి కేటీఆర్‌తో కరచాలనం చేస్తున్న జోయల్ స్టార్. చిత్రంలో జయేశ్ రంజన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాంటి వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రాలను నేరుగా సంప్రదిస్తే అమెరికా పెట్టుబడి సంస్థలు స్థానికంగా ఎదుర్కొనే అవాంతరాల పరిష్కారం దిశగా చొరవ తీసుకుంటామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే అమెరికా సంస్థలకు ప్రోత్సాహం అందించడంతో పాటు మద్దతు ఇస్తామన్నారు. తెలంగాణతో నేరుగా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే సంస్థల పక్షాన వారు ఎదుర్కొనే అవాంతరాల పరిష్కారం కోసం ఢిల్లీ స్థాయిలో గొంతెత్తుతామన్నారు. హైదరాబాద్‌లో భారత్ అమెరికా రక్షణ సంబంధాలపై జరుగుతున్న రెండ్రోజుల అంతర్జాతీయ సదస్సులో భాగంగా బుధవారం కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. అంతర్జాతీయ బిజినెస్ కౌన్సిల్, భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), యూఎస్ రాయబార కార్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు గురువారం ముగియనుంది.
ఐదేళ్లలో గణనీయమైన పురోగతి..
‘రాష్ట్రంలో ఆదిబట్ల, నాదర్‌గుల్, జీఎంఆర్, ఆదానీ ఎయిరోస్పేస్ పార్కులతో పాటు రాష్ట్రం లోని వివిధ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లను కేంద్రంగా చేసుకుని ఎయిరోస్పేస్, డిఫెన్స్ కంపె నీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ రంగానికి అవసరమైన మానవ వనరులను తయారు చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేసే ప్రపంచ స్థాయి ఎయిరోస్పేస్ వర్సిటీ ద్వారా తక్కువ ఫీజులతో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ‘ఎయిరోస్పేస్, డిఫెన్స్‌కు సంబంధించి ప్రైవేటు రంగంలోనూ 25కు పైగా పెద్ద కంపెనీలు, వేయికి పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పనిచేస్తున్నాయి.
ఈ రంగంలో రాష్ట్రంలో గత ఐదేళ్లలో పురోగతి సాధించగా, అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, హనీవెల్ వంటి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఓఈఎం) కంపెనీలు భారీ పెట్టుబడులతో తరలివచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే సికోర్క్సీ హెలికాప్టర్‌తో పాటు, ఎఫ్ 16 యుద్ధ విమానాల రెక్కలు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. భారత్‌లో ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగాల వాటా రూ.1.13 లక్షల కోట్లు కాగా, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉంది’అని కేటీఆర్ అన్నారు.
బంధం మరింత బలోపేతమవ్వాలి: అమెరికా
ఇండో పసిఫిక్ ప్రాంతం లో భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, రెండు దేశాల నడుమ రక్షణ బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరముందని యూఎస్ రాజకీయ, రక్షణ వ్యవహారాల విభాగం డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జోయల్ స్టార్ అన్నారు. 2008 నుంచి ఇరు దేశాల నడుమ రక్షణ రంగ వాణిజ్యం క్రమంగా పెరుగుతూ వస్తోందని, మానవ రహిత యుద్ధ విమానాలు, బాలిస్టిక్ మిసైల్స్ తదితరాలకు సంబంధించిన అత్యున్నత సాంకేతికతను భారత్‌కు అందజేస్తున్నా మని చెప్పారు.
ఇప్పటికే భారత్–అమెరికా కంపెనీలు సంయుక్తంగా సీ130 రవాణా విమానాలు, ఎఫ్ –16 యుద్ధ విమానాలతో పాటు అపాచి యుద్ధ హెలికాప్టర్లను సంయుక్తంగా హైదరాబాద్ లో తయారు చేస్తున్నాయన్నారు. భారత్ కూడా సొంతంగా డిఫెన్స్, ఎయిరోస్పేస్ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని అభినందిస్తున్నామని, రక్షణ రంగంలో పరస్పర సహకారం, సంయుక్త సైనిక విన్యాసాలు, రక్షణ వాణిజ్యం ఉభయ దేశాల నడుమ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా రక్షణ, బయోటెక్, ఐటీ రంగాలకు తెలంగాణ చిరునామాగా మారిందని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్ అన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర రక్షణ రంగ ఉత్పత్తుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment