సాక్షి, కొదాడ : ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను నివారించడానికి, ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఇంకు గుర్తును వేస్తారు. ఇది దాదాపు నెల రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. మరీ ఈ ఇంకుకు పెద్ద చరిత్రే ఉంది. దేశంలో జరిగిన 3వ సాధారణ ఎన్నికల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశం మొత్తానికి అవసరమైన ఈ ఇంకును ఒక కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. 1937 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో ఈ ఇంకు తయ్యారీ పరిశ్రమను ‘‘ మైసూర్ ల్యాక్ అండ్ పెయింట్స్ ’’ పేరుతో స్థాపించారు. మహరాజ నల్‌వాడీ కష్ణరాజ వడయార్ దీని వ్యవస్థాపకులు.తరువాత దీన్ని మైసూర్ పెయింట్స్ వార్నిష్‌గా పేరు మార్చారు.
ప్రస్తుతం ఈ కంపెనీ కర్ణాటక ప్రభుత్వ అధీనంలో నడుస్తోంది. 1962 నుంచి ఎన్నికల సంఘం తమకు అవసరమయ్యే ఇంకును ఈ పరిశ్రమ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది 5, 7,5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ పరిశ్రమ ఈ ఇంకును ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు ఈ పరిశ్రమ కూడా ఆధునికీకరణ చెందింది. ఈ ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్‌పెన్నులను కూడ తయారీ చేస్తుంది. ఇతర దేశాల్లో వీటిని వాడుతున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆప్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొందిస్తుంది. ఇతరులకు దీని తయారీ గురించి తెలియనీయరు.
Comments
Please login to add a commentAdd a comment