మూడు కాళ్లతో శిశువు జననం!
జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ మూడు కాళ్లతో ఉన్న వింత శిశువుకు జన్మనిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన జంపన్న భార్య శ్రీలత రెండవ సంతానంగా మంగళవారం మూడు కాళ్లతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. శ్రీలత గర్భం దాల్చిన నాటి నుంచి జనగామలో ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నది. ఆరు నెలల సమయంలో స్కానింగ్ తీసిన సమయంలో వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు.
కడుపులోని శిశువు కింది భాగంలో అదనంగా మరో అవయవం పెరుగుతుందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రోజువారి కూలీకి వెళితేనే బతుకు బండి నడిచే పరిస్థితుల్లో కాన్పు అయ్యే వరకు దేవునిపై భారం వేసి ఎదురు చూశారు. ఈ నెల 20న రాత్రి పురిటి నొప్పులు రావడంతో ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. కడుపులో ఉన్న శిశువు ఉమ్మ నీరు మింగడంతో వైద్యురాలు స్వప్న నేతృత్వంలో మంగళవారం ఉదయం ఆపరేషన్ చేశారు.
కడుపులోని బిడ్డకు మూడుకాళ్లు ఉండడంతో వైద్యులు సైతం ఒకింత ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మూడు కాళ్లతో శిశువు జన్మించడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనయ్యారు. శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ మూడవ కాలు విషయమై పూర్తిగా అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మూడు కాళ్లతో జన్మించిన శిశువు ఆరోగ్య స్థితిగతులను నిలోఫర్ వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.